ఆకాశపు అంచుల దాకా..తెలుగమ్మాయి విజయ పతాక
ABN , First Publish Date - 2021-07-12T20:10:40+05:30 IST
వినువీధిలో తెలుగు పతాక ఎగిరింది! తెలుగమ్మాయి శిరీష బండ్ల (34).. ఆస్ట్రోనాట్ 004గా అంతరిక్షపు అంచుల దాకా వెళ్లొచ్చారు! ఆ ఘనత సాధించిన భారత మహిళలు కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ సరసన నిలిచారు. అంతరిక్ష యాత్రకు వెళ్లిన నాలుగో ఇండియన్‌గా చరిత్ర సృష్టించారు. ‘‘పెరిగి, పెద్దయి వ్యోమగామిగా అంతరిక్షంలోకి దూసుకుపోవాలి’’ అని..
ఆ ఘనత సాధించిన మూడో భారతీయ మహిళగా శిరీష
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన ‘మిషన్ యూనిటీ 22’ సక్సెస్
ఆ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ సహా ఆరుగురితో
ఔటర్‌స్పేస్‌లోకిదూసుకెళ్లిన యూనిటీ స్పేస్ షిప్
నాలుగు నిమిషాలపాటు భారరహిత స్థితిలో బ్రాన్సన్ బృందం
అంతరిక్ష పర్యాటకం దిశగా కీలక తొలి అడుగు
హ్యూస్టన్, జూలై 11: వినువీధిలో తెలుగు పతాక ఎగిరింది! తెలుగమ్మాయి శిరీష బండ్ల (34).. ఆస్ట్రోనాట్ 004గా అంతరిక్షపు అంచుల దాకా వెళ్లొచ్చారు! ఆ ఘనత సాధించిన భారత మహిళలు కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ సరసన నిలిచారు. అంతరిక్ష యాత్రకు వెళ్లిన నాలుగో ఇండియన్‌గా చరిత్ర సృష్టించారు. ‘‘పెరిగి, పెద్దయి వ్యోమగామిగా అంతరిక్షంలోకి దూసుకుపోవాలి’’ అని చిన్నప్పుడు తాను కన్న కలలను ఆమె నిజం చేసుకున్నారు. ‘వీఎ్‌సఎస్ యూనిటీ’ వ్యోమనౌకలో.. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, మరో నలుగురితో కలిసి ఆదివారంనాడు ఆమె అంతరిక్షంలోకి దూసుకుపోయారు. అంతేకాదు.. ఈ యాత్రతో అంతరిక్ష యానంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఆకాశం గురించి అన్నీ చదువుకుని, తెలుసుకున్న ఆస్ట్రొనాట్లే కాక.. ఆసక్తి ఉన్న మామూలు పౌరులు సైతం ఆకాశపు అంచుల దాకా వెళ్లడానికి కొత్త దారులు తెరుచుకున్నాయి!! రిచర్డ్ బ్రాన్సన్ చేపట్టిన మిషన్ యూనిటీ 22.. వాణిజ్యపరమైన అంతరిక్ష యానాలకు నాందీవాచకమైంది.
భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ మిషన్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, వాతావరణం అనుకూలించక పోవడంతో గంటన్నర ఆలస్యంగా రాత్రి 8 గంటల తర్వాత మొదలైంది. న్యూమెక్సికో (అమెరికా)లోని జోర్నాడా డెల్ ముయెర్టో ఎడారిలో నిర్మించిన ‘స్పేస్‌పోర్ట్ అమెరికా’ బేస్ నుంచి వీఎంఎస్ ఈవ్ వాహక విమానం.. బ్రాన్సన్ బృందంతో కూడిన యూనిటీ’ స్పేస్‌షి్‌పను మోసుకుంటూ.. కొత్త భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ రయ్యిన నింగిలోకి దూసుకుపోయింది. ఆ విమానం అలా గాల్లో దాదాపు 13 కిలోమీటర్ల ఎత్తుకు చేరాక.. ‘‘యూనిటీ’’ స్పేస్ షిప్ దాన్నుంచి విడివడింది. అది రాకెట్ శక్తితో పనిచేసే వ్యోమనౌక. వీఎంఎ్‌సఈవ్ వాహక విమానం నుంచి విడివడ్డాక.. వీఎ్‌సఎస్ యూనిటీ వ్యోమనౌకకున్న రెండు ఇంజన్లను మండించడం ద్వారా వారు మాక్ 3 వేగంతో (శబ్దానికి మూడు రెట్లు) పైపైకి ప్రయాణించి భూమి నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. అంటే.. ఆకాశం అంచుల దాకా చేరుకున్నారన్నమాట.
