సింగరేణిలో కార్మిక సంఘాల సమ్మె ప్రారంభం

ABN , First Publish Date - 2020-07-02T15:08:16+05:30 IST

సింగరేణిలో కార్మిక సంఘాల సమ్మె ప్రారంభం

సింగరేణిలో కార్మిక సంఘాల సమ్మె ప్రారంభం

భూపాలపల్లి:  బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. ఈ ఉదయం షిఫ్ట్ నుంచి అన్ని గనుల్లో సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది. అటు ఇతర రాష్ట్రాల్లోని కోల్ ఇండియా గనుల్లోనూ 72 గంటల సమ్మె ప్రారంభమైంది. ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు వారికి అప్పగించేందుకు నిర్ణయించడం, వేలం ప్రక్రియ కూడా చేపట్టడంతో జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్త మూడు రోజుల సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం ఉదయం సింగరేణిలోనూ కార్మికుల సమ్మె ప్రారంభమైంది. సింగరేణి విస్తరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం నుంచి మొదలు కొమురంభీం జిల్లా వరకు ఉన్న అన్ని భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.


భూపాలపల్లి జిల్లాలో కార్మికుల సమ్మెతో బొగ్గు గనులు నిర్మానుష్యంగా మారాయి. సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు గనుల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. భూపాలపల్లి సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన తెలిపేందుకు కార్మికులు, రాజకీయ పార్టీలు సిద్ధమవుతుండగా...భారీగా పోలీసులు మోహరించారు. అటు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. ఆరు భూగర్భ, నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో  బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల వద్ద పోలీసులు మోహరించారు.


మంచిర్యాల జిల్లాలో కార్మికుల సమ్మెతో  బొగ్గు గనులు బోసి పోతున్నాయి. సమ్మెకు విప్లవ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. బెల్లంపల్లి రీజియన్‌‌లోని అన్ని గనుల్లో సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఆందోళన కొనసాగుతుందని, మూడు రోజుల సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని జాతీయ సంఘాల నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, కెంగర్ల మల్లయ్య పిలుపునిచ్చారు. సమ్మెను విచ్చిన్నం చేసేందుకు టీబీజీకేఎస్‌ ప్రయత్నిస్తోంని అందుకోసమే ఒక రోజు సమ్మెకు పిలుపిచ్చిందని జాతీయ సంఘాల నేతలు ఆరోపించారు. మరోవైపు సింగరేణి సమ్మెలో భాగంగా ఎస్సార్పీ-3 గని వద్ద టీబీజీకేఎస్ నిరసనకు దిగింది. ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, జాతీయ కార్మిక సంఘాల వైఫల్యం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం కలగ వద్దనే ఒక రోజు సమ్మెకు పిలుపు నిచ్చామని రాజిరెడ్డి వివరించారు. 

Updated Date - 2020-07-02T15:08:16+05:30 IST