70 దళిత కుటుంబాల సాంఘిక బహిష్కరణ

ABN , First Publish Date - 2021-08-27T10:06:53+05:30 IST

డప్పులు కొట్టేందుకు రూ.500 పెంచాలని అడిగినందుకు ఏకంగా 70 దళిత కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సాంఘిక బహిష్కరణ విధించింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం

70 దళిత కుటుంబాల సాంఘిక బహిష్కరణ

డప్పు కొట్టేందుకు రూ.500 పెంచమన్నందుకు చర్య


డిచ్‌పల్లి, ఆగస్టు 26: డప్పులు కొట్టేందుకు రూ.500 పెంచాలని అడిగినందుకు ఏకంగా 70 దళిత కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సాంఘిక బహిష్కరణ విధించింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం దూస్‌గాంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. గ్రామంలో కొంతకాలంగా వివాహాలు, ఇతర కార్యక్రమాలకు డప్పులు కొట్టేందుకు దళితులు రూ.6,500 తీసుకుంటున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తానికి మరో రూ.500 కలిపి ఇవ్వాలని వారు సర్పంచ్‌ తో పాటు వీడీ సీ సభ్యులకు ఇటీవల విన్నవించుకున్నారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించిన సర్పంచ్‌, వీడీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామంలోని 70దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. పైగా ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న దళిత కూలీలు లక్ష్మి, సాయమ్మ, తోట గంగారాంలను సైతం పనుల నుంచి తొలగించారు. దీంతో గ్రామ సర్పంచ్‌తో పాటు వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు గురువారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. డిచ్‌పల్లి తహసీల్దార్‌ శ్రీనివాసరావు ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. శుక్రవారం గ్రామాన్ని సందర్శించి,  చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ వారికి హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-08-27T10:06:53+05:30 IST