ఆ దశలో.. స్పేస్ షిప్‌లో ఉన్నవారికి నాలుగు నిమిషాలపాటు భార రహిత స్థితి అనుభవంలోకి వచ్చింది. స్పేస్‌షి్‌పకున్న 17 కిటికీల ద్వారా వారు.. నీలిరంగులో మెరిసిపోతున్న భూమి అంచులను చూశారు. కొన్నినిమిషాలపాటు ఆ అద్భుత అనుభవాన్ని ఆస్వాదించాక స్పేస్ షిప్ తిరుగుముఖం పట్టి భూమి దిశగా ప్రయాణించింది. మళ్లీ క్షేమంగా అదే స్పేస్‌పోర్ట్ అమెరికా బేస్‌లోని రన్‌వేపై దిగింది. అందరి హర్షధ్వానాల మధ్య బ్రాన్సన్ బృందం, పైలట్లు అందులోంచి బయటకు వచ్చారు. పదిహేడేళ్ల కృషి తమను అంత దూరం తీసుకెళ్లిందని బ్రాన్సన్ ఆనందంగా ప్రకటించారు. మిషన్ విజయవంతమైనందుకు తన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దీన్ని జీవితకాల అనుభవంగా పేర్కొన్నారు. దీంతో.. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘యూనిటీ 22’ యాత్ర ముగిసినట్టయింది. కానీ.. అంతం కాదిది ఆరంభమది. ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు.. అంతరిక్షంలో విహరించాలన్న ఆసక్తి ఉన్న అపరకుబేరులకు కొత్తదారులు తెరిచిన క్షణమది!!
మిషన్.. ప్రీపోన్
1998లో జాన్ గ్లెన్ (77) తర్వాత.. 70 ఏళ్లు దాటిన ఒక వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే. వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ (71) ఆ ఘనత సాధించారు. నిజానికి ఈ యాత్ర ఇప్పుడు జరగాల్సింది కాదు. బ్రాన్సన్ మరికొద్ది రోజుల తర్వాత దీన్ని నిర్వహించాలనుకున్నారు. కానీ.. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ జూలై 20న అంతరిక్షంలోకి వెళ్లనుండడంతో ఆయనకన్నా ముందు తాను వెళ్లాలనే ఉద్దేశంతో తన యాత్రను ముందుకు జరిపారు. కాగా.. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈ మిషన్ నిర్వహించడానికి ముందు విస్తృత పరీక్షలు నిర్వహించింది. 2014లో నిర్వహించిన పరీక్షల్లో ఒక పైలట్ మరణించడంతో.. అలాంటి ఒక్క ప్రమాదం కూడా జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వీఎ్‌సఎస్ యూనిటీ వ్యోమనౌకను ప్రయోగాత్మకంగా 2018లో, 2019లో, మళ్లీ ఈ ఏడాది మేలో అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. అంతా సరిగ్గానే ఉందని నిర్ధారించుకున్నాకే.. బ్రాన్సన్ ఈ మిషన్‌ను ముందుకు జరిపి, తాను అనుకున్నది సాధించారు.
బ్రాన్సన్.. భారతీయ మూలాలు
బ్రిటిష్ బిజినెస్ మాగ్నెట్ అయిన బ్రాన్సన్‌కు భారతీయ మూలాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా 2019 డిసెంబరులో.. ముంబై నుంచి లండన్‌కు ప్రయాణించే వర్జిన్ గెలాక్టిక్ విమాన ప్రారంభోత్సవం సందర్భంగా వెల్లడించారు. ఇంతకీ ఏమిటా సంబంధం అంటే.. ఆయన ముత్తాతల్లో ఒకాయన భార్య భారతీయురాలే. డీఎన్‌ఏ పరీక్షల ప్రకారం ఇదంతా 1793 సమయంలో జరిగిందని.. ఆవిడ పేరు అరియా అని.. ఆవిడ స్వగ్రామం తమిళనాడులోని కడలూరు అని బ్రాన్సన్ తెలిపారు. ఆవిడ ఇండియన్ కాబట్టి తనలోనూ ఆ జన్యువులున్నాయని.. ఎవరైనా భారతీయులు కనపడితే.. ‘మనం బంధువులమేమో’ అని అంటానని బ్రాన్సన్ చమత్కరించారు.
