కూరగాయలు అమ్మిన శారదకు సోనూసూద్‌ సాయం

ABN , First Publish Date - 2020-07-29T08:08:43+05:30 IST

సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించే సోనూ సూద్‌.. నిజ జీవితంలో మాత్రం

కూరగాయలు అమ్మిన శారదకు సోనూసూద్‌ సాయం

  • హైదరాబాద్‌ టెకీకి ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటన
  • ఆయన డబ్బులతోనే తెలుగు విద్యార్థులకు విమానం
  • మా ఇంటికి రండి.. చిత్తూరు రైతు ఆహ్వానం
  • తప్పకుండా వస్తానన్న బాలీవుడ్‌ నటుడు

బంజారాహిల్స్‌/తిరుపతి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించే సోనూ సూద్‌.. నిజ జీవితంలో మాత్రం అందరి అవసరాలు తీర్చే ఆపద్బాంధవుడు అనిపించుకుంటున్నారు. కరోనా సంక్షోభంతో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోతున్నారు. ఎంతోమందికి సాయం చేస్తున్నారు. ఈక్రమంలోనే టెక్‌ కమాండ్స్‌ ఇవ్వాల్సిన చేతులతో.. కూరగాయలు తూకం వేస్తున్న వరంగల్‌ జిల్లా యువతి ఉందాడి శారదకు సోనూసూద్‌ అండగా నిలిచారు. ఆమెకు ఉద్యోగం కల్పిస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే తన మనుషులు శారదను ఇంటర్వ్యూ చేశారని కూడా ఆయన వెల్లడించారు. అనూహ్యంగా సోనూసూద్‌ ద్వారా జాబ్‌ ఆఫర్‌ రావడంతో శారద ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. 


సోనూ సార్‌.. మా ఊరికి రండి!

‘మీ దయాగుణాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మీరిచ్చిన స్ఫూర్తితో మేం కూడా పేద రైతులకు సాయం అందిస్తాం. వీలైతే ఒకసారి మా ఊరికి రండి’ అని రైతు నాగేశ్వరరావు సోనూసూద్‌ని కోరారు. చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె మండలం మహల్‌రాజుపల్లె దళితవాడకు చెందిన పేద రైతు నాగేశ్వరరావు తన పొలంలో ఇద్దరు కుమార్తెలనే కాడెద్దులుగా మార్చాల్సిన దుస్థితి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం.. సోనూసూద్‌ స్పందించి ఆ కుటుంబానికి ట్రాక్టర్‌ను బహుమతిగా పంపించడం తెలిసిందే. గురువారం (జూలై 30) సోనూసూద్‌ జన్మదినం సందర్భంగా నాగేశ్వరరావు కుటుంబంతో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చానెల్‌ మంగళవారం ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఓ సారి తమ ఊరొచ్చి ట్రాక్టర్‌ను చూసిపోవాలని సోనూసూద్‌ను కోరారు. దీనికి సోనూ స్పందిస్తూ.. ‘ఈసారి తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా మీ ఊరుకి వస్తా. మీరు ట్రాక్టర్‌తో పొలం దున్నడం చూస్తాను’ అని అన్నారు. దీంతో నాగేశ్వరరావు కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తమ పిల్లలకు మంచి చదువు చెప్పిస్తామని అన్నారని ఆయన గుర్తు చేశారు. తమపై చేసే దుష్ప్రచారాన్ని పట్టించుకోమని చెప్పారు.


సోనూసూద్‌ సహకారంతో స్వస్థలాలకు.. 

కిర్గిస్తాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు సోనూసూద్‌ సహకారంతో స్వస్థలాలకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన కొర్ల భార్గవచౌదరి కిర్గిస్థాన్‌లోని బిస్కెక్‌ ఆసియన్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆ యూనివర్సిటీలో చదువుతున్న 250 మంది తెలుగు విద్యార్థులు స్వస్థలానికి వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వారి కష్టాల వీడియో చూసి స్పందించిన సినీనటుడు సోనూసూద్‌ ప్రత్యేక విమానం వేయించి తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు రప్పించారు. సోనూసూద్‌ వలనే తాము ఈ నెల 24న స్వస్థలాలకు చేరుకున్నామని భార్గవచౌదరి చెప్పారు.

Updated Date - 2020-07-29T08:08:43+05:30 IST