శ్రీకాంత్‌ అద్భుతః

ABN , First Publish Date - 2021-12-19T07:57:17+05:30 IST

ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన తెలుగు షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌..

శ్రీకాంత్‌ అద్భుతః

  • వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ స్వర్ణ పోరుకు    
  • హోరాహోరీ సెమీస్‌లో లక్ష్యసేన్‌పై గెలుపు

 ఫామ్‌ కోసం తంటాలు.. ప్రధాన టోర్నీల్లో కనీసం సెమీస్‌ చేరడమే గగనం.. ఇక శ్రీకాంత్‌ పనైపోయిందనే టాక్‌ వినిపిస్తున్న సమయంలో.. ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా బరిలోకి దూకాడు. తడబడుతూ సాగినా.. పుంజుకొనిప్రపంచ చాంపియన్‌షి్‌పలో చరిత్ర సృష్టించాడు. ఈ మెగా టోర్నీ తుదిపోరుకు చేరిన తొలి భారత పురుష షట్లర్‌గా శ్రీకాంత్‌ నిలిచాడు. ఉత్కంఠగా సాగిన సెమీ్‌సలో సహచరుడు లక్ష్యసేన్‌పై పోరాడి నెగ్గాడు. ఒక దశలో వెనుకబడినా.. షాట్లు గతితప్పినా నిరాశపడలేదు. పదునైన స్మాష్‌లు, క్రాస్‌ కోర్టు షాట్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ మ్యాచ్‌పై పట్టుజారకుండా చూసుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలతో ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి.. గొప్ప విజయాన్ని అందుకున్నాడు. 


వెల్వా (స్పెయిన్‌): ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన తెలుగు షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌.. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌కు దూసుకెళ్లాడు. కనీసం రజతాన్ని ఖాయం చేసుకున్నాడు. శనివారం భారత ప్లేయర్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో 12వ సీడ్‌ శ్రీకాంత్‌ 17-21, 21-14, 21-17తో లక్ష్యసేన్‌పై పోరాడి విజయం సాధించాడు. మెగా ఈవెంట్‌ స్వర్ణ పోరుకు చేరుకున్న తొలి పురుష షట్లర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో ఓడిన సేన్‌ కాంస్యంతో సంతృప్తిపడ్డాడు. ఆదివారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో అంటాన్‌నె్‌స (డెన్మార్క్‌), లోహ్‌ కీన్‌ యు (సింగపూర్‌) మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో కిడాంబి తలపడనున్నాడు. తొలి గేమ్‌ ఆరంభంలో శ్రీకాంత్‌ 2-0తో ముందంజ వేసినా.. సేన్‌ వరుసగా రెండు పాయింట్లతో సమం చేశాడు. ఆ తర్వాత ఆధిక్యం చేతులు మారుతూ సాగినా.. 7-7 స్కోరు వద్ద సేన్‌ వరుసగా మూడు పాయింట్లు సాధించి 11-8తో బ్రేక్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆధిక్యాన్ని కొనసాగించి లక్ష్య 15-11తో దూసుకెళ్లాడు. కానీ, పట్టువీడని శ్రీకాంత్‌ 17-17తో మరోసారి సమం చేశాడు. అయితే, కిడాంబి ఆట కొంత గతి తప్పడంతో.. వరుసగా నాలుగు పాయింట్లు దక్కించుకున్న సేన్‌ 21-17తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. 


ఇక రెండో గేమ్‌ ఆరంభంలో శ్రీకాంత్‌ 4-8తో వెనుకబడినా ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. బాడీ స్మాష్‌లతో అదరగొడుతూ 9-9తో సమం చేశాడు. 11-9తో బ్రేక్‌కు వెళ్లిన కిడాంబి తిరిగి వచ్చిన తర్వాత కూడా మెరుగైన షాట్లతో అలరిస్తూ 16-13తో నిలిచాడు. 17-14తో ఉన్నప్పుడు వరుసగా నాలుగు పాయింట్లు సొంతం చేసుకొని 21-14తో నెగ్గి.. ఫలితాన్ని మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. నిర్ణాయక ఆఖరి గేమ్‌లో కూడా ఇద్దరూ ప్రాణాలొడ్డి పోరాడారు. 7-7వద్ద 43 షాట్ల ర్యాలీలో పాయింట్‌ సాధించిన సేన్‌ 11-8తో నిలిచాడు. కానీ, శ్రీకాంత్‌ 16-15 వద్ద గట్టిపోటీ ఇచ్చాడు. వరుసగా 3 పాయింట్లు స్కోరు చేసి 19-16తో నిలిచాడు. అదే జోరులో 21-17తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మహిళల డబుల్స్‌లో కొరియా షట్లర్ల మధ్య జరిగిన సెమీస్‌లో రెండో సీడ్‌ లి సోహి-షిన్‌సెయుంగ్‌చెన్‌ ద్వయం 21-18, 21-17తో కిమ్‌సోయింగ్‌-కోంగ్‌హియోంగ్‌పై నెగ్గింది. 

Updated Date - 2021-12-19T07:57:17+05:30 IST