Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్‌ పరిస్థితి చూస్తుంటే.. గుండె బరువెక్కుతోంది: వివేక్ మూర్తి

వాషింగ్టన్: భారత్‌లో మహమ్మారి కరోనావైరస్ సృష్టిస్తున్న విలయం తాలూకు కథలు వింటుంటే గుండె బరువెక్కుతోందని, మాతృదేశంలో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితులను చూస్తుంటే తీవ్ర ఆందోళన కలుగుతోందని అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మూర్తి.. ప్రతిరోజు తమవారిని ఫోన్ ద్వారా భారత్‌లోని పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల మాటల ద్వారా ప్రస్తుతం వారు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు అర్థమైందని అన్నారు. వారు చెబుతున్న కరోనా కల్లోల స్టోరీలు వింటుంటే గుండె బరువెక్కిందని మూర్తి పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు మరెప్పుడూ భారత్‌లో రాకూడదని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో వరుసగా ప్రతిరోజూ 3.50లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. 

అలాగే దేశంలోని పలు నగరాల్లోని ఆస్పత్రుల్లో ప్రాణవాయువు కొరత కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటే.. భారత్‌లో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతుందని మూర్తి పేర్కొన్నారు. భారతీయులు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఈ ఆపత్కాలంలో భారత ప్రజలకు అగ్రరాజ్యం సాయం ఎంతో అవసరం అన్నారు. భారత్‌కు సాయం అందించే విషయమై తాను అమెరికా ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్నందున.. ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వచ్చి, వైరస్‌పై పోరాడాలని ఈ సందర్భంగా వివేక్ మూర్తి సూచించారు. ఇక కరోనా కారణంగా మూర్తి కుటుంబంలో ఇటు ఇండియా, అటు అమెరికాలో కలిపి ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, వివేక్ మూర్తి ఇటీవల అమెరికాకు రెండోసారి సర్జన్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.   

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement