బందరుతో బాలు అనుబంధం

ABN , First Publish Date - 2020-09-26T11:39:49+05:30 IST

మచిలీపట్నం కళాకారులతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఎంతో అనుబంధం ఉంది.

బందరుతో బాలు అనుబంధం

మచిలీపట్నం టౌన్‌ : మచిలీపట్నం కళాకారులతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఎంతో అనుబంధం ఉంది. 1975లో ‘ముత్యాల ముగ్గు’ సినిమా విడుదల సందర్భంలో ఆయన స్థానిక వెంకటేశ్వర, బృందావన్‌ థియేటర్లను సందర్శించారు. విద్యార్థుల కోరిక మేరకు హిందూ కళాశాల ప్రాంగణంలో గాత్ర కచేరీ ఇచ్చారు.


బాలుకు పామర్రు మండలం ఎలకుర్రు, పమిడిముక్కలలో బంధువులు ఉన్నారు. మచిలీపట్నం వచ్చినప్పుడు వీరంతా ఆయనకు స్వాగతం పలికేవారు. మచిలీపట్నంకు చెందిన కళాకారుడు కొర్ల ప్రభాకర్‌, సరస్వతి కళాసమితి అధ్యక్షుడు, ఆడిటర్‌ సి.అప్పాజీ, సంగీత విద్వాంసులు దివంగత చిట్టా గోపాలకృష్ణమూర్తితో బాలసుబ్రహ్మణ్యంకు అనుబంధం ఉంది.


కాగా, ఇండియన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు భవిష్య, భారతీయ సాహిత్య పరిషత్‌ అధ్యక్షుడు కె.రాజేంద్రప్రసాద్‌, ఆంధ్ర సారస్వత సమితి అధ్యక్షుడు కొట్టి రామారావు, కోశాధికారి ఎల్‌ఎస్‌ శాస్ర్తి, రసథుని కన్వీనర్‌ చిట్టా ఆంజనేయశాస్ర్తి, జి.రామబ్రహ్మం తదితరులు బాలు మృతికి సంతాపం తెలిపారు.


గుడివాడ.. బాలు అడుగుజాడ 

గుడివాడ : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో అనుబంధాన్ని తలచుకుంటూ గుడివాడవాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పట్టణంలోని కోగంటి రాజబాపయ్య చౌక్‌లో 2001, జనవరి 10న పట్టణ కళాకారుల సమాఖ్య ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన అమరగాయకుడు ఘంటసాల విగ్రహాన్ని  బాలు ఆవిష్కరించారు.


కైకాల కళామందిరంలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. అదేరోజు శంకర సేవా సమితి, బ్రాహ్మణ సేవా సమితి నిర్వాహకులు దింట్యాల రాంబాబు, ఉపద్రష్ట రామస్వామిశాస్త్రి, భాగవతుల కోదండపాణి, ఉమామహేశ్వరి, కొమ్ము వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక శంకరమఠంలో బాలును ఘనంగా సత్కరించారు. శంకరమఠంలో ప్రత్యేక పూజలు చేశారు. సత్కారానికి గానూ నిర్వాహకులు కుర్చీ వేయగా, ఆలయంలో దేవుడి ముందు కుర్చీలో కూర్చోనని సున్నితంగా తిరస్కరించారు.


బాలు మరణవార్త విన్న దింట్యాల రాంబాబు ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 16 భాషల్లో పాటలు పాడిన ఘనత బాలుకు దక్కడం తెలుగువారికి గర్వకారణమన్నారు. అలాగే, 1977లో గుడివాడ ఎన్జీవో భవన నిర్మాణానికి విరాళాల సేకరణకు నాటి ఎన్జీవో యూనిట్‌ ఆధ్వర్యంలో పాత వెంకటేశ్వర టాకీస్‌ ప్రాంగణం (ప్రస్తుతం కిన్నెర కాంప్లెక్స్‌)లో నిర్వహించిన గాన కచేరీలో తన గాత్రంతో రంజింపచేశారు. తాలూకా ఎన్జీవో యూనిట్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఫరీద్‌భాషా, జి.రాజేంద్రప్రసాద్‌ నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు.

Updated Date - 2020-09-26T11:39:49+05:30 IST