ఆరేళ్ల పాపపై హత్యాచారం

ABN , First Publish Date - 2021-09-12T07:57:03+05:30 IST

అభంశుభం తెలియని ఆరేళ్ల పాప.. బస్తీలో ఆడుకుంటూ కనిపించకుండా..

ఆరేళ్ల పాపపై హత్యాచారం

గంజాయి మత్తులో వ్యక్తి దుర్మార్గం.. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం, హత్య

అక్కడే మృతదేహం.. తాళం వేసి పరార్‌.. సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఘటన.. స్థానికుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

నిందితుడి ఇంట్లో సామగ్రి ధ్వంసం.. తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి.. పోలీసులపై కారం, రాళ్లతో దాడి.. గాయాలు

నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని గిరిజన, ప్రజాసంఘాల ధర్నా.. సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం

50లక్షలు, మూడెకరాలు ఇవ్వాలని డిమాండ్‌.. పోలీసుల అదుపులో నిందితుడు!.. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: సత్యవతి

సైదాబాద్‌,సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అభంశుభం తెలియని ఆరేళ్ల పాప.. బస్తీలో ఆడుకుంటూ కనిపించకుండా పో యింది. గణేశ్‌ ఉత్సవ ఏర్పాట్లను చూసేందుకు సమీపంలోని మండపాల వద్దకు వెళ్లి ఉంటుందేమో అనుకొని చుట్టుపక్కలంతా వెతికారు. రెండు గంటలు గడిచిపోయాయి. పోలీసులూ వచ్చి వెతికారు. అంతలో.. ‘ఆ దుర్మారుడే ఎత్తుకుపోయి.. ఏదైనా ఘోరం తలపెట్టి ఉంటాడేమో’నని  తల్లిదండ్రుల్లో ఓ ఆందోళన. తీరా అను మానించినట్టే ఇంటి పక్కనే ఉండే ఆ దుర్మార్గుడు.. చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. గురువారం సైదాబాద్‌ సింగరేణి గుడిసెల కాలనీలో ఈ విషాదం జరిగింది. 


నిందితుడు యాదాద్రి జిల్లా అడ్డగూడూరు చెం దిన రాజు (30). కొన్నేళ్ల క్రితం నగరానికి భార్యతో వచ్చి సైదాబాద్‌ సింగరే ణికాలనీ రేకుల షెడ్డులో ఉంటున్నాడు. ఆటో తోలుతుంటాడు. గంజాయికి బానిసై చిల్లర దొంగతనాలకు మరిగాడు. అతడి వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో గంజాయి మత్తులో ఉన్న ఆ దుర్మార్గుడు.. తన గుడి సె సమీపంలో ఆడుకుంటున్న అరేళ్ల గిరిజన చిన్నారికి ఖారా పొట్లం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు రాత్రి 7 గంటల సమయంలో సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు వెంటనే సింగరేణి కాలనీ సమీప ప్రాంతాలతో పాటు, గణేశ్‌ మండపాల వద్ద సీసీ కెమెరాల పుటేజ్‌ను పరిశీలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో చిన్నారి కుటుంబ సభ్యులకు రాజుపై అనుమానం వచ్చింది. అర్ధరాత్రి 12 గంటలకు గుడిసెవాసులు రాజు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా చిన్నారి నేలమీద విగతజీవిగా పడివుంది. స్థానికులు, నిందితుడి ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. నిందితుడిని అప్పగించేంత వరకు మృతదేహాన్ని తరలించడానికి వీల్లేదని పోలీసులను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేసి.. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులపై గుడిసెలవాసులు కారం చల్లి, రాళ్లు, రేకులతో దాడి చేశారు. ఈ ఘటనలో సైదాబాద్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ తలకు గాయం కాగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సహా నలుగురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. 


ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ ధర్నా 

కామాంధుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని, బాధిత కుటుంబాన్ని  ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష నేతలు, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బాధిత చిన్నారి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం చంపాపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌  ఘటనాస్థలానికి చేరుకుని.. బాధిత కుటుంబానికి పరిహారంగా రూ.15 లక్షలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. శాంతించని ఆందోళనకారులు నిందితుడిని  ఎన్‌కౌంటర్‌ చేయాలని, బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు, మూడు ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మూడు ఎకరాల భూమి మంజూరయ్యే విధంగా కృషి చేస్తానని కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, నిందితుడు రాజును అతడి స్వగ్రామమైన అడ్డగూడూరులో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం తూర్పు మండలం టాస్క్‌పోర్సు పోలీసులు నగరానికి తరలించి రహస్య ప్రాంతంలో నిందితుడిని విచారిస్తున్నట్లు తెలిసింది. చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.  కాగా చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్‌ హామీ ఇచ్చారు. బాలిక కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 50 వేలు అందించామని వెల్లడించారు.   

Updated Date - 2021-09-12T07:57:03+05:30 IST