జిదాన్‌సెక్‌ సంచలనం

ABN , First Publish Date - 2021-06-09T06:00:49+05:30 IST

హోరాహోరీ పోరులో అద్భుత విజయాన్ని సొంతం చేసుకొన్న అన్‌సీడెడ్‌ తమారా జిదాన్‌సెక్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీ్‌సకు దూసుకెళ్లింది. తనకంటే మెరుగైన ర్యాంకర్‌ (33వ) పౌలా బడోసా గిబర్ట్‌పై...

జిదాన్‌సెక్‌ సంచలనం

  • గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరిన స్లొవేనియా క్రీడాకారిణిగా రికార్డు
  • సెమీ్‌సలో అనస్తాసియాతో ఢీ
  • ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: హోరాహోరీ పోరులో అద్భుత విజయాన్ని సొంతం చేసుకొన్న అన్‌సీడెడ్‌ తమారా జిదాన్‌సెక్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీ్‌సకు దూసుకెళ్లింది. తనకంటే మెరుగైన ర్యాంకర్‌ (33వ)  పౌలా బడోసా గిబర్ట్‌పై నెగ్గిన తమారా.. ఓ గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌కు చేరిన తొలి స్లొవేనియా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. జిదాన్‌సెక్‌ తరహాలోనే రష్యా క్రీడాకారిణి అనస్తాసియా పవ్‌ల్యుచెన్‌కొవా కూడా తొలి సారి సెమీ్‌సకు చేరుకొంది. ఫైనల్లో చోటు కోసం తమారాతో 31వ సీడ్‌ అనస్తాసియా అమీతుమీ తేల్చుకోనుంది. కాగా, డిఫెండింగ్‌ చాంప్‌ ఇగా స్వియటెక్‌ క్వార్టర్స్‌కు చేరుకొంది. 

పోరు రసవత్తరం..: రొలాండ్‌ గారో్‌సలో ఎప్పుడూ రెండో రౌండ్‌ దాటని అనామకురాలైన 23 ఏళ్ల జిదాన్‌సెక్‌.. ఈసారి ఏకంగా సెమీ్‌సకు దూసుకెళ్లడం విశేషం. మంగళవారం ఉత్కంఠభరితంగా జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో వరల్డ్‌ 85 ర్యాంకర్‌ తమారా జిదాన్‌సెక్‌ 7-5, 4-6, 8-6తో పౌలా బడోసా గిబర్ట్‌ (స్పెయిన్‌)ను ఓడించింది. 2 గంటల 26 నిమిషాలపాటు సాగిన పోరులో ఇరువురు ప్లేయర్లు దీటుగా తలపడడంతో మ్యాచ్‌ ఆసాంతం ఎంతో రసవత్తరంగా సాగింది. తొలి సెట్‌లో తమారా 0-3తో వెనుకబడినా ఆ తర్వాత పుంజుకొని 3-3తో సమం చేసింది. అక్కడి నుంచి ఆధిక్యం చేతులు మారుతూ సాగడంతో ఇద్దరూ 5-5తో సమంగా నిలిచారు. అయితే, వరుసగా రెండు గేమ్‌లు సొంతం చేసుకొన్న జిదాన్‌సెక్‌.. తొలి సెట్‌ను కైవసం చేసుకొంది. కానీ, రెండో సెట్‌లో బడోసా అనూహ్య ఎదురుదాడితో తమారాకు ఝలక్‌ ఇచ్చింది. 2-4తో వెనుకంజలో ఉన్న సమయంలో స్పెయిన్‌ క్రీడాకారిణి వరుసగా నాలుగు గేమ్‌లు నెగ్గి 6-4తో రెండో సెట్‌ను దక్కించుకొంది. ఇక నిర్ణాయక మూడో సెట్‌లో తమారా, బడోసా నువ్వానేనా అన్నట్టుగా సాగడంతో నరాలు తెగే ఉత్కంఠ రేగింది.


తొలి గేమ్‌లోనే తమారా సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన బడోసా.. తర్వాతి గేమ్‌ నెగ్గి 2-0తో పైచేయిగా నిలిచింది. మరోవైపు జిదాన్‌సెక్‌ కూడా వరుసగా రెండు గేమ్‌లు గెలిచి 2-2తో సమం చేసింది. ఇక్కడి నుంచి ఎవరి సర్వీసులను వారు నిలబెట్టుకుంటూ సాగడంతో 6-6తో సమమైంది. అయితే, 13వ గేమ్‌ను సొంతం చేసుకొన్న తమారా.. ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసి 8-6తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. హోరాహోరీగా జరిగిన మరో క్వార్టర్స్‌లో అనస్తాసియా పవ్‌ల్యుచెన్‌కొవా 6-7(2), 6-2, 9-7తో 21వ సీడ్‌ ఎలెనా రిబకినా (కజకిస్థాన్‌)పై కష్టపడి నెగ్గింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో 6-7తో చేజార్చుకున్నా.. రెండో సెట్‌లో దూకుడుగా ఆడిన పవ్‌ల్యుచెన్‌కొవా 6-2తో నెగ్గి సమం చేసింది. అయితే, నిర్ణాయక మూడో సెట్‌ను అనస్తాసియా 9-7తో నెగ్గి సెమీస్‌కు చేరుకొంది. కాగా, నాలుగో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియటెక్‌ (పోలెండ్‌) 6-3, 6-4తో మర్టా కోస్టుయుక్‌ (ఉక్రెయిన్‌)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరుకొంది. 


జ్వెరెవ్‌ సునాయాసంగా..

పురుషుల సింగిల్స్‌లో జర్మన్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ అలవోకగా సెమీ్‌సకు చేరుకొన్నాడు. క్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ జ్వెరెవ్‌ 6-4, 6-1, 6-1తో అలెజాండ్రో డేవిడోవిచ్‌ ఫొకినా (స్పెయిన్‌)ను వరుస సెట్లలో చిత్తుచేశాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌ చేరడం జ్వెరెవ్‌కు ఇదే తొలిసారి. 



Updated Date - 2021-06-09T06:00:49+05:30 IST