Abn logo
Aug 8 2021 @ 16:47PM

యూఏఈ ప్రకటన.. అయోమయంలో ప్రవాసులు!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అత్యవసర పనుల కోసం స్వదేశానికి వెళ్లి, అక్కడే చిక్కుకుపోయిన నివాసితులు యూఏఈకి తిరిగి రావొచ్చని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలసిందే. అయితే ఈ ప్రకటన వేలాది మంది ప్రవాసీయులుకు చుక్కలు చూపిస్తుంది. ఆన్‌లైన్ విధానంలో ముందస్తు అనుమతి, వాక్సిన్ సర్టిఫికెట్ల అప్‌లోడింగ్‌తోపాటు ప్రయాణానికి 48 గంటల ముందు ముందు క్యూఆర్ స్కాన్ కోడు కల్గిన పీసీఆర్ టెస్ట్ నివేదిక అనే మూడు నియమాలు పూర్తి చేసిన వారు తమ దేశంలోని ప్రవేశించవచ్చని యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. దుబాయిలోకి ప్రవేశానికి దుబాయి వీసా మాత్రమే, యూఏఈ వాక్సిన్ మరియు క్వారంటైన్ అనే మూడు కీలకంశాలపై సరైన సమాచారం కోసం ప్రవాసీయులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి సమాచారం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలంగాణ సామాజిక కార్యకర్త కటుకం రవి పెర్కోన్నారు.


యూఏఈలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని స్వదేశానికి వెళ్లిన వారిని మాత్రమే తిరిగి రానిస్తుండడంతో అనేక మంది ఆశలు అడియాసలవుతున్నాయి. గతంలో సౌదీ అరేబియాలో కూడ ఇదే విధానాన్ని అమలు చేసింది. దీంతో భారతీయ వాక్సిన్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయడంలో ప్రవాసులు ఇబ్బుందులు పడ్డారు. తర్వాత న్యూ ఢిల్లీలోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయం ద్వారా అటెస్ట్ చేయించి అప్‌లోడ్ చేశారు. అనంతరం ఎటువంటి అటెస్టేషన్ లేకుండానే భారతీయ సర్టిఫికెట్లను సౌదీ ఆమోదించింది. ఇప్పుడు యూఏఈ విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. వ్యాక్సిన్ సర్టిఫికెట్ల గుర్తింపు అంశంపై ఇరు దేశాల మధ్య ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.


యూఏఈ ప్రకటన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు దుబాయి విమానాశ్రయానికి రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే కేవలం దుబాయి ఎమిరేట్ రెసిడెన్సీ వీసా కలిగిన వారిని మాత్రమే అధికారులు అనుమతిస్తుండటం.. ఇతర ఎమిరేట్ల వీసాలు కలిగిన వారిని అడ్డుకుంటుండటంతో గత రెంత రెండు రోజులుగా పెద్ద గందరగోళం నెలకొద్ది. శుక్ర, శనివారాల్లో అబుధాబి, ఇతర ఎమిరేట్ల వీసాలు కలిగిన తెలుగు ప్రవాసులకు అధికారులు దుబాయిలోకి అనుమతి నిరాకరించారు. శనివారం ముంబాయి విమానశ్రాయంలో 40 మంది దుబాయేతర వీసాలు కల్గిన ప్రవాసులు దుబాయి విమానంలోకి ఎక్కేందుకు అనుమతి లభించలేదు.


ఇలా అనుమతి పొందండి..

