Abn logo
Apr 20 2021 @ 00:47AM

డిజిటల్ యుగంలో చిన్న పరిశ్రమలు

గడ్డుపరిస్థితులు చుట్టుముట్టినప్పుడు మనుగడపై సందేహాలు తలెత్తడం సహజం. మెక్ కిన్సే కన్సల్టంట్స్ 2020 అక్టోబర్‌లో యూరోపియన్ యూనియన్ దేశాలలోని వ్యాపార వ్యవస్థలపై ఒక సర్వే నిర్వహించింది. మధ్యతరహా, చిన్నతరహా, సూక్ష్మపరిశ్రమల (మీడియం, స్మాల్, మైక్రో ఇండస్ర్టీస్ ఎమ్‌ఎస్‌ఎమ్ఈలు. క్లుప్తంగా ‘చిన్న పరిశ్రమలు’)లో సగం సంస్థలు తాము 12 నెలలకు మించి మనుగడలో ఉండలేమని విశ్వసిస్తున్నట్టు ఆ సర్వేలో వెల్లడయింది. మన దేశంలో ఆ చిన్నపరిశ్రమల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. కొవిడ్ విపత్తుకు ముందే నోట్లరద్దు, వస్తుసేవల పన్ను కారణంగా అవి భారీగా నష్టపోయాయి. 


పెద్ద పరిశ్రమలతో పోల్చినప్పుడు ఎమ్ఎస్ఎమ్ఈల ఉత్పత్తి వ్యయం చాలా అధికం. ఇది ఎవరూ కొట్టివేయలేని వాస్తవం. మరి ఆ చిన్నపరిశ్రమలు కార్పొరేట్ కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని నిలబడాలంటే వాటికి ప్రత్యేక రక్షణ తప్పక కల్పించవలసిఉంది. వ్యాపార సమాచారాన్ని తెలుసుకునేందుకు చిన్నపరిశ్రమలు చాలా ధనాన్ని వెచ్చంచవలసిఉంది. ఉదాహరణకు కాన్పూర్ లోని ఒక చిన్నవ్యాపారి ముంబైలో తోలు ఉత్పత్తులకు గల గిరాకీ గురించి తెలుసుకోదలుచుకుంటాడు. ఇదే సమాచారాన్ని తెలుసుకునేందుకు ఒక పెద్ద కంపెనీ యజమానికి అయ్యే ప్రయాణ వ్యయం ఎమ్ఎస్ఎమ్ఈ వ్యాపారికి అయ్యే ప్రయాణ ఖర్చుకు రెండింతలు ఉంటుంది. అయితే పెద్ద కంపెనీ యజమాని ఎమ్ఎస్ఎమ్ఈ వ్యాపారి విక్రయించే వస్తువుల కంటే పది రెట్లు ఎక్కువగా విక్రయించగలుగుతాడు. ఈ ప్రకారం ఎమ్ఎస్ఎమ్ఈ వ్యాపారి మార్కెట్ సమాచారాన్ని తెలుసుకునేందుకు అయ్యే వ్యయం పెద్ద కంపెనీకి అయ్యే దానికంటే ఐదు రెట్లు అధికంగా ఉంటుంది.


ఎమ్ఎస్ఎమ్ఈల కష్టాలకు మరో కారణం డిజిటల్ సాంకేతికతలు. కృత్రిమ మేధస్సు (ఎఐ), రోబోలు, 3-డి ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలైన ఇంటర్నెట్ ఆధారిత వ్యాపార వేదికలు చిన్నపరిశ్రమల మనుగడను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ అధునాతన సాంకేతికతల కారణంగా పెద్దకంపెనీల ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఆ కంపెనీలు అతి తక్కువమంది కార్మికులతో రోబోలను ఉపయోగించి భారీ పరిమాణంలో వస్తూత్పత్తి చేస్తున్నాయి. అంతేగాక అవి తమ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి వాటిని మరింతగా విక్రయించేలా ఇంటర్నెట్ ఆధారిత వ్యాపార వేదికలకు నచ్చచెప్పగలుగుతున్నాయి. ఉదాహరణకు స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక కంపెనీ ఉత్పత్తిచేసే నిర్దిష్ట చాకోలెట్ అత్యధికంగా విక్రయమయ్యేలా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలైనవి చేయగలుగుతున్నాయి. మరి తమ సరుకులకు గిరాకీ పెంచేలా ఇంటర్నెట్ ఆధారిత వ్యాపార వేదికలను పురిగొల్పే ఆర్థికసామర్థ్యం ఎమ్ఎస్ఎమ్ఈ లకు లేదు. చిన్నపరిశ్రమల ఈ స్వతస్సిద్ధ ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకుని వాటికి ప్రత్యేక రక్షణ కల్పించవలసి ఉంది. అవి నాలుగు కాలాల పాటు మనుగడలో ఉండాలంటే ప్రభుత్వం ఈ విషయమై తక్షణమే దృష్టి పెట్టాలి. కొత్త ఉద్యోగాలను అధికంగా సృష్టింగలిగేది కూడా ఇవేనన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. 


