బడి గంటలు మోగేదెన్నడు?

ABN , First Publish Date - 2021-01-09T06:15:40+05:30 IST

డిజిటల్ ఆన్‌లైన్ విద్యావిధానం బడి అనే సంస్థకు ప్రత్యామ్నాయం కాజాలదు. బడికి ఒక సామాజిక కోణం ఉంది. విద్య నేర్పించడమే కాకుండా పిల్లలకు స్వేచ్ఛను ఇచ్చే ప్రదేశమే పాఠశాల. వాళ్లు హాయిగా ఆడుకోవడానికి, నవ్వుకోవడానికి బడి ఒక మహత్తర...

బడి గంటలు మోగేదెన్నడు?

డిజిటల్ ఆన్‌లైన్ విద్యావిధానం బడి అనే సంస్థకు ప్రత్యామ్నాయం కాజాలదు. బడికి ఒక సామాజిక కోణం ఉంది. విద్య నేర్పించడమే కాకుండా పిల్లలకు స్వేచ్ఛను ఇచ్చే ప్రదేశమే పాఠశాల. వాళ్లు హాయిగా ఆడుకోవడానికి, నవ్వుకోవడానికి బడి ఒక మహత్తర నెలవు, ఒక అపూర్వ అవకాశం. బాలలకు భద్రత కల్పించేది, ఆరోగ్యాన్ని పరిరక్షించేది, సామాజిక భావాలను పెంపొందించేది, వారిలోని సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేది, భావి పౌరులకు సహజీవన మాధుర్యాన్ని, తోటివారి పట్ల సహానుభూతి నేర్పేది కేవలం బడి మాత్రమే. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ బడులను తెరవడం ప్రభుత్వ జరూరు కర్తవ్యం.


పూజిత, రజిత, స్వాతి, అంజలి, శివాని కస్తూర్బా గాంధీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులు. కరోనా కారణంగా బడులు మూసివేయడంతో ఇంటి పట్టునే ఉండిపోయారు, కాదు, వివాహితలుగా మారిపోయారు! బాల్యవివాహాలతో వారి జీవితాలలో చదువు వెలుగులు ఆరిపోయాయి. విశ్వనగరం హైదరాబాదులోని బాలికల ఉదంతాలివి. గద్వాల జిల్లాలోని ఒక కుగ్రామంలో పొలం పనికి వెళ్ళిన ఐదేళ్ళ రిషిక ఏదో పురుగు కరిచి కన్నుమూసింది. 14 ఏళ్ల బాలిక లైంగిక వేధింపులకు గురయింది. ఇంట్లో ఉన్న టీవీకి కనెక్షన్ ఇవ్వబోయి కరెంట్ షాక్ తగిలి మరో బాలిక చని పోయింది. గ్రామాలలో బాలికల పరిస్థితి ఎలా ఉందో ఊహించడం అంత కష్టం కాదు. వారిపై పని ఒత్తిడి లేదా పెళ్ళిళ్ళ ఒత్తిడి పెరిగింది.


ఆన్‌లైన్ క్లాసుల పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపుల పరిచయాలు వేధింపులకు దారి తీయడం మరొక తలనొప్పిగా మారింది. బచ్చన్న అనే బాలుడు తాటిచెట్టు ఎక్కి కిందపడి ప్రాణాలు వదిలాడు. బడులు ఉంటే ఈ బాలలంతా వాటిలో గడిపేవాళ్ళు కదా. హైదరాబాదులో మహిళా పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు, తల్లులు పని ముగించుకొని ఇంటికి వచ్చే వరకు తిండితిప్పలు ఉండవు. తల్లులు పని నుంచి వచ్చిన తరువాతనే ఆ పిల్లలకు భోజనం. కరోనా లేని కాలంలో ఈ పిల్లలు ప్రతి మధ్యాహ్నం బడిలో వండిన వేడి వేడి అన్నం తినేవాళ్ళు. బడి భోజనం కొరవడడంతో ఆకలికి నకనకలాడే పిల్లలు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. బడుల మూసివేత, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు బాగా లేక, వారికి పనులు సరిగ్గా దొరకక పిల్లలు కూడా పనులకు పోతున్న కుటుంబాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. 


మామూలు సమయాలలోనే 50 శాతం బాలలు పోషకాహార లోపంతో కునారిల్లుతున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక కరోనాతో అతలాకుతలమైన కుటుంబాల పిల్లలు ఆకలికి బలవ్వకుండా ఎలా ఉంటారు? మధ్యాహ్న భోజనం అందించే బడి మూత పడడంతో లక్షలాది పిల్లలు ఒక పూట దొరికే పౌష్టికాహారానికి దూరమయ్యారు. బాలలకు ఆహారభద్రత చాలా ముఖ్యం. దేశంలో ఆహారం లేక కాదు; ఆహారం అందించే రాజకీయ సంకల్పం లేకపోవడం వల్లే లక్షలాది బాలలు ఆహార అభద్రతతో అల్లాడుతున్నారని అమర్త్యసేన్ అన్నారు. ఇలా, కరోనా కాలంలో బడులు మూసివేసిన కారణంగా బాలల దయనీయ, ప్రమాదకర పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆందోళన కలిగించే విషయాలు మరిన్ని వెలుగులోకి వస్తాయి. 


