Abn logo
Oct 22 2021 @ 02:30AM

సైబర్‌ నేరాలకు కఠిన చట్టం

  • ‘నల్సార్‌’తో కలిసి రూపొందిస్తున్నాం
  • ముసాయిదా ఇప్పటికే సిద్ధమైంది
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌  

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన సైబర్‌ చట్టాన్ని తేవాలని ప్రభుత్వం భావిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. నల్సార్‌ లా యూనివర్సిటీ సహకారంతో ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందన్నారు. ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఇవాంటి గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సైబర్‌ నేరాలపై జాతీయ స్థాయిలో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చట్టం చేయలేదని ఇటీవలే నగరంలో పర్యటించిన ఐటీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు తనకు తెలిపారన్నారు. ఈ దిశగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా సిద్ధం చేసి దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఈ ముసాయిదాపై సూచనలు, సలహాలు అందించాలని ఇవాంటి ప్రతినిధులను కోరారు. 


స్మార్ట్‌ ఫోన్లు ఎప్పుడు హ్యాకింగ్‌కు గురవుతాయోనన్న విషయంపై రాజకీయ నేతలతో పాటు ప్రముఖుల్లో ఆందోళన ఉంటుందని, తనకూ ఇలాంటి ఆందోళన ఉంటుందన్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ సైబర్‌ నేరాల బారిన పడే ప్రమాదముందని, ఈ రంగంలో నైపుణ్యం సాధిస్తే ఉపాధి అవకాశాలు భారీగా ఉన్నాయన్నారు. సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా ఉన్న ఇవాంటి హైదరాబాద్‌లో తన వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని, ఈ రంగంలో మరింతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సైబర్‌ సెక్యూరిటీలో వివిధ దేశాల్లో 46 వేల కస్టమర్లు ఉన్నారని, 200 మిలియన్ల కంప్యూటర్లకు తాము భద్రత కల్పిస్తున్నామని ఇవాంటి సర్వీస్‌ మేనేజ్మెంట్‌ సొల్యూషన్స్‌ అధ్యక్షురాలు నాయకి నయ్యర్‌ తెలిపారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 500 మంది ఉద్యోగులుండగా.. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో ఉద్యోగుల సంఖ్య భారీగా పెంచుతామన్నారు. వచ్చే నెల సైబర్‌ సెక్యూరిటీపై నగరంలో హ్యాకథాన్‌ నిర్వహించనున్నామని, ఇందులో వెయ్యిమంది పాల్గొననున్నారని వివరించారు. ఈ రంగంలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని, పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఇవాంటి ప్రతినిధులు శ్రీరామ్‌ బిరుదవోలు, రామ్‌ మొవ్వ, శ్రీనివాస్‌ ముక్కామల, తదితరులు పాల్గొన్నారు.  


భారీగా ద్విదశాబ్ది ఉత్సవాలు: కేటీఆర్‌  

టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కేటీఆర్‌ పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్లీనరీ, తెలంగాణ విజయ గర్జన కార్యక్రమాల ఈ నేపథ్యంలో కేటీఆర్‌ నియోజకవర్గస్థాయి ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాలు మూడో రోజు కూడా కొనసాగాయి. గురువారం మెదక్‌, సంగారెడ్డి, కరీంనగర్‌, నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతోసమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... నవంబర్‌ 15న జరిగే విజయ గర్జన భారీ బహిరంగ సభకు క్షేత్ర స్థాయి నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు హాజరయ్యేలా చూడాలని కోరారు. సమావేశాల్లో పువ్వాడ నాగేశ్వరరావు, జగదీశ్‌ రెడ్డి, కే. కేశవరావు, ఎంపీ వెంకటేష్‌ నేతకాని, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. కాగా, హైటెక్స్‌లో ప్లీనరీ ఏర్పాట్లను పట్నం మహేందర్‌రెడ్డి,  టీఎ్‌సఐఐసీ ఛైర్మన్‌ బాలమల్లు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కార్పొరేటర్లు, బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద పటేల్‌ పరిశీలించారు.