వివేకా హత్య కేసులో..సీబీఐ అదుపులో సునీల్?
ABN , First Publish Date - 2021-08-03T09:02:24+05:30 IST
సీఎం జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్‌కుమార్ యాదవ్‌ను సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
గోవాలో పట్టివేత!
పులివెందులలో డ్రైవర్ దస్తగిరిని విచారించిన అధికారులు
కడప/న్యూఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్‌కుమార్ యాదవ్‌ను సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గోవాలో ఉండగా సోమవారం ఆయన్ను నిర్బంధించినట్లు తెలిసింది. ఈ హత్య కేసు దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు విచారణ జరిపి కరోనా కారణంగా ఆపేసిన సీబీఐ అధికారులు.. రెండో దఫా దర్యాప్తు ప్రారంభించి.. కడప కేంద్ర కారాగారం కేంద్రంగా 57 రోజులుగా విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగా పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. వివేకా వాచ్‌మన్ రంగయ్యను ఇటీవల జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచి వాంగ్మూలం తీసుకోవడం, హత్యలో వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి, సునీల్ పాత్ర ఉందని రంగయ్య స్థానిక మీడియా ముందు వెల్లడించడం తెలిసిందే. అప్పటికే సునీల్‌తో పాటు ఆయన తమ్ముడు కిరణ్‌యాదవ్, తల్లిదండ్రులు సావిత్రి, కృష్ణయ్య యాదవ్‌లను సీబీఐ విచారించింది. అయితే విచారణ పేరుతో సీబీఐ తమను వేధిస్తోందని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సునీల్ హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం పులివెందులలో తమ నివాసానికి తాళం వేసి ఆయన కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సునీల్ కోసం కడప, అనంతపురం జిల్లాల్లో సీబీఐ గాలిస్తోంది. అందులో భాగంగా ఆయన సమీప బంధువొకరిని ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. సునీల్ గోవాలో ఉన్నట్లు తెలియడంతో సీబీఐ బృందం అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇటు పోలీసులు గానీ, అటు సీబీఐ అధికారులు గానీ ధ్రువీకరించడం లేదు. ఇంకోవైపు.. వివేకా డ్రైవర్ దస్తగిరిని సీబీఐ బృందం సోమవారం పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విచారించింది. గంటన్నరకు పైగా ప్రశ్నించినట్లు తెలిసింది. సాయం త్రం మరో బృందం వివేకా ఇంటి పరిసరాల్లో పరిశీలించింది. సమీపంలోని ఆటో మొబైల్ దుకాణాల వరకు కొలతలు తీసుకుని రికార్డు చేసినట్లు తెలుస్తోంది.