తెలంగాణలో కరోనాకు ముందు 30 వేల ప్రభుత్వ, ఇంచుమించు 10 వేల ప్రైవేట్ పాఠశాలల్లో మొత్తం 60 లక్షల మంది బాలలు విద్యాభ్యాసం చేస్తుండేవారు. కరోనా విలయంలో బడులు లేని కారణంగా వారిలో అత్యధికులు బాలకార్మికులుగా మారిపోయారు. బాల్య వివాహాల బంధనాలకు లోనయ్యారు. స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలయ్యారు. బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గురుకుల పాఠశాలల్లో చదివే దాదాపు నాలుగులక్షల మంది పిల్లలకు హాస్టళ్లలో మంచి ఆహారం లభించేది. వ్యాయామం చేస్తుండేవారు. రోజువారీ కార్యక్రమాలలో ఎంతో హుషారుగా ఉండే వాళ్ళు. ఇప్పుడు ఇంటిపట్టునే ఉండిపోయిన ఈ విద్యార్థులను గుర్తుపట్టడమే కష్టంగా ఉంది. ఇంటి వద్ద సరైన పౌష్టికాహారం లేక, ఉతికిన బట్టలు ధరించినా స్నానాలు చేయక అంతా ఒక లయ తప్పిన జీవులుగా కనపడుతున్నారు.


కొన్ని గ్రామాలలో పిల్లలు బడికి వెళ్ళకుండా ఖాళీగా తిరుగుతున్నారని గొర్రెలు మేకలు కాస్తున్నారని క్షేత్రస్థాయి సమాచారం. అలాగే పౌల్ట్రీఫామ్‌లలో రాత్రి షిఫ్ట్‌లలో కోళ్లను వాహనాలకు ఎక్కించడం, కిరాణా దుకాణాలలో మినరల్ వాటర్ ప్లాంట్‌లలో హెల్పర్లుగా, పత్తిచేలలో, జిన్నింగ్ మిల్లులో కూలీలుగా, ఆటోలు, జీపులలో క్లీనర్లుగా పని చేస్తున్నారు. ఇలా పలు రకాల పనులలో నిమగ్నమై తాము చదివిన చదువులు పూర్తిగా మరిచి పోయే స్థితికి చేరుకున్నారు. పనులకు పోని పిల్లలు చేపలు పట్టడానికి చెరువుల చుట్టూ తిరగడం, చెలకల వెంట తిరగడం, అప్పూసప్పూ చేసి తల్లి దండ్రులు కొనిచ్చిన స్మార్ట్‌ఫోన్‌లలో ఆటలు ఆడడం, దోస్తుల వెంట తిరిగి తిరిగి ఎప్పటికో ఇల్లు చేరడం మామూలైపోయింది. ఈ వయసు పిల్లలతో ఎలా మసలుకోవాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. 


ఆన్‌లైన్ తరగతులని, టీవీ తరగతులని కొన్నిరోజులు హడావిడి చేసినా పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఆ హడావిడి కూడా అంతగా కన్పించడం లేదు. తమకు దక్కని చదువును తమ పిల్లలకు అందించడానికి పలు త్యాగాలు చేస్తున్న తల్లిదండ్రులు అసంఖ్యాకంగా ఉన్నారు. కరోనా సంక్షోభం ఒక్కసారిగా వారి జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ సంక్షోభం నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వమూ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలూ పిల్లలు చదువులకు దూరం కాకూడదనే భావనకు వచ్చాయి. తత్ఫలితంగానే ఆన్‌లైన్ ద్వారా కొన్ని తరగతుల విద్యార్థులకు బోధనా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆన్‌లైన్ బోధన అంటే టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ఉండాలి. వీటితో పాటు అతి వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అవి లేని కుటుంబాలలో పిల్లలూ, వారి తల్లిదండ్రులూ చాలా ఇబ్బందులు పడుతున్నారు.


టీవీ ఉంటే రీచార్జ్ లేక, స్మార్ట్ ఫోన్ ఉంటే డేటా చార్జింగ్ చేయించలేక, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే అందరికీ స్మార్ట్‌ఫోన్‌లు కొనలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక అన్నీ ఉండీ డిజిటల్ పాఠాలు వింటున్న పిల్లలకు స్క్రీన్ టైమ్ ఎక్కువ కావడంతో తల నొప్పి రావడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఉన్న అసమానతలకు తోడు డిజిటల్ అసమానతలు మన ముందుకు వస్తున్న ప్రమాదకరమైన పరిస్థితి. లక్షలాది పిల్లలకు తోటి పిల్లలతో పోటీపడే అవకాశాలు కోల్పోతున్నామనే భావన కలుగుతోందని గుర్తించాలి. ఆన్‌లైన్ విద్యాబోధన విషయమై రాష్ట్ర విద్యాశాఖ రోజువారీగా సమాచారం సేకరిస్తూనే ఉంది. ఈ సమాచారం ఎంతవరకు సరైనదో వారికే తెలియాలి. ఎంతో మంది టీచర్లు బయటకు చెప్పకపోయినా ఈ ఆన్‌లైన్ తరగతుల పట్ల సంతృప్తిగా, సుముఖంగా లేరు. 


