Abn logo
Jun 14 2021 @ 11:34AM

డోనాల్డ్ ట్రంప్.. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కడికి వెళ్లారు..? ఇప్పుడేం చేస్తున్నారు..?

అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు, మన భారతదేశంలో సైతం భక్తులను సృష్టించుకున్న నేత డొనాల్డ్ ట్రంప్. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తరతరాలా ఆచారాన్ని కూడా పక్కనపడేసి బైడెన్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరైన ఆయన.. జనవరి నెలలోనే సైలంట్‌గా వైట్‌హౌస్ నుంచి సైడైపోయారు. ఎన్నికల్లో ఓటమిని భరించలేని ట్రంప్.. ఎన్నికల కౌంటింగ్‌లో తేడాలు జరిగాయంటూ కోర్టులో కేసులు కూడా వేశారు. అయితే ఆ కేసులన్నింటినీ కోర్టులు కొట్టిపారేశాయి. ఇప్పటికీ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందనే వాదించే ట్రంప్.. ఇంతకీ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఆయన స్టెప్స్ ఎలా ఉంటాయి?


గతంలో అయితే ట్రంప్ ఏం చేస్తున్నా అందరికీ తెలిసిపోయేది. ఎందుకంటే ఆయన మనసులో వచ్చిన ఆలోచనలన్నింటినీ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పంచుకుంటూ ఎప్పుడూ ప్రజల నోళ్లలో నానుతూ ఉండేవారాయన. జనవరిలో యూఎస్ కాపిటల్ హౌస్ వద్ద జరిగిన ఘర్షణలతో ఈ రెండు సోషల్ మీడియా దిగ్గజాలు ట్రంప్ ఖాతాలను నిషేధించాయి. దీంతో ట్రంప్ తన ఆలోచనలను అభిమానులతో పంచుకోవడం కష్టమైంది. కానీ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారో మాత్రం అందరికీ తెలిసిపోతూనే ఉంది. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నా చుట్టుపక్కల ఉన్న ఎవరో ఒకరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వైట్‌హౌస్ వీడిన తర్వాత కొంత కాలం ఆయన బాహ్య ప్రపంచం నుంచి దూరంగా తన ప్రైవేటు గోల్ఫ్ క్లబ్బు మార్-ఎ-లాగోలో గడిపారు.

తెల్ల గోల్ఫ్ షర్ట్, ఎర్ర టోపీ వేసుకొని ఎక్కువగా తన గోల్ఫింగ్ డ్రెస్‌లోనే అందరికీ కనిపిస్తున్నారు. కానీ ఆయన చేసే ప్రతి పనీ ఎవరో ఒకరి ద్వారా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. ఈ గోల్ఫ్ క్లబ్బుకు వచ్చే అతిథుల్లో చాలామంది ట్రంప్ కనిపిస్తే చాలు వీడియోలు, ఫొటోల కోసం మొబైల్ ఫోన్లకు పనికల్పిస్తున్నారు. ఆయన కనిపిస్తే చాలు పొగడ్తలతో ముంచెత్తుతారు. డైనింగ్ రూమ్‌లోకి ట్రంప్ వస్తే లేచి నిలబడి చప్పట్లతో అభినందిస్తారు. గోల్ఫ్ ఆడుకొని తిరిగొస్తుంటే సంతోషంతో కేకలు వేస్తూ, సెల్ఫీలు అడిగే అభిమానులు ఎదురొస్తారు. మార్-ఎ-లాగో నుంచి బయటకొస్తే ట్రంప్ వీరాభిమాని విల్లీ గార్డియోలా ఏర్పాటు చేసిన అభిమాన బృందం జేజేలు వినిపిస్తాయి. ఇలాంటి తళతళలాడే వాతావరణంలో ట్రంప్ హ్యాపీగా ఉన్నారు.

