బానిసల భవన్‌!

ABN , First Publish Date - 2021-06-05T06:47:00+05:30 IST

‘‘తొలిసారి 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు వరకూ సీఎంవోలో ఒక్క ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ ఉన్నారా? సంక్షేమ పథకాలు అందించే సీఎం ఆఫీసులో ఇప్పటి వరకూ ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆఫీసర్‌

బానిసల భవన్‌!

ప్రగతి భవన్‌లో మంత్రులకు, అధికారులకు స్వేచ్ఛ లేదు

కుక్కిన పేనులా ఉండడం లేదనే తొలగించారు

నాతోపాటు హరీశ్‌ రావుకూ ఎన్నో అవమానాలు

రాచరిక పాలన కొనసాగించాలనుకుంటున్నారు

మంత్రులు, ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదు

కుట్రలు, అణచివేత, డబ్బు సంచులను నమ్ముకున్నారు

హుజూరాబాద్‌ ఎన్నికల్లో వాటిని ఛేదించి తీరుతాం

సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఈటల

సీఎంవోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులేరీ?

ధర్నా చౌక్‌ను ఎత్తేసిన చరిత్ర కేసీఆర్‌ది

సమ్మెలతో సమస్యలు పరిష్కారం కావంటున్నారు

సమైక్య పాలకులు ఇలా చేస్తే తెలంగాణ వచ్చేదా?

విపక్ష ఎమ్మెల్యేలను కొనుక్కోవడం అవసరమా?

పాత ఉద్యమకారులు ఒక్కటి కావడం ఖాయం

నా నెత్తిని మీరు కొడితే.. మిమ్మల్ని కొట్టేవారు వస్తారు

ఇక నుంచి రోజూ చేరికల జాతరలే: ఈటల

టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై.. 19 ఏళ్ల బంధానికి రాంరాం

ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా

ఏనుగు రవీందర్‌ రెడ్డి, తుల ఉమ సహా పలువురు టీఆర్‌ఎస్‌ నేతలూ రాజీనామా


‘‘ఈరోజు నేను చివరివాడిని కాదు. గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతి, కోదండరాం వంటివారిని కూడా బయటకు పంపించిండ్రు. నరేంద్రనయితే పాస్‌పోర్టుల కేసు అని చెప్పి భయపెట్టిండ్రు.. పాత ఉద్యమకారులు ఒక్కటి కావడం ఖాయం. ఇక నుంచి రోజూ జాతరలే. నా నెత్తిని మీరు కొట్టారు. మిమ్మల్ని కొట్టేవారు మరొకరు వస్తారు’’ అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఈటల అన్నారు.


హైదరాబాద్‌, మేడ్చల్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ‘‘తొలిసారి 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు వరకూ సీఎంవోలో ఒక్క ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ ఉన్నారా? సంక్షేమ పథకాలు అందించే సీఎం ఆఫీసులో ఇప్పటి వరకూ ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆఫీసర్‌ లేరు. వైద్య శాఖ సమీక్ష జరుగుతది. కానీ, సంబంధిత మంత్రి ఆ సమావేశంలో ఉండరు. ఆర్థిక శాఖ సమీక్ష జరుగుతది. కానీ, ఆ విషయం మంత్రికి తెలవదు. ఏ శాఖలోనైనా మంత్రికి, అధికారులకు స్వేచ్ఛ లేదు. వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకోరు. అది ప్రగతి భవన్‌ కాదు. బానిసల నిలయం అని పెట్టుకోండి’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాజ్యాంగం అవసరం లేకుండా రాచరిక పాలన కొనసాగించాలని కేసీఆర్‌ భావిస్తున్నారని ఆరోపించారు. తాను బానిసను కాదని, ఉద్యమ సహచరుడినని స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమ్మకం లేనప్పుడు నాలుగు కోట్ల మంది ప్రజలను పాలించే అర్హత మీకెక్కడిదని నిలదీశారు. ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రలు, కుతంత్రాలు, అణచివేత, డబ్బు సంచులను మాత్రమే నమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణ చేశారు. వాటిని ఛేదించి తీరతామని తేల్చి చెప్పారు. కొద్ది రోజుల కిందట కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల.. శుక్రవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌, ఆయన తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దళిత మాజీ ఎమ్మెల్యే ఒకరు తన కుటుంబ పోషణ కోసం నిమ్స్‌లో ఔట్‌సోర్సింగ్‌ పోస్టు ఒకటి కోరారు. ఇప్పిస్తానని వైద్యశాఖ మంత్రిగా నేను హామీ ఇచ్చాను. అయితే ఇవ్వొద్దని గంటలోపే నాకు ఫోన్‌ వచ్చింది. ఆ మాజీ ఎమ్మెల్యే పేరు, ఫోన్‌ వచ్చిన సమయం వెల్లడించేందుకు సిద్ధం’’ అని ప్రకటించారు.


