ఆ గ్రామాలంటే కరోనాకు హడల్‌

ABN , First Publish Date - 2021-05-14T08:18:40+05:30 IST

మనిషి నుంచి మనిషికి.. ఆపై మరో మనిషికి సోకుతూ మొత్తంగా సమాజాన్ని పట్టిపీడిస్తూ వికటాట్టహాసం చేస్తున్న కరోనా మహమ్మారికి ఆ గ్రామాలంటే మాత్రం హడల్‌! వైరస్‌ వ్యాప్తితో ఎక్కడికక్కడ రోగులతో

ఆ గ్రామాలంటే కరోనాకు హడల్‌

ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్‌ కేసూ లేదు.. కొత్తగూడెం జిల్లా దనియాలపాడు, మెదక్‌ జిల్లా బస్వాపూర్‌ బయటివారు ఊర్లోకి రాకుండా, బయటకు పోకుండా కట్టడి

ప్రజలకు అవగాహన.. పకడ్బందీగా పారిశుధ్య పనులు.. వైరస్‌ నియంత్రణలో మిగతా గ్రామాలకు ఆదర్శం


ఇల్లెందు రూరల్‌, జగదేవ్‌పూర్‌, మే 13: మనిషి నుంచి మనిషికి.. ఆపై మరో మనిషికి సోకుతూ మొత్తంగా సమాజాన్ని పట్టిపీడిస్తూ వికటాట్టహాసం చేస్తున్న కరోనా మహమ్మారికి ఆ గ్రామాలంటే మాత్రం హడల్‌! వైరస్‌ వ్యాప్తితో ఎక్కడికక్కడ రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నా.. ఆ ఊర్ల ప్రజల్లో ఏ ఒక్కరూ వైరస్‌ బారిన పడలేదు. మరి.. ఆ ఊర్ల శివార్లలో ఏదైనా మంత్రించిన భస్మంతో గిరి గీశారా? ప్రజలు ఏవైనా తాయెత్తులు కట్టుకున్నారా? అని అనుకునేరు! ఎక్కువ కుటుంబాలు వ్యవసాయ ఆధారితంగానే జీవనం సాగిస్తున్నా, వారిలో ఎక్కువమంది నిరక్షరాస్యులే అయినా వైరస్‌ పట్ల ఉన్న సంపూర్ణ అవగాహన, ఆ మేరకు తీసుకుంటున్న జాగ్రత్తల ఫలితమే వారిని వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తోంది. ఆ ఆదర్శ గ్రామాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని దనియాలపాడు పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాలు సహా కట్టుగూడెం, జింకలతండా, బోడియాతండా, ఎల్లాపురం, రాళ్లగుంపు, సీతానగరం.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని 

బస్వాపూర్‌! 


దనియాలపాడు పంచాయతీ పరిధిలోని దనియాలపాడు, బాలాజీ తాండా, సేవ్వా తాండా గ్రామాల్లో  వెయ్యికిపైగా జనాభా ఉంది. 99శాతం గిరిజనులే ఉన్న ఈ గ్రామాల్లో తొలి విడతలోనే కాదు.. రెండో విడతలోనూ ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. స్వీయనియంత్రణ పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించడం, కొత్తవ్యక్తులు గ్రామాల్లోకి రాకుండా పంచాయతీ పాలకవర్గం చర్యలే ఇందుకు కారణం. రోడ్లు, మురికికాలువలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ వివిధ రసాయనాలను చల్లుతూ పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పంచాయతీ పాలకవర్గం, వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇక సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం బస్వాపూర్‌ కరోనారహిత గ్రామంగా నిలిచింది. ఈ గ్రామంలో 450 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ జనాభా 1500. కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క కేసూ నమోదు కాలేదు. పంచాయతీ పాలకవర్గం.. కరోనా విషయంలో గ్రామస్థులకు అవగాహన కల్పిస్తోంది. లక్షణాలున్న వారికి వెంటనే వైద్యులతో పరీక్షలు చేయించి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీధుల్లో ప్రతిరోజు రసాయనాలను పిచికారి చేస్తున్నారు. ఊరి జనం.. శివార్లలో పొలం పనులకు తప్ప ఇతర   గ్రామాలకు వెళ్లడం లేదు. కరోనా విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకొని మంత్రి హరీశ్‌ రావు, ఈ గ్రామస్థులను అభినందించారు.  

Updated Date - 2021-05-14T08:18:40+05:30 IST