‘పది’ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.. మే నెల చివరిలో పరీక్షలు..!

ABN , First Publish Date - 2022-01-29T14:03:16+05:30 IST

పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఈ మేరకు పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం టెన్త్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు శనివారానికి (ఈ నెల 29న) ముగియాల్సి ఉంది.

‘పది’ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.. మే నెల చివరిలో పరీక్షలు..!

వచ్చే నెల 14 దాకా పెంపు.. 


హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఈ మేరకు పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం టెన్త్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు శనివారానికి (ఈ నెల 29న) ముగియాల్సి ఉంది. అయితే, ఈ గడువును ఫిబ్రవరి 14వ తేదీ వరకు పెంచారు. కరోనా కారణంగా ప్రస్తుతం విద్యా సంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టెన్త్‌ పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. తాజా గడువు ప్రకారం... వచ్చే నెల 14వ తేదీలోగా ఫీజును చెల్లించవచ్చు. అలాగే, రూ.50 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 24, రూ.200 ఆలస్య రుసుముతో మార్చి 4, రూ. 500 ఆలస్య రుసుముతో మార్చి 14 వరకు ఫీజును చెల్లించడానికి అవకాశం కల్పించారు. కాగా, పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. 


ప్రస్తుతం కరోనా ప్రభావంతో విద్యా సంస్థలను మూసివేసి డిజిటల్‌ క్లాసులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో షెడ్యూల్‌ ప్రకారం సిలబస్‌ పూర్తి కావడం లేదు. ఈ నేపథ్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలను కొంత ఆలస్యంగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఈ ఏడాది ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇంటర్‌ పరీక్షలను మే మొదటి లేదా రెండో వారంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పరీక్షల అనంతరం.. అంటే మే చివరి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-29T14:03:16+05:30 IST