తెచ్చుకున్న గోదాములను కేసీఆర్‌ మూసేసిండు

ఉరిశిక్ష పడ్డ వ్యక్తిని కూడా చివరి కోరిక కోరుకో అని అంటారని, కానీ, ఈ రాజుగారి పాలనలో మంత్రిపై అనామకుడు ఉత్తరం రాస్తే, కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా రాత్రికి రాత్రే విచారణ చేసి శాఖ నుంచి బర్తరఫ్‌ చేశారని కేసీఆర్‌పై ఈటల మండిపడ్డారు. తనను బొంద పెట్టాలని హరీశ్‌, లక్ష్మణ్‌రావు, రవీందర్‌రావులకు రాజుగారు ఆదేశాలు ఇచ్చారన్నారు. గతంలో బొత్స, రఘువీరా మంత్రులుగా ఉన్నప్పుడు తాను గోదాములు తెచ్చుకుంటే, ఇప్పుడు కేసీఆర్‌ వాటిని మూసివేశారని ఆరోపించారు. తాను తిరుగుబాటు చేయలేదని, కొత్త పార్టీ ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు.


ఐదేళ్ల కిందటే కేసీఆర్‌తో గ్యాప్‌

కేసీఆర్‌కు, తనకు మధ్య గ్యాప్‌ ఐదేళ్ల కిందటే వచ్చిందని ఈటల వెల్లడించారు. కేసీఆర్‌కు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశామని, ఆయన అందుబాటులో లేకపోవడంతో చివరకు ఆయన సన్నిహితులు, సీఎంవో అధికారులకు చెప్పామని తెలిపారు. ‘‘కేసీఆర్‌పై ఉన్న ప్రేమ, అనుబంధంతో జిల్లా మంత్రిగా నేను, 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి మొదటిసారి ఆయనను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లాం. కరీంనగర్‌ జిల్లా సమస్యలపై మాట్లాడాలని భావించాం. కానీ, గేటు దగ్గరే ఆపేసిండ్రు. సీఎంను కలవకపోయినా మంచిదే. ఇజ్జత్‌ కోసం అలా లోనికి వెళ్లి వస్తమని చెప్పినా అనుమతి ఇవ్వలే. ఆనాడే నా ఆత్మ గౌరవం దెబ్బతిన్నది. రెండోసారి, కేసీఆర్‌కు మందు గోలీలు ఇచ్చే రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ రావుకు ఫోన్‌ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నం. అప్పుడు కూడా లోనికి అనుమతి ఇవ్వలె. గేటు నుంచి బయటకు పంపిండ్రు. మూడోసారి కూడా ఇంతే. అందుకే, బానిస కంటే అధ్వానమైన మంత్రి పదవి ఎందుకు అని అనుకున్నం. గోలీల ఎంపీ అయిన సంతో్‌షకు కోపంతో.. ప్రగతి భవన్‌ కాదు.. ఇది బానిస నిలయం అని పెట్టుకో అని ఆనాడే చెప్పిన’’ అని వెల్లడించారు. తెలంగాణ ఇస్తే.. మీకు పాలన నైపుణ్యం లేదని, రజాకార్ల రాజ్యం అవుతదని, కుక్కలు చింపిన విస్తరి అవుతదని సమైక్య పాలకులు విమర్శించారని, ఆ పరిస్థితి రాకూడదనే ఇన్ని రోజులు అవమానాలు భరించామని అన్నారు. తనతోపాటు మంత్రి హరీశ్‌ కూడా ఎన్నో అవమానాలకు గురయ్యాడని తెలిపారు.


ఐటీ కట్టేవాళ్లకు రైతుబంధు వద్దనడం తప్పా?

