భారతీయ ఆధునికతకు ఆలంబన

ABN , First Publish Date - 2022-01-26T06:43:35+05:30 IST

భారత రాజ్యాంగం భారతదేశపు చారిత్రక, సాంస్కృతిక వారసత్వంలోని సానుకూల ధోరణులను స్వీకరిస్తూనే ఆధునికత వైపు దేశాన్ని నడిపించటానికి కావల్సిన దిశానిర్దేశం చేసింది...

భారతీయ ఆధునికతకు ఆలంబన

భారత రాజ్యాంగం భారతదేశపు చారిత్రక, సాంస్కృతిక వారసత్వంలోని సానుకూల ధోరణులను స్వీకరిస్తూనే ఆధునికత వైపు దేశాన్ని నడిపించటానికి కావల్సిన దిశానిర్దేశం చేసింది. ఆధునికతను రెండు ముక్కల్లో చెప్పాలంటే హేతుబద్ధత. శాస్త్రవిజ్ఞానం. భారతీయ ప్రత్యేకతల నేపథ్యంలో ఆధునికత నిర్వచనంలో అదనపు లక్షణాలను కూడా జోడించాల్సి ఉంటుంది. సామూహిక అస్తిత్వం, హక్కుల స్థానంలో వ్యక్తిగత హక్కులు, నిచ్చెనమెట్ల నిర్మాణంతో ఉన్న సామాజిక వ్యవస్థ స్థానంలో పౌరులందరికీ స్వతంత్ర అస్తిత్వాలు అందించటమే కాక ఆయా అస్తిత్వాలకు చట్టబద్ధత కూడా కల్పించటమే ఈ అదనపు లక్షణం. 


భారతీయ సంస్కృతి గురించి ప్రస్తావించగానే హైందవ సంస్కృతిగానూ, పూర్తిగా అభివృద్ధి నిరోధకమైనదిగానూ పరిగణించటం తరచూ జరుగుతుంది. హైందవ సంస్కృతిని సవాలు చేసిన తర్కం, హేతువాదం కూడా భారతీయ సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగాలే. భారతీయ సంప్రదాయం ప్రశ్నతోనే మొదలవుతుంది. ప్రశ్నకు పునాది ఆలోచన. ప్రజలకు పౌరులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, తాత్విక పునాదిని విడమర్చి చెప్పటం ఆధునికతకు సంబంధించిన మరో ముఖ్యమైన లక్షణం. హైందవ సంస్కృతి పేరుతో చలామణి అయిన నాగరికతల్లో పౌరులు, పౌరసత్వం అన్న భావనకు ఆస్కారం లేదు. ఆధునిక భారత రాజ్యాంగం భారతదేశం అంటే ఏమిటో నిర్వచించిన తర్వాత పౌరులు, పౌరసత్వం, భారతీయులు అంటే ఎవరో నిర్వచించి నిర్దేశించటంపై కేంద్రీకరించింది. ఆ తర్వాతనే ప్రభుత్వాలు, శాసనాలు రూపొందే విధానం, ప్రభుత్వ అంగాలు, వాటి మధ్య ఉండాల్సిన పరస్పర సంబంధం వంటి వాటి గురించి వివరించింది. ఈ రకంగా చెప్పుకుంటూపోతే స్వతంత్ర భారతదేశాన్ని సంపూర్ణ ఆధునికత పునాదుల మీద నిర్మించటానికి కావల్సిన విధి విధానాలు, చట్రాన్ని రాజ్యాంగం రూపొందించింది. భారతదేశంలో సామూహిక అస్తిత్వాలు అనేకం ఉన్నాయి. ఇందులో కులం, మతం లౌకికేతర అస్తిత్వాలు. ప్రాంతం, భాష లౌకిక అస్తిత్వాలు. వ్యక్తిగత అస్తిత్వం భాష, ప్రాంతంతో ముడిపడి పురోగమిస్తుంది. కులం, మతం అస్తిత్వాలతో ముడిపడిన వ్యక్తిగత అస్తిత్వం సమాజాన్ని తిరోగమనంలోకి నడిపిస్తుంది. 


నిచ్చెన మెట్ల వ్యవస్థలో వ్యక్తిగత హక్కులకు తావులేదు. ఆధునికతకు తొలి పునాది వ్యక్తిగత హక్కులు. అయితే ఇక్కడ కూడా భారతీయ ప్రత్యేకతలకు రాజ్యాంగం స్థానం కల్పిస్తోంది. యూరోపియన్‌ సమాజం ఆధునికత పట్టాలెక్కి దాదాపు నాలుగు శతాబ్దాలు గడిచిన తర్వాత భారతీయ సమాజం ఆధునికత దిశగా తొలి అడుగులు వేయటం ప్రారంభించింది. ఈ క్రమంలో రాజ్యాంగంలో మనకు కనిపించే మరో సంక్లిష్ట ప్రయత్నం రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్‌ విధానాలను కార్యనిర్వాహక విచక్షణ పరిధి నుంచి తొలగించి రాజ్యాంగబద్ధమైన విధానాలుగా మార్చిన తొలి రాజ్యాంగం బహుశా ప్రపంచంలో భారత రాజ్యాంగమే అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 