గుంటూరమ్మాయి చరిత్ర సృష్టించింది : ఏపీ సీఎం, గవర్నర్
గుంటూరమ్మాయి బండ్ల శిరీష.. వర్జిన్ గెలాస్టిక్ అధినేత రిచర్డ్ బ్రౌన్ సహా ఐదుగురు వ్యోమగాములతో కలసి రోదసీయానం చేయడం ద్వారా చరిత్ర సృష్టించిందని ఏపీ జగన్ పేర్కొన్నారు. శిరీష కారణంగా ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచమంతా మార్మోగిందని జగన్ తెలిపారు. 34 ఏళ్ల శిరీష తన రోదసీయానాన్ని విజవంతంగా పూర్తిచేసుకుని సగర్వంగా రావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే, వ్యోమనౌకలో శిరీష విజయవంతంగా ప్రయాణించడం అభినందనీయమని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. మరెన్నో విజయ శిఖరాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఆ నలుగురూ...
ఈ మిషన్‌లో రిచర్డ్ బ్రాన్సన్‌ను ఆస్ట్రొనాట్ 001గా వ్యవహరించారు. భవిష్యత్తులో తమ వ్యోమనౌకల ద్వారా అంతరిక్షంలోకి (ఔటర్ స్పేస్) పంపే యాత్రికులకు ఆ అనుభవం తాము సరిగ్గా ఇవ్వగలమా లేదా ఈ యాత్ర ద్వారా తెలుసుకోవడమే ఆయన పని. అర్థమయ్యేలా చెప్పాలంటే.. క్వాలిటీ టెస్టింగ్ లాంటిది. ఆయన తర్వాత కీలకస్థానం బెత్‌మోజె్‌సది (ఆస్ట్రొనాట్ 002). ఆమే ఈ స్పేస్ షిప్ క్యాబిన్ లీడ్. టెస్ట్ డైరెక్టర్. మూడో స్థానం.. క్యాబిన్ ప్రొసీజర్స్‌ను సమీక్షించే కొలిన్ బెన్నెట్‌ది (ఆస్ట్రొనాట్ 003). మన బండ్ల శిరీషది (ఆస్ట్రొనాట్ 004) నాలుగో స్థానం. ఆమె పాత్ర.. రిసెర్చర్ ఎక్స్‌పీరియెన్స్. ఇందులో భాగంగా మైక్రోగ్రావిటీలో మొక్కల్లో జరిగే మార్పుల గురించి పరిశోధన చేశారు.
రూ.1.86 కోట్ల యాత్ర
అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే ఔత్సాహికులకు ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడమే వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ లక్ష్యం. నిజానికి రోదసి యానం ఆయన సొంత కల కూడా. గతంలో కూడా డెన్నిస్ టిటో, అరబ్ సుల్తాన్ వంటి అపరకుబేరులు అంతరిక్ష యానం చేశారుగానీ.. అందుకు వారు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఉదాహరణకు డెన్నిస్ టిటో 1991 నుంచి నాసాను బతిమాలినా ఆయన అభ్యర్థనను నాసా అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన రష్యా స్పేస్ ఏజెన్సీని అభ్యర్థించి దాదాపు రూ.148 కోట్లు ఖర్చు పెట్టి 2001లో రోదసిలోకి వెళ్లగలిగారు. అంత ఇబ్బంది లేకుండా, డబ్బు పెట్టగలిగే స్థోమత ఉన్నవాళ్లు.. సులువుగా అంతరిక్షంలోకి వెళ్లడానికి అవకాశం కల్పించడమే వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఉద్దేశం.
రిచర్డ్ బ్రాన్సన్ 2004లో ఈ సంస్థను స్థాపించారు. ఆయన కల వచ్చే ఏడాది నెరవేరనుంది. 2022లో.. ఔత్సాహిక యాత్రికులను మోసుకుంటూ వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక అంతరిక్షంలోకి దూసుకుపోనుంది. ఈ యాత్ర కోసం ఇప్పటికే 58 దేశాలకు చెందిన 600 మందికిపైగా కోటీశ్వరులు టికెట్లు బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఆ ప్రముఖుల్లో.. లియొనార్డో డికాప్రియో, బ్రాడ్‌పిట్, ఏంజెలీనా జోలీ, రసెల్ బ్రాండ్, లేడీ గాగా, కేటీ పెర్రీ, జస్టిన్ బీబర్ వంటివారున్నట్టు సమాచారం. ఒక్కో టికెట్ ధర దాదాపుగా 2.5 లక్షల డాలర్లుగా చెబుతున్నారు. అంటే దాదాపుగా రూ.1.86 కోట్లు.