ఈ 28 వస్తువులను మనోళ్ల దగ్గరే కొనండి.. Saudi రాజు సంచలన ఆదేశాలు

ABN , First Publish Date - 2021-09-14T18:46:17+05:30 IST

అరబ్ దేశం సౌదీ అరేబియా కూడా ఇప్పుడు స్వదేశీ రాగం అందుకుంది. తమ దేశంలో తయారైన స్థానిక ఉత్పత్తులనే ..

ఈ 28 వస్తువులను మనోళ్ల దగ్గరే కొనండి.. Saudi రాజు సంచలన ఆదేశాలు

రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా కూడా ఇప్పుడు స్వదేశీ రాగం అందుకుంది. తమ దేశంలో తయారైన స్థానిక ఉత్పత్తులనే ప్రభుత్వ కాంట్రాక్టర్లు కొనాలని సూచించింది. సౌదీ అరేబియా రాజు ఆదేశాల మేరకు లోకల్ కంటెంట్ అండ్ గవర్న్‌మెంట్ ప్రొక్యూర్‌మెంట్ అథారిటీ 28 వస్తువుల జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈ వస్తువులను ప్రభుత్వ కాంట్రాక్టర్లు కచ్చితంగా జాతీయ కంపెనీలలోనే కొనుగోలు చేయాలని సూచించింది. ఈ జాబితాలో ప్రధానంగా మాంసం, చేపలు, పౌల్ట్రీ, డైరీ పదార్థాలు ఉన్నాయి.


దీని ద్వారా దేశంలోని స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెంచడమే కాక, చమురేతర ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు మార్గం ఏర్పరచాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏ విభాగంలో అత్యధికంగా స్థానిక ఉత్పత్తుల వినియోగం ఉందో గుర్తించి, అక్కడి కాంట్రాక్టర్లు కచ్చితంగా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోనుంది. ఇప్పటివరకు సైన్యం, వైద్యరంగం, విద్యారంగం, జైళ్లు వంటి విభాగాలను ప్రభుత్వ శాఖ గుర్తించింది.


సౌదీ అరేబియా లోకల్ కంటెంట్ అండ్ గవర్న్‌మెంట్ ప్రొక్యూర్‌మెంట్ అథారిటీ సీఈవో అబ్దుల్ రెహమాన్ అల్ సమారి దీని గురించి మాట్లాడుతూ.. చమురేతర విభాగాల్లో స్థానిక ఉత్పత్తుల డిమాండ్‌ను పెంచే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. ఈ విధానం అమలయ్యేందుకు జాతీయ పర్యావరణ మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖల సహకారం తీసుకున్నామని, అలాగే పారిశ్రామిక-ఖనిజ వనరుల శాఖ, సౌదీ ఆహార-ఔషధ మంత్రిత్వ శాఖ, వ్యయ సామర్థ్య అంచనాల ప్రభుత్వ ప్రాజెక్టుల శాఖ, సౌదీ ఛాంబర్స్ సమాఖ్యలు కూడా సహకరించాయని వివరించారు.

Updated Date - 2021-09-14T18:46:17+05:30 IST