ఎమ్ఎస్ఎమ్ఈల అంతర్జాతీయకరణకు మద్దతుగా యూరోపియన్ కమిషన్ ఇటీవల ఒక మార్గదర్శక ప్రణాళికను రూపొందించింది. శిక్షణ, పరిశోధన, సమాచార వ్యవస్థల ఏర్పాటు మొదలైనవి ఎమ్ఎస్ఎమ్ఈల సంఘాల ద్వారా నిర్వహించాలని ఆ ప్రణాళిక సూచించింది. ఈ సంఘాలు తమ సభ్యసంస్థలతో నిత్యం సంబంధాలు నెరపుతూ వాటికి ఎటువంటి శిక్షణ, పరిశోధన, సమాచారం అవసరమో తెలుసుకుని సమకూరుస్తూ ఉండాలని అది నిర్దేశించింది. ఈ విషయంలో ప్రభుత్వాలు లేదా విద్యాసంస్థలు రూపొందించే శిక్షణా కార్యక్రమాలు గానీ, నిర్వహించే పరిశోధనా ప్రాజెక్టులు గానీ లక్ష్యశుద్ధి లేని విధంగా ఉంటాయన్నది ఒక వాస్తవం. ఏ సరుకులకు ఏ దేశంలో ఎక్కువ గిరాకీ ఉంటుందనే విషయమై ఎమ్ఎస్ఎమ్ఈ సంఘాలకు మంచి అవగాహన ఉండేందుకు ఆస్కారమున్నది. సంబంధిత ఉపయుక్త సమాచారాన్ని సభ్యసంస్థలకు సమకూర్చడం ద్వారా వాటి వ్యాపార అవకాశాల అభివృద్ధికి విశేషంగా తోడ్పడగలవు. ఉదాహరణకు వారణాసిలోని నేతశ్రామికుల సంఘం సదరు సమాచారంతో తమ ఉత్పత్తుల నాణ్యతను మరింతగా మెరుగుపరచుకుని వాటి విక్రయ అవకాశాలను పెంపొందించుకోగలుగుతాయి. 


కేంద్రప్రభుత్వ విధానం చిన్నపరిశ్రమలకు ఇటువంటి సానుకూల పరిస్థితులు సృష్టించే విధంగా ఉందా? దురదృష్టవశాత్తు లేదు. ఎమ్ఎస్ఎమ్ఈల బోర్డులో గతంలో సంబంధిత పరిశ్రమల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఉండేవారు. ప్రభుత్వం ఆ ప్రతినిధుల సంఖ్యను తగ్గించి వారి స్థానంలో శాసనసభ్యులను నియమించడానికి ప్రాధాన్యతనిస్తోంది. చిన్న పరిశ్రమల సమస్యల పట్ల సరైన అవగాహన లేనివారు ఆ పరిశ్రమల అభివృద్ధికి ఎలా తోడ్పడగలుగుతారు? దీనికి తోడు ఎమ్ఎస్ఎమ్ఈ సంఘాలకు సమకూరుస్తున్న నిధులను కూడా ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. 


ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ 2018లో వెలువరించిన ‘బిజినెస్ సిస్టమ్స్ ఫర్ డిజిటల్ ఏజ్’ నివేదిక ప్రపకారం 2017లో పది అగ్రగామి ఇంటర్నెట్ ఆధారిత వ్యాపార వేదికల మార్కెట్ విలువ 3.3 ట్రిలియన్ డాలర్లు. ఇది, అదే ఏడాది మన స్థూల దేశీయోత్పత్తి (2.6 ట్రిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ . ఈ ఆన్‌లైన్ వ్యాపారసంస్థలు నిర్దిష్ట కంపెనీల ఉత్పత్తుల విక్రయాలకు అధిక ప్రోత్సాహమివ్వడం వల్లే వాటికి అధికాదాయం లభిస్తోంది. తమ కంపెనీలు తమ సొంత కారుల బుకింగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాయని ఓలా, ఊబెర్ డ్రైవర్లు నాకు స్వయంగా చెప్పారు. ఫలితంగా ఆ వేదికలతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్న ఒకే ఒక్క టాక్సీ గల యజమానులు ప్రతికూల పరిస్థితుల నెదుర్కొంటున్నారు. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ ఆధారిత వ్యాపార వేదికలను చిన్న కంపెనీలుగా విభజించేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. తద్వారా వాటి మధ్య పోటీ నెలకొని ఏ ఒక్క కంపెనీ కూడా మార్కెట్లో ఆధిక్యత పొందలేని సానుకూల పరిస్థితి నెలకొంటుంది. ఇందుకు తగు చర్యలు చేపట్టే అధికారాలు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నాయి. అటువంటి చర్యలు చేపట్టాలని ఆ ‘కమిషన్’ను ప్రభుత్వం నిర్దేశించాలి. మన దేశంలో నిపుణ కార్మికులు, అనిపుణ శ్రామికులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరికీ ఉపాధి కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. ఈ విధ్యుక్త ధర్మ నిర్వహణకు ఎమ్ఎస్ఎమ్ఈ లను సంరక్షించి తీరాలి. లేని పక్షంలో దేశంలో సామాజిక అశాంతి పెచ్చరిల్లిపోయే ప్రమాదముందనడంలో సందేహం లేదు.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...