సంక్షేమ పథకాలను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఈటల చెప్పారు. ‘‘ఐటీ కట్టే వాళ్లకు రైతుబంధు ఇవ్వవద్దు అనడం తప్పా? భూమి దున్నడం కూడా తెలియనివాడు బెంజ్‌ కార్లో వెళ్లి లక్షలకు లక్షలు రైతుబంధు డబ్బులు తీసుకుంటే పేద ప్రజలు ఏం కావాలి?’’ అని కేసీఆర్‌ను ఈటల నిలదీశారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చిన ధర్నా చౌక్‌ను ఎత్తివేసిన చరిత్ర కేసీఆర్‌ది అని, ఇవన్నీ అడక్కూడదా? అని నిలదీశారు. ‘‘సమ్మె చేయడం కార్మికులు, ఉద్యోగుల హక్కు అని ఉద్యమంలో మీరు అనలేదా? కానీ, ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి? సమ్మెలు చేస్తే సమస్య పరిష్కారం కాదు ఇప్పుడు. ఆనాడు సమైక్య పాలకులు కూడా ఇలాగే చేస్తే తెలంగాణ వచ్చేదా?’’ అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో వరవరరావు జైల్లో ఉంటే వెళ్లిన కేసీఆర్‌, ఇప్పుడు ఆయన్ను జైల్లో ఉంచితే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకున్నా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుక్కోవడం అవసరమా? అని నిలదీశారు. తమను అడుగుతున్నాడని, కుక్కిన పేనులా ఉంటలేడనే తనను తొలగించారని చెప్పారు. రోషం కలిగిన తెలంగాణ బిడ్డను కాబట్టే.. సమైక్య పాలకుల ప్రలోభాలకు లొంగలేదని, నయీం బెదిరింపులను లెక్కచేయలేదని, ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి బానిసలా బతకమంటే సాధ్యమా? అని ప్రశ్నించారు.


ఎమ్మెల్యే పదవి నుంచి తనను ఎలా తొలగించాలా అని పార్టీ అధినేత చూస్తున్నట్లు మీడియాలో చదివానని, ‘బతికి చెడకు బిడ్డా’ అని తన నియోజకవర్గ ప్రజలు చెప్పారని, అందుకే.. టీఆర్‌ఎస్‌తో 19 ఏళ్ల అనుబంధానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ‘‘నాకు పదవులు ఇవ్వలేదని నేను ఎప్పుడూ అనలేదు. ఉద్యమ బిడ్డగా నిలబడ్డాను. కర్నూలు రోడ్ల మీద రక్తం చిందించింది మేమే.. సాగరహారంలో ఉన్నది మేమే.. మానుకోట పోరులో ఉన్నది మేమే.. మస్కా కొడితే మంత్రి పదవి ఇవ్వలేదు.. ఒళ్లు వంచి కొట్లాడి తెచ్చుకున్న పదవి ఇది.’’ అని స్పష్టం చేశారు.


కేసీఆర్‌ ఇచ్చిన బీఫాంతో అందరూ గెలవలేదు

కేసీఆర్‌ బీఫాం ఇచ్చినంత మాత్రాన అందరూ గెలవలేదని, ఆయన బంధువు కరీంనగర్‌లో, కూతురు నిజామాబాద్‌లో ఓడిపోయారని ఈటల గుర్తు చేశారు.  గతంలో 17 మంది రాజీనామా చేసి పోటీ చేస్తే గెలిచిన ఏడుగురిలో నేను ఒకడిని. 2009లో మహా కూటమితో కలిసి 50పైచిలుకు స్థానాల్లో పోటీ చేస్తే గెలిచిన 10 మందిలో నేను ఒకడిని. 


ఆ సంఘంతో కవితకు ఏం సంబంధం?

తెలంగాణ కోసం బొగ్గు గని, ఆర్టీసీ, విద్యుత్తు సంఘాలను తాము పెట్టించామని, కానీ ఇప్పుడు బొగ్గు గని కార్మిక సంఘం నాయకురాలిగా కవిత ఉన్నారని, దానితో ఆమెకు ఏంసంబంధమని ఈటల ప్రశ్నించారు. ‘‘విద్యు త్తు  సంఘం పెట్టించింది కొప్పుల ఈశ్వర్‌. కానీ, నడపాలని చూస్తున్నది కవిత. ఆర్టీసీ సంఘం పెట్టించింది హరీశ్‌. నడపాలని చూస్తున్నది కవిత’’ అని చెప్పారు. ఇప్పుడు సంఘాలకు హక్కులు లేకుండా చేశారన్నారు.


