ఈహెచ్‌ఎస్‌ సేవలకు సుస్తీ

ABN , First Publish Date - 2022-01-18T09:58:48+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించే ఎంప్లాయూస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) నిర్వీర్యమైపోయింది.

ఈహెచ్‌ఎస్‌ సేవలకు సుస్తీ

  • హెల్త్‌ కార్డులను అంగీకరించని ప్రైవేటు ఆస్పత్రులు
  • వైద్యానికి సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్న ఉద్యోగులు
  • రీయింబర్స్‌మెంట్‌ కోసం 6 నెలలు ఎదురుచూపులు
  • రిఫరల్‌ ఆస్పత్రుల రెన్యువల్‌ అనుమతుల్లో జాప్యం
  • ప్రతి నెలా 5 వేల రీయింబర్స్‌మెంట్‌ అర్జీలు పెండింగ్‌


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించే ఎంప్లాయూస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) నిర్వీర్యమైపోయింది. ప్రస్తుతం ఈ పథకం పనిచేయకపోడంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక అత్యవసరమైన వారు సొంత డబ్బులు ఖర్చు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. అయితే, ఆ పైసల రీయింబర్స్‌మెంట్‌ కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈహెచ్‌ఎస్‌ కార్డులను ప్రైవేటు ఆస్పత్రులు అంగీకరించడం లేదు. దాంతో ముందు జేబులో నుంచి ఖర్చుపెట్టుకుని, తర్వాత రీయింబర్స్‌మెంట్‌ చేసుకుంటున్నారు. ఉద్యోగులకు చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రులు వైద్య విద్య సంచాలకుల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఉద్యోగులు ఆ ఆస్పత్రుల్లో చికిత్స పొంది, రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుంటే.. పెట్టిన ఖర్చులో రూ.2 లక్షల వరకు తిరిగి వస్తుంది. అయితే, ఏ ఆస్పత్రులకు అనుమతి ఉందో వెతుక్కోవాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 లక్షల మంది ఉద్యోగులు, 2 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వీరి డిపెండెంట్స్‌ను కలిపితే 18-20 లక్షల మంది ఉంటారు. ఈహెచ్‌ఎస్‌ పనిచేయకపోవడంతో వీరంతా సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటున్నారు. 


రెన్యువల్‌ చేయని వైద్య శాఖ.. 

తమ అనుమతులను రెన్యువల్‌ చేయాలని ప్రైవేటు ఆస్పత్రుల వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తనిఖీల పేరిట ఆలస్యం చేస్తున్నారని, సకాలంలో రెన్యువల్‌ చేయడం లేదని ఆస్పత్రులు ఆరోపిస్తున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాటికీ ఇదే పరిస్థితి ఉందని అంటున్నాయి. వీరికి వైద్య విద్య సంచాలకులు అనుమతులివ్వాలి. మరోవైపు తమ వద్ద పెండింగ్‌ రెన్యువల్స్‌ ఏమీ లేవని వైద్య విద్య సంచాలకుల కార్యాలయం చెబుతోంది. ప్రైవేటు ఆస్పత్రులు రెన్యువల్‌ సమయం అయిపోయే దాకా ఉంటున్నాయని, కనీసం 3-4 నెలల ముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా.. రావడం లేదని అంటున్నాయి. 


ప్రతి నెలా 5 వేలకు పైగా దరఖాస్తులు..

ప్రతి నెల ప్రభుత్వ విభాగాలకు చెందిన సుమారు 5 వేలకుపైగా రీయింబర్స్‌మెంట్‌ పైళ్లు వైద్య విద్య సంచాలకుల కార్యాలయానికి వస్తాయి. వీటిని డీఎంఈ కార్యాలయం పరిశీలించి, మరికొన్నింటికి బిల్లులు మంజూరు చేసి ఉద్యోగుల మాతృశాఖకు పంపుతుంది. జబ్బు ఏదైనా, ఎంత ఖర్చు పెట్టుకున్నా, చెల్లించేంది రూ.2 లక్షలే. అంతకుమించి ఇవ్వాల్సి ఉంటే డీఎంఈ కార్యాలయం ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఇక ఆస్పత్రుల్లో చేసే ప్రతీ సర్జరీకి ప్రభుత్వం ఒక ప్యాకేజ్‌ ధరను ఖరారు చేస్తుంది. దాని ప్రకారమే రీయింబర్స్‌మెంట్‌ను నిర్ణయిస్తారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో సర్జరీకి ఉండే ప్యాకేజ్‌ ధరకు, సర్కారు చెల్లించే ధరకు చాలా వ్యత్యాసం ఉంటోందని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.


నెలల తరబడి జాప్యం.. 

డీఎంఈ కార్యాలయంలో రీయింబర్స్‌మెంట్‌ చూసే విభాగంలో తీవ్రమైన సిబ్బంది కొరత ఉంది. అక్కడ ఫైల్‌పై నంబరు పడాలంటే నెల రోజుల సమయం పడుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఫైల్‌ పూర్తయ్యేసరికి కనీసం 3 నెలలు పడుతోందని అంటున్నారు. తర్వాత ఆ ఫైల్‌ పే అండ్‌ అకౌంట్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి డబ్బులు రావాలంటే మరో 2-3 నెలల పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 5-6 నెలల రీయింబర్స్‌మెంట్‌ ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని సిబ్బంది చెబుతున్నారు. మొత్తం 30-35 వేల రీయింబర్స్‌మెంట్‌ ఫైళ్లను పరిష్కరించాల్సి ఉందని అంటున్నారు. సర్కారు వద్ద డబ్బులు లేకనే ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.  


ప్రభుత్వం కావాలని  నిర్లక్ష్యం చేస్తోంది

ప్రభుత్వం హెల్త్‌ స్కీమ్‌కు సంబంధించి మా నుంచి కాంట్రిబ్యూషన్‌ తీసుకోవడం లేదు. సర్కారు ఇచ్చిన ఈహెచ్‌ఎస్‌ కార్డులను ప్రైవేటు ఆస్పత్రులు అంగీకరించడం లేదు. జేబులో పైసలు పెట్టి వైద్యం చేయించుకుంటే, ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదు. కనీసం 6 నెలల పడుతోంది. సర్కారు తీరు చూస్తుంటే కావాలని ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

                                                        - ఉద్యోగ సంఘం నేత, హైదరాబాద్‌

Updated Date - 2022-01-18T09:58:48+05:30 IST