IPL 2021: కేరాఫ్ కాంట్రవర్సీ.. బ్యాన్ అవుతుందా..?
ABN , First Publish Date - 2021-05-02T00:19:56+05:30 IST
ఒకపక్క కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ప్రతి రోజూ లక్షల మందిని కబళిస్తోంది. వేల మంది ప్రాణాలను బలిగొంటోంది. దేశం మొత్తం ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని చిగురుటాకులా వణికిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేశ వ్యాప్తంగా..
ఇంటర్నెట్ డెస్క్: ఒకపక్క కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ప్రతి రోజూ లక్షల మందిని కబళిస్తోంది. వేల మంది ప్రాణాలను బలిగొంటోంది. దేశం మొత్తం ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని చిగురుటాకులా వణికిపోతోంది. ఐపీఎల్ బయోబబుల్ వాతావరణంలో జరగడం వల్ల ఆటగాళ్లంతా సేఫ్‌గా ఉన్నారు. కానీ వారి కుటుంబాలు మాత్రం కరోనా కోరల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో టోర్నీ నుంచి ఈ మధ్య కాలంలో అనేకమంది ఆటగాళ్లు స్వచ్ఛందంగా వైదొలుగుతున్నారు. ఆటగాళ్లతో పాటు అంపైర్లు కూడా బయటకు వెళ్లిపోతుండడం యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. టోర్నీ ఇంకా నెల రోజులపాటు కొనసాగాల్సిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా టోర్నీకి దూరం కావడం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
ఆసీస్ ఆటగాళ్లు అవుట్!
ఇప్పటికై ఐపీఎల్ నుంచి ఆసీస్ ఆటగాళ్లు కేన్ రిచర్డ్‌సన్, ఆండ్రూ టై, ఆడం జంపా వంటి ఆటగాళ్లు కరోనా కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు. అలాగే ఆసీస్ అంపైర్ పాల్ రీఫెల్ కూడా టోర్నీ నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించాడు. వీరందరూ ఉన్నట్లుండి ఐపీఎల్ నుంచి వెళ్లిపోవడానికి కారణం.. భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం త్వరలో బ్యాన్ విధించనుందనే వార్తలు వస్తుండడమే. టోర్నీ ముగిసే సమయానికి తమ దేశ ప్రభుత్వం ఈ బ్యాన్ విధిస్తే తాము అక్కడికి చేరుకునే అవకాశం ఉండదని, అందువల్ల ఇప్పుడు వేళ్లిపోతే మంచిదనే భావనతోనే వీరంతా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరికొంతమంది ఆటగాళ్లు కూడా జట్టును వదిలి వెళ్లిపోయే అవకాశాలు లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
భారతీయులు కూడా..
విదేశీ ఆటగాళ్లు మత్రమే కాకుండా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టోర్నీ నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించాడు. తమ కుటుంబంలో అనేకమంది కరోనా బారిన పడడంతో వారంతా జట్టును వీడుతున్నట్లు ప్రకటించాడు. భారత అంపైర్ నితిన్ మీనన్ తల్లి, భార్య కూడా కరోనా బారిన పడడంతో ఆయన కూడా టోర్నీ నుంచి వొదిలిగారు. ఈ క్రమంలోనే మరికొంతమంది ఆటగాళ్లు కూడా బయటకు వచ్చేస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఈ మధ్య కాలంలోనే క్రికెటర్ ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడ్డారు. కానీ ధోనీ టోర్నీలోనే కొనసాగాడు. వారిద్దరూ కోలుకున్నట్లు గురువారం ధోనీ స్వయంగా ప్రకటించారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ సానుకూలంగా కొనసాగుతుందా..? లేక టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా అర్థాంతరంగా ఆగిపోతుందా..? అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ కొనసాగుతుందనే వార్తలపై ఆసీసీ మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ వంటి మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి తరుణంలో ఐపీఎల్ అవసరమా..? అసలు ఈ టోర్నీ నిజంగా వినోదం కోసమా..? లేక పరిస్థితుల నుంచి ప్రజలను పక్క దోవ పట్టించేందుకా..?’ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
కానీ సాధారణ ప్రజలు మాత్రం గిల్‌క్రిస్ట్ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంతటి దారుణ పరిస్థితుల్లో ఐపీఎల్ నిజంగా తమ ఆలోచనను పక్కదోవ పట్టిస్తోందని, అయితే అదే తమకు కొంత మనశ్శాంతి ఇస్తోందని, అది కూడా లేకపోతే ఎంతోమంది మానసికంగా కృంగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఐపీఎల్ ఉండబట్టే దేశంలోని కోట్ల మంది ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారని, అందువల్ల ఐపీఎల్ ప్రజలకు మంచే చేస్తోందని దానిని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు.
ఈ క్రమంలోనే బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి.. ‘ఐపీఎల్ 2021 సీజన్ నిలిపే అవకాశం ప్రస్తుంతానికి లేదు. షెడ్యూల్ ప్రకారం టోర్నీ ముందుకు సాగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆటగాళ్లు వెళ్లిపోయినంత మాత్రాన ఇబ్బందేం లేదు. ఉన్న వాళ్లతోనే టోర్నీ నిర్వహిస్తాం’ అని చెప్పడంతో ఈ అనుమానాలకు తెరపడింది.