వరంగల్‌ మేయర్‌గా సుధారాణి

ABN , First Publish Date - 2021-05-08T08:14:48+05:30 IST

ఇటీవల ఎన్నికలు జరిగిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్లన్నీ ఏకగ్రీవమయ్యాయి.

వరంగల్‌ మేయర్‌గా సుధారాణి

  • ఖమ్మం మేయర్‌గా పునుకొల్లు నీరజ
  • సీల్డ్‌ కవర్లలో మేయర్లు, చైర్మన్ల పేర్లు
  • కొవిడ్‌ నిబంధనల మధ్య ప్రమాణాలు
  • వీడియో కాల్‌ ద్వారా 17 మంది ప్రమాణం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఇటీవల ఎన్నికలు జరిగిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్లన్నీ ఏకగ్రీవమయ్యాయి. రెండు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లతోపాటు ఐదు మునిసిపాలిటీల చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌ పదవులన్నీ అధికార టీఆర్‌ఎ్‌సకే దక్కాయి. అధిష్ఠానం సీల్డ్‌ కవర్‌లో పేర్లు పంపించిన వారినే ఎన్నుకున్నారు. ప్రతి చోటా అత్యధిక స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకున్నా.. పాలకమండళ్ల ఎన్నికకు ముందుజాగ్రత్తగా  కొన్ని చోట్ల ఎక్స్‌ అఫీషియో సభ్యులు కూడా హాజరయ్యారు. శుక్రవారం కొవిడ్‌ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించారు. తొలుత ఏప్రిల్‌ 30న జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులందరితో ప్రమాణం చేయించారు. అనంతరం పాలకమండళ్ల ఎన్నికలు నిర్వహించారు. కాగా, గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యుఎంసీ) మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్‌ ఎన్నికయ్యారు. ఇక్కడ 66 డివిజన్లకుగాను టీఆర్‌ఎస్‌ 48 డివిజన్లను గెలుచుకోవడంతో.. పాలకమండలి ఎన్నికలో బీజేపీ(10), కాంగ్రెస్‌(4) పాల్గొనలేదు. 


ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఎంపీ పసునూరి దయాకర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, ఆరూరి రమేష్‌, చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్య హాజరయ్యారు. అంతకుముందు ఉదయం హన్మకొండలోని ఓ హోటల్‌లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో మంత్రులు గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు పార్టీ సూచించిన వారికి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాలని చెప్పారు. అనంతరం జీడబ్ల్యూఎంసీ కార్యాలయం వద్దకు బస్సులో చేరుకున్నారు. ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు రెండూ మహిళలకే దక్కాయి. మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జొహారా ఎన్నికయ్యారు. వీరిద్దరి పేర్లను సీఎం కేసీఆర్‌.. మంత్రి పువ్వాడ అజయ్‌తో ఫోన్‌లో చర్చించిన అనంతరం సీల్డ్‌ కవర్‌లో మంత్రి  వేముల ప్రశాంత్‌రెడ్డితో ఖమ్మం పంపించారు. హోటల్‌లో సమావేశం అనంతరం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి కార్పొరేటర్లు ప్రత్యేక బస్సులో కార్యాలయానికి చేరుకున్నారు.




ఎక్స్‌ అఫీషియోల ఓట్లపై కాంగ్రెస్‌ అభ్యంతరం..

నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మునిపాలిటీలో 20 వార్డులకుగాను 11 వార్డులు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ తరఫున చైర్మన్‌గా రాచకొండ శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌గా మురారిశెట్టి ఉమారాణి ఎన్నికయ్యారు. అవసరమైతే ఎక్స్‌ అఫీషియా ఓట్లు వేసేందుకు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఎంపీ లక్ష్మీకాంతారావు హాజరయ్యారు. అయితే లక్ష్మీనారాయణ, లక్ష్మీకాంతారావు ఇద్దరూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియా ఓట్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నందున ఈ ఎన్నికల్లో వారి ఓటు చెల్లదని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పారు. దీంతో వారిద్దరినీ ఓటు వేయకుండా నిలుపుదల చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. సిద్దిపేట మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌గా కడవేర్గు మంజుల, వైస్‌ చైర్మన్‌గా జంగిటి కనకరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ 43 వార్డులు ఉండగా.. టీఆర్‌ఎస్‌ 36 వార్డులను గెలుచుకుంది. ప్రమాణ స్వీకారం అనంతరం వారిని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సన్మానించారు. 


రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌గా బాతుక లావణ్యా దేవేందర్‌యాదవ్‌, వైస్‌చైర్మన్‌గా డోలి రవీందర్‌ ఎన్నికయ్యారు. మొత్తం 12వార్డులకుగాను టీఆర్‌ఎస్‌ ఏడింటిని గెలుచుకుంది. అయినా.. ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, సురభీ వాణీదేవి హాజరయ్యారు. జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా టీఆర్‌ఎ్‌సకు చెందిన దోరేపల్లి లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరి కౌన్సిలర్‌గా ఎన్నికైన పాలాది సారిక వైస్‌చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అచ్చంపేట మునిసిపల్‌ చైర్మన్‌గా నర్సింహగౌడ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌గా శైలజ ఎన్నికయ్యారు. మునిసిపాలిటీలోని 20 వార్డులకుగాను 13 వార్డులను కైవసం చేసుకోవడం ద్వారా రెండు పదవులనూ టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు హాజరయ్యారు. ఇక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో 17 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రమాణ స్వీకారం, పాలకమండళ్ల ఎన్నికల్లో వీరికి వీడియోకాల్‌ ద్వారా పాల్గొనే అవకాశాన్ని ఎస్‌ఈసీ కల్పించింది.

Updated Date - 2021-05-08T08:14:48+05:30 IST