భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌

ABN , First Publish Date - 2022-02-25T16:54:51+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.

భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. నిన్నటి భారీ పతనం నేపథ్యంలో కనిష్ఠాల వద్ద ఆరంభంలో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. మరోవైపు రష్యా చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సహా ఐరోపా దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షల్ని ప్రకటించాయి. ఇవి రష్యాను కొంతమేర నిలువరించే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కారణం వల్ల.. గురువారం ఆరంభంలో భారీగా నష్టపోయిన అమెరికా సూచీలు ఆఖర్లో కొంత పుంజుకొని నష్టాల్ని పరిమితం చేసుకున్నాయి. అదే బాటలో పయనిస్తున్న ఆసియా మార్కెట్లు ప్రస్తుతానికి కొంత సానుకూలంగా కదలాడుతున్నాయి. మరోవైపు యుద్ధ భీతితో ప్రపంచవ్యాప్తంగా బాండ్ల రాబడులు గణనీయంగా పడిపోవడం కూడా సూచీలకు కలిసొచ్చింది.


అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడి తప్పకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ముడి చమురు ధరలు గరిష్ఠాల నుంచి కాస్త వెనక్కి వచ్చినప్పటికీ.. ఇంకా బ్యారెల్‌ ధర 100 డాలర్ల పైనే చలిస్తుండడం సూచీలను కలవరపెడుతోంది.


ఈ పరిణామాల మధ్య శుక్రవారం ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,178 పాయింట్ల లాభంతో 55,708 వద్ద, నిఫ్టీ 363 పాయింట్లు లాభపడి 16,610 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.64 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌30 సూచీలో ఒక్క నెస్లే ఇండియా తప్ప అన్ని షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, విప్రో, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.  

Updated Date - 2022-02-25T16:54:51+05:30 IST