సాకర్‌ సంక్షోభం

ABN , First Publish Date - 2021-04-21T08:49:21+05:30 IST

యూరప్‌ దేశాల పౌరుల జీవితాలతో సాకర్‌ బంధం పెనవేసుకుని ఉంటుంది. భారత్‌లో క్రికెట్‌ను ఎంతగా అభిమానిస్తారో అంతకంటే ఎక్కువగా అక్కడి వాళ్లు ఫుట్‌బాల్‌ను.. వారి ఆటగాళ్లను ఆరాధిస్తారు.

సాకర్‌ సంక్షోభం

అత్యవసర సమావేశానికి యూఈఎ‌ఫ్‌ఏ పిలుపు

 రెబల్‌ క్లబ్‌లపై వేటు?

ఈఎ‌స్‌ఎల్‌ను అడ్డుకుంటామంటున్న బ్రిటన్‌, స్పెయిన్‌, ఇటలీ


న్యూఢిల్లీ: యూరప్‌ దేశాల పౌరుల జీవితాలతో సాకర్‌ బంధం పెనవేసుకుని ఉంటుంది. భారత్‌లో క్రికెట్‌ను ఎంతగా అభిమానిస్తారో అంతకంటే ఎక్కువగా అక్కడి వాళ్లు ఫుట్‌బాల్‌ను.. వారి ఆటగాళ్లను ఆరాధిస్తారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌ తర్వాత ఆస్థాయి ఆదరణ కలిగిన టోర్నీ చాంపియన్స్‌ లీగ్‌. యూరప్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య (యూఈఎ‌ఫ్‌ఏ) ప్రతి ఏడాది దీనిని నిర్వహిస్తుంది. 32 జట్లు ఇందులో తలపడతాయి. అయితే, కొవిడ్‌ ప్రభావంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లివర్‌పూల్‌, చెల్సీ, ఆర్సెనల్‌, ఏసీ మిలన్‌, రియల్‌ మాడ్రిడ్‌, బార్సిలోనా, యువెంటస్‌, మాంచెస్టర్‌ సిటీ సహా 12 టాప్‌ క్లబ్‌లు కిందటి ఏడాది వందల కోట్లలో నష్టాన్ని చవిచూడడంతో వేరు కుంపటికి సిద్ధమయ్యాయి. దీంతో యూరప్‌ సాకర్‌లో కనీవినీ ఎరుగని సంక్షోభం తలెత్తింది.


యూఈఎ‌ఫ్‌ఏ మీద తిరుగుబాటు చేసిన 12 క్లబ్‌లు యూరప్‌ సూపర్‌ లీగ్‌ (ఈఎ్‌సఎల్‌) నిర్వహణకు వేగంగా పావులు కదుపుతున్నాయి. రియల్‌ మాడ్రిడ్‌ అధ్యక్షుడు పెరెజ్‌ను ఈఎ్‌సఎల్‌ చైర్మన్‌గా వచ్చే ఆదివారం ప్రకటించడంతో పాటు కొత్త లీగ్‌ నిర్వహణ గురించి కీలక ప్రకటన చేయనున్నారు. మొత్తం 20 క్లబ్‌లతో లీగ్‌ను నిర్వహించనున్నారని తెలుస్తోంది. అయితే, వీటిని అడ్డుకోవడానికి ఫిఫా, యూఈఎ్‌ఫఏతో పాటు బ్రిటన్‌, స్పెయిన్‌ ప్రభుత్వాలు ఉపక్రమించాయి. రెబల్‌ క్లబ్‌లపై వేటు, ఆర్థిక మూలాలు, ప్రభుత్వాల నుంచి అందుతున్న ప్రయోజనాలపై యూఈఎ‌ఫ్‌ఏ గురి పెట్టింది. మరోవైపు సంక్షోభాన్ని నివారించడానికి ఆర్థికంగా నష్టపోయిన క్లబ్‌లకు ఏదైన ప్యాకేజీ ప్రకటించి బుజ్జగిద్దామనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.


గతాన్ని మర్చిపోవద్దు

25 ఏళ్ల కిందట మాంచెస్టర్స్‌ యునైటెడ్‌ ఎక్కడుంది? 15 ఏళ్ల క్రితం యువెంటస్‌ క్లబ్‌ పరిస్థితేంటి? పెద్ద క్లబ్‌లుగా ఇప్పుడు చెలామణి అవుతున్నా అవి ఎల్లపుడూ అలానే ఉండవు. కొన్ని పెద్ద క్లబ్‌ల యజమానులు అభిమానులను మార్కెట్‌లో వినియోగదారుల్లా చూస్తున్నారు. సాకర్‌ను వ్యాపారంగా చూసే సంప్రదాయం ఇంగ్లీష్‌ గడ్డకు లేదు. ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకొని వెనక్కిరండి. 

సెఫెరిన్‌-యూఈఎ్‌ఫఏ అధ్యక్షుడు


ఫిఫా అనుమతి తప్పనిసరి

ప్రపంచంలో ఎక్కడైనా అధికారిక సాకర్‌ లీగ్‌ నిర్వహించాలంటే ఫిఫా అనుమతి తప్పనిసరి. ఈఎస్‌ఎల్‌ అనేది అనైతికమని ఫిఫా ఇప్పటికే ప్రకటించడంతో ఇది వారికి ఎదురుదెబ్బే. ఈఎస్‌ఎల్‌ ఒక వాణిజ్య కూటమిలా కనిపిస్తోంది.

అమల్‌రాజ్‌, భారతఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌

Updated Date - 2021-04-21T08:49:21+05:30 IST