యుపి ఎన్నికలకు ముందు కొన్ని ప్రశ్నలు

ABN , First Publish Date - 2021-05-26T06:09:14+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎక్కువ సమయం లేదు. నాలుగు రోజుల క్రితం తన నియోజకవర్గమైన వారణాసికి చెందిన వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో మాట్లాడుతూ...

యుపి ఎన్నికలకు ముందు కొన్ని ప్రశ్నలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎక్కువ సమయం లేదు. నాలుగు రోజుల క్రితం తన నియోజకవర్గమైన వారణాసికి చెందిన వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో మాట్లాడుతూ కరోనాకు గురై మరణించిన ప్రజల గురించి తలచుకుంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. ఆదివారం నాడు ఆయన తన కుడిభుజం, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాలతో కలిసి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేతలతో ఉత్తర ప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. భారతీయ జనతాపార్టీకి ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల రీత్యా ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి రావడమే కాదు, గతంలో సాధించిన మెజారిటీని నిలుపుకోవడం కూడా అత్యంత అవసరం. కరోనా రెండో ప్రభంజనం గురించి హెచ్చరికలను పట్టించుకోకపోవడం; ఆరోగ్య, వైద్య సదుపాయాల విషయంలోను, వాక్సిన్ విషయంలోనూ యథాలాప ధోరణి ప్రదర్శించడం మూలంగా వేలాది మందికి అది ప్రాణాంతకంగా పరిణమించిన విషయం బిజెపి, సంఘ్ నేతలకు తెలియనిది కాదు. కానీ ఇప్పుడు, జరిగిన దాన్ని తలుచుకుంటూ ఆత్మరక్షణలో పడిపోవడం మోదీ నైజం కాదు. మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సిన తక్షణ అవసరం మోదీకి ఏర్పడింది. అందుకే విమర్శలను విస్మరించి ఆయన మళ్లీ ఎన్నికల వ్యూహరచనలో పడ్డారు. అందుకు ఉపోద్ఘాతంగానే గద్గద స్వరాలు, సంఘ్ నేతలతో భేటీలు మొదలయ్యాయి.


దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లోపే జరుగనున్నాయి. ఆ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేయడంతో వైద్య వ్యవస్థ కుప్పకూలిపోయిన దృష్టాంతాలు వేలాది మంది మరణాలు, గంగానదిలో శవాల గురించి కథనాలు విపరీతంగా అనేకం వెలుగులోకి వచ్చాయి. మరో వైపు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల ప్రభావం పశ్చిమ యూపిలోనే కాక రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వ్యాపించింది. అక్కడ మహాపంచాయత్‌ల ప్రభావాన్ని తేలిగ్గా తీసుకోలేం. ప్రధానంగా ఈ రెండు కారణాల రీత్యా ఉత్తరప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో బిజెపి పరాజయం చెందిందని, అయోధ్య, వారణాసి, గోరఖ్‌పూర్‌లతో సహా అనేక ప్రాంతాల్లో బిజెపి దెబ్బతిన్నదని వార్తలు వచ్చాయి. గత ఎన్నికల్లో ఓబీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలను బిజెపి తన వైపుకు తిప్పుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించింది. ముజఫర్‌నగర్ అల్లర్ల వంటి ఘటనలు బిజెపికి ఉపయోగపడ్డాయి. కాని ఇప్పుడు ఈ సమీకరణాలు ఎంత వరకు ఉపయోగపడతాయో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. అందువల్ల దేశంలో 20 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ పైకి దేశంలో రాజకీయ పరిశీలకుల దృష్టి మళ్లింది.


నిజానికి ఇవి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అత్యంత కీలకమైన ఎన్నికలు. మోదీ 2024లో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్నది కనుక యుపి ఎన్నికలను ఆయన సెమిఫైనల్ గానే భావించవలసి ఉంటుంది. కానీ యోగి ఆదిత్యనాథ్‌కు ఈ ఎన్నికలు రాజకీయంగా జీవన్మరణ సమస్య. ఒకే వ్యక్తిని రెండవసారి ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి మోదీ సుముఖులు కారనే విషయం ఆయన స్వభావం తెలిసిన వారందరికీ తెలుసు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయిన తర్వాత ఢిల్లీ వచ్చి మోదీ, అమిత్ షాలు పార్టీ కార్యాలయంలో ఏ పనులు చెబితే ఆ పనులు చేసి వారికి అత్యంత విధేయత ప్రకటించిన తర్వాతే శివరాజ్‌సింగ్ చౌహన్‌ను తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అవకాశం కల్పించారు. కర్ణాటకలో లింగాయత్‌లలో బలమైన పట్టు ఉన్న యడ్యూరప్పను తప్పనిసరై వారు కొనసాగిస్తున్నారు కానీ ఢిల్లీ నేతలు తనను తప్పించేందుకు దొరికే అవకాశాల్ని వదులుకోరని ఆయనకు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ఆదిత్యనాథ్‌ను వదుల్చుకోవడానికి మోదీ యూపీ ఎన్నికలను ఉపయోగించుకుంటారనడంలో సందేహం లేదు. నిజానికి సంఘ్ బలవంతంపై, ఆదిత్యనాథ్ పరోక్ష హెచ్చరికల మూలంగా ఆయనను గతంలో ముఖ్యమంత్రిగా నియమించారు. దేశంలో తనకంటే ఎవరూ బలమైన నేతగా గుర్తింపు పొందడం మోదీ ఎంతమాత్రం ఇష్టపడరని పార్టీ నేతలే చెబుతుంటారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు ఎంత సీనియర్‌లైనా తమ అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని బలంగా ప్రదర్శించకపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నరేంద్రమోదీ భవిష్యత్‌ను కూడా నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే బిజెపికి లోక్‌సభలో వచ్చిన అత్యధిక సీట్లు యుపి నుంచి వచ్చినవే. మోదీ మార్కు ప్రచారానికీ, బిజెపి హిందూత్వ సిద్ధాంతాలకు యుపిలో వచ్చినంత ప్రతిస్పందన దేశంలో మరెక్కడా రాలేదు. నాలుగుకోట్ల మంది ముస్లింలు ఉన్న యుపిలో హిందూ ఓటర్లు సంఘటితం కావడం మోదీకి ఎంతో అవసరం. 


కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టిన వెంటనే కేంద్ర ప్రభుత్వం, బిజెపి అగ్రనేతలు పూర్తిగా ఉత్తరప్రదేశ్‌లో తమ బలాలను మోహరించడం ఖాయం. బెంగాల్ కంటే అత్యంత భీకరంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు. కానీ యుపిలో ఎన్నికలకు దిగేముందు దేశ ప్రజలకు మోదీ అనేక ప్రశ్నలకు జవాబు చెప్పవలసి ఉన్నది. ‘వాక్సిన్ సర్టిఫికెట్ పై మోదీ తన చిత్రం ముద్రించుకున్నారు. ఈ దేశంలో మరణించిన లక్షలాది ప్రజల డెత్ సర్టిఫికెట్లపై కూడా ఆయన చిత్రాన్ని ముద్రించాలి’ అని బీహార్‌లో బిజెపి మిత్రపక్షం హెచ్‌ఎఎమ్ నేత మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ చేసిన వ్యాఖ్య ఈ దేశంలో అనేకమంది ఆలోచనలను ప్రతిఫలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేటితో తన ఏడేళ్ల పాలనను పూర్తి చేసుకోబోతున్నారు. ఈ ఏడేళ్లలో దేశ ప్రజలకు ఆయన ఏమి చేశారు? తన హయాంలో ఆయన ఎలాంటి వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు? మోదీని ఒక మహా సంస్కర్తగా, దేశం రూపురేఖలు మార్చిన నేతగా ఆయన అనుయాయులు చిత్రిస్తున్నారు. ఆయన ఏ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చారు? గతంలో కంటే భిన్నంగా సామాన్యులు, రైతులు, నిరుద్యోగులు, మధ్యతరగతి, అణగారిన వర్గాల స్థితిగతులు ఎంతమేరకు మారాయి? కాంగ్రెస్ హయాంలో వ్యవస్థల పతనాన్ని, రాజకీయ అవినీతిని చూపి మోదీ అధికారంలోకి వచ్చారు. కాని ఇవాళ ఎన్నికల కమిషన్, సిబిఐ, ఐబీ, ఈడీ లాంటి వ్యవస్థల్లో పనితీరు గతంలో కంటే భిన్నంగా ఉన్నదా లేక మారిందా? కనీసం పోలీసు వ్యవస్థలో సంస్కరణలకైనా ఆయన ప్రయత్నించారా? ఎంపీలను, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను పడగొట్టడం, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం వంటి విషయాల్లో కాంగ్రెస్ సంస్కృతి కంటే భిన్నంగా బిజెపి ఏమైనా వ్యవహరించిందా? ఓటు బ్యాంకు రాజకీయాల విషయంలో బిజెపి ఏమైనా భిన్నంగా ప్రవర్తించిందా?


ఈ దేశ ప్రజల మనసుల్లో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయని బిజెపి నేతలకు తెలియనిది కాదు. ఇవాళ ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో ఈ ప్రశ్నలను సంధిస్తున్న వారెంతమందో? అయిదేళ్ల క్రితం ఇదే సోషల్ మీడియా తనకు అనుకూలంగా ఉన్నప్పుడు మోదీ ఉప్పొంగిపోయారు. అమెరికాకు వెళ్ళి ఫేస్‌బుక్ ఛీఫ్ జుకర్‌బర్గ్‌ను కౌగలించుకుని వారికి వ్యాపార పరంగా ప్రయోజనం కూడా కల్పించారు. 2014లోనూ, 2019లోనూ మోదీకి ఈ సోషల్ మీడియా ప్రచారం వరమైంది. అయితే ఇప్పుడు అది వ్యతిరేకంగా కనిపించడంతో కొత్త నిబంధనలతో, కొత్త ఆంక్షలతో దాని గొంతు నొక్కేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నించే, ధిక్కరించే సంస్కృతి కూడా భారతీయతలో భాగమని, అది మన ప్రాచీన కావ్యాల నుంచి నేటి నవలల వరకు సదా నిండుగా ప్రతిఫలిస్తూనే ఉంటుందని కూడా వారు తెలుసుకోవాలి.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-05-26T06:09:14+05:30 IST