దుబాయి ఎమిరేట్స్ రెసిడెన్సీ వీసా కల్గిన వారు జీడీఆర్ఎఫ్ఏ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇతర ఎమిరేట్ల వీసాలు కల్గిన వారు మాత్రం ఐసీఏ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా ఈ అనుమతి పొందిన వారు మాత్రమే యూఏఈకి తిరిగి రావడానికి అర్హులు. ఆబుధాబి, షార్జా, రాస్ అల్ ఖైమా, ఫుజిరా, ఉమ్మాల్ ఖ్వాయిన్ మరియు అజ్మాన్ ఎమిరేట్ల వీసాలు కల్గిన ప్రవాసులు   https://smartservices.ica.gov.ae/echannels/web/client/guest/index.html#/registerArrivals లింక్ ద్వారా తమ వివరాలను ఆన్‌లైన్‌ పొందుపర్చాల్సి ఉంటుంది. దుబాయి ఎమిరేట్ వీసా కల్గిన వారు మాత్రం   https://smart.gdrfad.gov.ae/Smart_OTCServicesPortal/ReturnPermitService.aspx లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేయాలి. ఆమోదించిన తర్వాత మెయిల్‌కు క్యూఆర్ స్కాన్ కోడ్ వస్తుంది. అందువల్ల ప్రయాణికులు మెయిల్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన యాప్‌లను కూడా మొబైల్ ఫొన్లలో డౌన్‌లోడ్ చేసుకోవడం శ్రేయస్కరం. మొయిల్స్‌తోపాటు యాప్‌లో గ్రీన్ స్టేటస్ ఉంటే మాత్రమే యూఏఈలోకి అనుమతి పొందుతారు.


దుబాయి రెసిడెన్సీ వీసా వారు మాత్రమే దుబాయి విమానశ్రాయానికి రావాలని దుబాయిలోని ఎపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి చెప్పారు. అబుధాబి, షార్జా మరియు ఇతర ఎమిరేట్ల వీసాలు కల్గిన వారు మాత్రం అబుధాబి లేదా షార్జా విమానశ్రాయాలకు రావల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా వీసాల గడువు ఉన్న వారు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే.. మరో రెండు, మూడు రోజుల్లో నిబంధనల విషయంలో మరింత స్పష్టత వస్తుందని ట్రావేల్ ఏజెంట్ శ్యాంసుందర రెడ్డి అన్నారు. దుబాయి ఏమిరేట్ వీసా ఉన్న వారు మాత్రమే దుబాయి టికెట్ చేసుకోవాలని ఆయన వెల్లడించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్ 25న యూఏఈ.. భారతీయ విమానాల రాకపై నిషేధం విధించింది. ఈ నిషేధం అమలులోకి రాకముందు ఇరు దేశాల మధ్య వారానికి 300 విమానాలు నడిచేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 30 పరిమితం అయింది.


టికెట్ ధరలకు రెక్కలు..

హైదరాబాద్ నుంచి దుబాయి, ఇతర ఎమిరేట్లకు విమాన టికెట్ల ధరలు ఒక్క సారిగా అనూహ్యంగా పెరిగాయి. యూఏఈకి తిరిగి రావడానికి పెద్ద సంఖ్యలో ప్రవాసీయులు ఎగబడుతుండటంతో ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. కాగా.. భారత్ నుంచి విమానాల సర్వీసులను శనివారం ప్రారంభించిన ఎత్తేహాద్ ఎయిర్ లైన్స్.. మంగళవారం నుంచి హైదరాబాద్ నుంచి కూడా విమానాలను నడపనున్నట్టు ప్రకటించింది. అయితే ఎత్తేహాద్ ప్రకటన తర్వాత కూడా టికెట్ల ధరలు తగ్గలేదు. అబుధాబి నుంచి ఇతర ఎమిరేట్లకు ప్రైవేట్ వాహనాలలో వెళ్లడంపై ఆంక్షలు ఉన్నాయి. ఎత్తేహాద్ ద్వార అబుధాబి చేరుకున్న వారు అబుధాబి విమానశ్రాయం నుంచి కేవలం ఎయిర్ పోర్ట్ టాక్సీ లేదా ఎత్తేహాద్ చాపర్ లేదా ఎత్తేహద్ ఎక్స్ ప్రెస్ కోచ్‌ల ద్వారా మాత్రమే ఇతర ఎమిరేట్లకు ప్రయాణించవల్సి వస్తుంది. ఇలా ప్రయాణించే వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంది.

తాజా వార్తలుమరిన్ని...