అక్కడ జరిగే ఏదైనా మీటింగులో ట్రంప్ కులాసాగా మాట్లాడుతుంటే చాలు అందరూ వీడియోగ్రాఫర్ల అవతారం ఎత్తేస్తారు. ట్రంప్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. తన క్లబ్బులో జరిగే ప్రతి చిన్న కార్యక్రమానికీ ట్రంప్ హాజరవుతున్నారట. కొంత విశ్రాంతి తర్వాత మళ్లీ తన ట్రేడ్ మార్కు ర్యాలీలు ప్రారంభించడానికి ట్రంప్ రెడీ అవుతారట. ఇలా ఎలక్షన్లు ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ ట్రంప్ పవర్ తగ్గలేదు. రిపబ్లికన్ పార్టీ మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నట్లు కనబడుతోంది. ఎందుకంటే దాదాపుగా రిపబ్లికన్ పార్టీ సభ్యులందరూ ఇటీవల కాలంలో ఫ్లోరిడాకు వచ్చారు. అది కేవలం ఇక్కడ ఎంజాయ్ చేయడానికే కాదు. ట్రంప్‌ను కలవడానికి కూడా. అధ్యక్షుడిగా ఓడిపోయినా కూడా రిపబ్లికన్ పార్టీలో ఆయన ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదనడానికి ఇంత కన్నా పెద్ద ఉదాహరణ ఏం కావాలి?

అధ్యక్ష ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ట్రంప్.. గోల్ఫ్ ఆడుకుంటూ సరదాగా గడిపేస్తూ రాజకీయ జీవితాన్ని పక్కనపెట్టేస్తారా? లేక మళ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పుతారా? అని చాలా మంది అనుమానించారు. అయితే ట్రంప్ గోల్ఫ్ ఆడుకుంటూనే వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. దీనికోసమే తన రిపబ్లికన్ పార్టీలో చాలా మార్పులు చేస్తున్నారు. పార్టీపై తన పట్టును బిగిసేలా రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ట్రంప్‌ను విమర్శించే లిజ్ చెనీను పార్టీ నాయకత్వం నుంచి తప్పించడం నుంచి, జనవరి 6న యూఎస్ కాపిటొల్ వద్ద జరిగిన ఘర్షణపై కాంగ్రెస్‌లో వేసిన కమిటీని నిలువరించడం, కొత్త ఓటర్ల నిబంధనలు.. ఇలా ఎన్నో అంశాల్లో పార్టీపై తనకున్న గ్రిప్‌ను ట్రంప్ చూపించుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పటికన్నా ఇప్పుడే పార్టీపై ఆయన పట్టు ఎక్కువ. ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ (జీవోపీ) చాలా ఎక్కువగా ట్రంప్‌పై ఆధారపడుతోంది.


ట్రంప్‌కు ఎదురుతిరిగితే పార్టీ నుంచి బయటకు పంపేస్తారన్న భయం రిపబ్లికన్లలో పెరిగిందని కొందరు రాజకీయ నిపుణులు అంటున్నారు. అందుకేనేమో ట్రంప్‌ కోసం చాలా మంది పార్టీ సభ్యులు, ఆయన హయాంలో ఉన్నత పదువులు అలంకరించిన మాజీలు అందరూ ఫ్లోరిడా చేరుకొని సెటిలవుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఉండగా ట్రంప్ చుట్టూ ఉన్న రిపబ్లికన్ సభ్యులు ఇంకా ఆయన చుట్టూనే ఉన్నారు. దీంతో తాను ఓడిపోయానన్న భావన ట్రంప్‌లో పెద్దగా వచ్చినట్లు లేదు. అందుకే ఇప్పటికీ పార్టీని తన చెప్పుచేతల్లోనే పెట్టుకొని ఆడుకుంటున్నారు ట్రంప్. అదే సమయంలో పార్టీ కూడా ట్రంప్‌ను దాటి వెళ్లకుండా, ఆయన నీడలోనే కాపురం పెట్టుకోవాలని చూస్తోంది. మరి రాబోయే ఎన్నికల్లో అయినా ట్రంప్ గెలుస్తారో..? రిపబ్లికన్ పార్టీకి మరోసారి ఛాన్స్ ఇస్తారో.. లేక డెమోక్రాట్స్‌నే అమెరికన్లు అక్కున చేర్చుకుంటారో తెలియాలంటే మరో నాలుగేళ్లు వేచిచూడాల్సిందే..