కాపాలా కాసినోళ్లు ఇప్పుడు బయటకు

‘‘కేటీఆర్‌ నేతృత్వంలో పని చేస్తామని నాతోపాటు హరీశ్‌ కూడా అన్నడు. నేను బానిసను కాదు. వారసత్వంగా ఇచ్చుకో. కానీ, మా ఆత్మాభిమానం మీద దెబ్బకొట్టకు. మీకంటే ఉన్నతంగా ఉండాలని నేనెప్పుడూ కోరుకోలే’’ అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఈటల వ్యాఖ్యానించారు. లాలు ప్రసాద్‌, జయలలిత, మాయావతిలాగా కుటుంబాలు పెట్టిన పార్టీ టీఆర్‌ఎస్‌ కాదని తేల్చి చెప్పిన ఈటల.. పార్టీ కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఇంట్లోని వాళ్లు బయటకు పోతున్నారని, ఒకప్పుడు ఖబడ్దార్‌ అని కేసీఆర్‌ను హెచ్చరించినోళ్లు ఇప్పుడు ఆయన పక్కన ఉన్నారని విమర్శించారు. కేసీఆర్‌కు దిక్కు లేనినాడు ఆయనను కాపలా కాసిన వాళ్లను ఇప్పుడు బయటకు పంపించారని ఉద్యమకారులు కన్నీళ్లు పెడుతున్నారని చెప్పారు.  


రవీందర్‌రెడ్డి, తుల ఉమ రాజీనామా

ఈటల బాటలోనే పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు నడిచారు. టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, మల్కాజిగిరి మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ వీకే మహేశ్‌ ముదిరాజ్‌, మేడ్చల్‌ బ్రాహ్మణ సేవా సంఘం మహిళా అధ్యక్షురాలు నాగకుమారివేములవాడ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి గండ్ర నళిని, మల్కాజిగిరి బిల్డర్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు హన్మంతరావు, ఇల్లంతకుంట ఎంపీపీ పావని  తదితరులు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఈటల ప్రకటించారు.  


నియంతనని ప్రకటించుకోలేదా!?

సీఎం కేసీఆర్‌కు చట్టం మీద నమ్మకం లేదని ఈటల ఆరోపించారు. ‘‘ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏంది? మంత్రులేంది? సక్కక నా ఒక్కడికే ఓటేస్తే నేను పాలించుకుంట కదా..! అని కేసీఆర్‌ అనుకుంటరు. కానీ, మీరు రాచరికం నుంచి రాలె. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం సాక్షిగా ప్రజలు ఓటేస్తే మీరు సీఎం అయ్యారన్న సంగతి మరచిపోవద్దు. పార్టీ నాయకులకు స్వేచ్ఛ ఇస్తే పార్టీని, నన్ను కోఠి చౌరస్తాలో అమ్ముకుంటరని మీరు అనలేదా? అది సాధ్యమేనా? అవును.. నేను నియంతనే అని మీకు మీరు ప్రకటించుకోలేదా? ప్రజాస్వామ్యంలో నియంతలకు చోటు ఉంటుందా?’’ అని నిలదీశారు.  


డబ్బు సంచులను ఛేదిస్తాం

‘‘మీ నియోజకవర్గంలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. డబ్బును, కుట్రలను, అణచివేతలను కేసీఆర్‌ నమ్ముకున్నడు. డబ్బు సంచులతో కుట్రలతో గెలుపు తాత్కాలికమే. తెలంగాణ సమాజంలో వీటికి స్థానం లేదు. హుజురాబాద్‌ ఎన్నికలో వీటిని ఛేదించి తీరుతం’’ అని సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్‌ విసిరారు. హుజురాబాద్‌లో ఏ ఎన్నిక జరిగినా తామే గెలిపించుకున్నామని, వీళ్లు కన్నెత్తి కూడా చూడలేదని ఈటల తెలిపారు. ఇప్పుడు డబ్బులతో ప్రలోభపెడుతున్నారని, బిల్లులు రావని, పనులు రావని బెదిరిస్తున్నారని, అయినా, నియోజకవర్గ ప్రజలు తనకే మద్దతు ఇస్తున్నారని చెప్పారు. దాడులు, కుట్రలు, కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో ఛేదించి తీరుతామన్నారు.



Updated Date - 2021-06-05T06:47:00+05:30 IST