టీచర్లను బడులకు వెళ్ళి, విధులు నిర్వర్తించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే పిల్లలు లేని,  వారి అల్లరి లేని, పాటలు లేని, ఆటలు లేని, గంట విన పడని బడిని టీచర్లు ఊహించలేక పోతున్నారు. చడీ చప్పుడూ, సందడి లేని ఆ బడులు కళ కోల్పోయాయనడంలో సందేహం లేదు. కొన్ని బడులలో మోకాలు లోతు గడ్డి మొలిచింది. శుభ్రం చేసే వాళ్ళు లేక మధ్యాహ్న భోజన సామగ్రి బూజు పట్టి పనికిరాకుండా పోయాయి. 


కొన్ని ప్రాంతాలలో తొమ్మిది, పది తరగతులకైనా పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు సిద్ధపడితే పై నుంచి ఉత్తర్వులు లేవంటూ అధికారులు వారిని నిరుత్సాహపరుస్తున్నారని తెలిసింది. తమకు పిల్లల్ని చూడా లనిపిస్తోందని అనేక మంది ఉపాధ్యాయులు పలు జూమ్ సమావేశాలలో తెలిపారు. కొంతమంది టీచర్లు అయితే తమకు ప్రభుత్వాలు జీతం ఇవ్వవచ్చు కానీ పాఠాలు చెప్పే హక్కును మాత్రం పిల్లలనుంచే పొందు తున్నామని ఆ హక్కును కరోనాకాలంలో పూర్తిగా కోల్పోయామని బాధపడుతున్నారు. ఆన్‌లైన్ క్లాసుల పట్ల, టీవీ క్లాసుల పట్ల ఉపాధ్యాయులు ఏ మాత్రం సుముఖంగా లేరు. అంతే కాకుండా బడి ప్రాధాన్యాన్ని, విద్యాబోధనలో దాని పాత్రను టీచర్లు ఇప్పుడు మరింత స్పష్టంగా చూడ గలుగుతున్నారు.


బడులు ఎప్పుడు తెరుస్తారా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న టీచర్లు ఎందరో! ప్రభుత్వ టీచర్ల పట్ల సమాజంలో, చదువు చెప్పరనే ఒక అపప్రథ ఉంది కదా. దానికి తోడు ఈ కరోనా తరుణంలో జీతాలు అప్పనంగా తీసుకుంటూ పాఠాలు చెప్పడం లేదనే అపవాదును కూడ వారు మోయవలసివస్తోంది. ఈ పరిస్థితుల నుంచి బయట పడే ఏకైక మార్గం బడులు తెరవడమే అని చాలామంది అంటున్నారు. 


డిజిటల్ ఆన్‌లైన్ విద్యావిధానం బడి అనే సంస్థకు ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాజాలదు. బడికి ఒక సామాజిక కోణం ఉంది. విద్య నేర్పించడమే కాకుండా పిల్లలకు స్వేచ్ఛను ఇచ్చే ప్రదేశమే పాఠశాల. వాళ్లు హాయిగా ఆడుకోవడానికి, నవ్వుకోవడానికి బడి ఒక మహత్తర నెలవు, ఒక అపూర్వ అవకాశం. బాలలకు భద్రత కల్పించేది, ఆరోగ్యాన్ని పరిరక్షించేది, సామాజిక భావాలను పెంపొందించేది, వారిలోని సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేది, చదువులతో పాటు ఆటా పాట నేర్పేది, భావి పౌరులకు సహజీవన మాధుర్యాన్ని, తోటివారి పట్ల సహానుభూతిని నేర్పేది కేవలం బడి మాత్రమే. కనుకనే, కొవిడ్ నిబంధనలను పాటిస్తూ బడులను తెర వాలని ముఖ్యమంత్రికి పాఠశాల విద్యాకమిటీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అలాగే తల్లిదండ్రుల సంఘాలు, బాలల హక్కుల పరిరక్షణ సంఘాలు కూడా బడులు తెరవాలని ఒక స్పష్టమైన ప్రతిపాదన చేస్తున్నాయి. 9, 10 తరగతుల పిల్లలకు పూర్తికాలం బడి నడపాలని; 6, 7, 8 తరగతుల పిల్లలకు ఒంటిపూట బడి నడపాలని; 3, 4, 5 తరగతుల బాలలకు వారంలో రెండు లేదా మూడు రోజులు తరగతులు నడపాలని ప్రతిపాదిస్తున్నాయి. తరగతుల నిర్వహణలో ప్రభుత్వానికి సహకరించేందుకు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇక ఏ మాత్రం ఆలస్యం చేయ కుండా వెంటనే బడులను తెరిచి, వాటికి మరింత కాలం దూరం అయ్యే ప్రమాదం నుంచి బాలలను కాపాడాలి. 



-ఆర్. వెంకట రెడ్డి 

జాతీయ కన్వీనర్, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్

Updated Date - 2021-01-09T06:15:40+05:30 IST