‘ఉపాధి’లోనూ ఉప ప్రణాళిక?

ABN , First Publish Date - 2021-06-14T09:20:52+05:30 IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దళిత, గిరిజన ఉప ప్రణాళిక అమలు చేస్తారా

‘ఉపాధి’లోనూ ఉప ప్రణాళిక?

  • ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు.. 
  • జాబ్‌ కార్డులు, పనిదినాల ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచే!
  • ప్రయోజనాలపై భిన్నాభిప్రాయలు
  • దామాషా మేరకు కేటాయిస్తే
  • కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలకు నష్టమే
  • రాష్ట్రంలో దళిత, గిరిజనుల పనిదినాలే ఎక్కువ


హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దళిత, గిరిజన ఉప ప్రణాళిక అమలు చేస్తారా? ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించనున్నారా? వారి జాబ్‌ కార్డులు, చేసిన పనిదినాల ఆధారంగా ప్రయోగాత్మకంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచే నిధులు విడుదల చేస్తారా? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రం కసరత్తును ముమ్మరం చేసింది. అయితే ఎస్సీలు, ఎస్టీలకు సబ్‌ప్లాన్‌ రూపంలో ఈ పథకాన్ని అమలు చేసే సన్నాహాల్లో భాగంగానే ప్రత్యేకంగా నిధుల విడుదలను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధి పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎస్సీలు, ఎస్టీలకు జాబ్‌ కార్డుల ఆధారంగా నిధుల కేటాయింపు జరిగేలా చూడాలని మార్చి 2న రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకుడు ధర్మవీర్‌ ఝా ఆదేశించారు. 


ఇప్పటి వరకు ఉన్న విధానంలో ప్రత్యేక విభాగ కేటాయింపులు లేవు. కానీ, కేంద్రం ఆదేశాలతో ఎస్సీలు, ఎస్టీలకు కేటాయించిన/చెల్లించిన వేతనాల మొత్తాల వివరాలను కేంద్రానికి సమర్పించాల్సి వస్తోందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీలకు ఉప ప్రణాళిక రూపంలో ఉపాధి హామీని అమలు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అయితే, కేంద్రం అనుసరిస్తున్న తాజా విధానంతో ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ ఉండవని, పైగా సమస్యలు ఉత్పన్నమవుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానాన్ని సీపీఎం నేత బృందా కారత్‌ వ్యతిరేకించారు. కాగా, కేటగిరీల వారీగా కూలీలను విభజించడం, ప్రత్యేకంగా నిధులు చెల్లించడం ద్వారా వేతనాల చెల్లింపుల ప్రక్రియ క్లిష్టతరం కావచ్చని, ఈ పథకానికి కేటాయించిన నిధులు కూడా తగ్గవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 


ప్రయోజనాలు ఎంత?

ఎస్సీలు, ఎస్టీలకు ఉపాధి పథకంలో ప్రత్యేక నిధులు కేటాయించి, విడుదల చేయడం ద్వారా లాభనష్టాలేవీ ఉండవు. అయితే, ఈ నిధులపై పరిమితి విధిస్తేనే పథకం అమలులో సమస్యలు ఎదురవుతాయి. ఎస్సీలు, ఎస్టీలకు దామాషా మేరకు ప్రభుత్వ పథకాల అమలు కోసం కేంద్రం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను అమలు చేస్తున్నాయి. ప్రతి పథకంలోనూ వారి దామాషా కోటా మేరకు నిధులు కేటాయిస్తున్నాయి. ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించడం కుదరదు. తెలుగు రాష్ట్రాలూ దళిత, గిరిజన ఉప ప్రణాళికను చట్టంగా తెచ్చి అమలు చేస్తున్నాయి. కానీ, ఉపాధి హామీ పథకంలో కూడా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తే కొన్ని రాష్ట్రాల్లో ఆ వర్గాల వారికి నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఉదాహరణకు రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల్లో జరిగిన ఉపాధి పనిదినాల్లో మూడింట రెండు వంతులు (66 శాతానికి పైగా) దళిత, గిరిజనులే ఉన్నారు. దామాషా ప్రకారమైతే.. 30-32 శాతానికే పరిమితమయ్యే ప్రమాదముంది. కాగా, రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంపై దళితులు, గిరిజనులు పెద్ద ఎత్తున ఆధారపడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పని దినాల్లో మూడింట రెండు వంతుల మేర వారే పనిచేశారు.


ఎస్సీ, ఎస్టీలకు అందని బిల్లులు

లింగాలఘణపురం: ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు బిల్లుల చెల్లింపుల విషయంలో కులాల విభజన జరుగుతుండడంతో ఎస్సీ, ఎస్టీలకు డబ్బులు ఆలస్యంగా అందుతున్నాయి. మిగతా వారికి రెండు మూడు వారాల్లో అందిస్తుండగా వీరికి మాత్రం మూడు నెలలు పడుతోంది. కొద్దికాలంగా ఉపాధి పథకంలో పనిచేస్తున్న కూలీల వివరాలను ఎస్సీ, ఎస్టీలు, ఇతర సామాజిక వర్గాల వారీగా విభజిస్తూ పని వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 12 వారాలుగా పనిచేస్తున్న కూలీలకు ఒక్కో కుటుంబానికి సగటున రూ.12 వేలకుపైగా బిల్లులు రావాల్సి ఉంది. ఇలా జనగామ జిల్లాలో పెద్దఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.



Updated Date - 2021-06-14T09:20:52+05:30 IST