ఈ రిజర్వేషన్‌ విధానాలను కొనసాగిస్తూనే ఆధునికతకు పునాదిగా ఉన్న వ్యక్తిగత హక్కులు, వ్యక్తిగత సమానత్వం దిశగా సమాజాన్ని నడిపించటానికి వీలుగా రాజ్యాంగం అనేక జాగ్త్రతలు తీసుకుంది. రిజర్వేషన్లు అమలు చేయటానికి సామూహిక సభ్యత్వం ప్రాతిపదికగా నిర్ధారించినా ఆ రిజర్వేషన్ల అమలు ద్వారా సాధించే లక్ష్యం మాత్రం ఆయా సామూహిక సభ్యత్వాలు, అస్తిత్వాల నుంచి ఆయా వ్యక్తులను, కుటుంబాలను విముక్తి చేయటమే. తద్వారా ఆధునిక సమాజానికి పునాదిగా ఉన్న వ్యక్తిగత హక్కులు, సామర్థ్యాలకు దారి ఏర్పరచడమే. ఈ విధంగా సంపూర్ణ ఆధునికత దిశగా ప్రయాణం సాగించేందుకు కావల్సిన పథనిర్దేశం చేసిన పత్రం భారత రాజ్యాంగం.    


నిచ్చెన మెట్ల వ్యవస్థలో మతాధారిత సూత్రాలు, ప్రమాణాలు, వాటి ఆధారంగా ఏర్పడిన నమ్మకాలే న్యాయవ్యవస్థకు పునాదిగా ఉంటాయి. సాక్ష్యాధారాలపై ఆధారపడ్డ న్యాయవ్యవస్థ ఆధునికతకు మరో ముఖ్యమైన ప్రాతిపదిక. ఆధునిక పూర్వ న్యాయవ్యవస్థలో వ్యక్తి ప్రయోజనాలు, అవకాశాలు, హక్కులు ఆయా వ్యక్తుల అభివృద్ధితో నిమిత్తం లేకుండా సామూహిక అధికారాలు, ప్రయోజనాలకు లోబడి ఉంటుంది. కానీ ఆధునికత వ్యక్తి ప్రయోజనమే సర్వోన్నతమని పరిగణిస్తుంది. అందుకే భారత రాజ్యాంగం ఆధారంగా రూపొందే చట్టాలన్నీ వ్యక్తిగత అభివృద్ధి, ఆకాంక్షలు, పురోగతి, హక్కులు, అధికారాలు అన్నీ వ్యక్తి కేంద్రంగా ఉంటాయి. వ్యక్తుల సమాహారమే, సహజీవనమే సమాజానికి విలక్షణమైన అస్తిత్వాన్ని, గుర్తింపును ఇస్తుంది. ఇటువంటి ఆధునికత భారత నిర్మాణ లక్ష్యానికి భిన్నంగా కేంద్రప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటోంది. చట్టాలు రూపొందిస్తోంది. 


వివాహం పూర్తిగా వ్యక్తిగతం. వయోజనులైన స్త్రీపురుషులకు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను రాజ్యాంగం దఖలు పరుస్తోంది. సాధారణంగా వివాహాది విషయాల్లో ప్రత్యక్ష పాత్ర కలిగిన రెండు కుటుంబాలకు మాత్రమే సంబంధించిన అంశం. కానీ తాజాగా కొన్ని బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు వివాహ చట్టాల్లో తెచ్చిన మార్పులు వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రతిపత్తిని సామూహిక ప్రతిపత్తి, అస్తిత్వం పరిధిలోకి లాక్కెళ్లేవిగా ఉన్నాయి. ప్రత్యేకించి మతాంతర వివాహాలు, కులాంతర వివాహాల విషయంలో వధూవరులు సామాజిక ఆమోదాన్ని పొందాలన్న ముందస్తు షరతు విధించటం తాజాగా ప్రత్యేక వివాహాల చట్టంలో బిజెపి పాలిత రాష్ట్రాలు చేసిన సవరణల సారాంశం. వివాహానికి సంబంధించిన నిర్ణయాన్ని సమాజం, కులం, మతం వంటి సామూహిక వ్యవస్థల ప్రయోజనాలకు లోబడి ఉండాలంటూ ఉత్తరప్రదేశ్‌ హోం శాఖ ముఖ్యకార్యదర్శి అలహాబాద్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయటం దుర్మార్గమే కాదు, దురుద్దేశ్యపూరితం కూడా. వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, హక్కులు సంఘ ప్రయోజనాలు, అధికారాలకు లోబడి ఉండాలని సదరు అఫిడవిట్‌ వక్కాణించటం భారతీయులను వివేకం, విజ్ఞానంతో కూడిన ఆధునిక మానవుడిగా తీర్చిదిద్దాలన్న రాజ్యాంగ లక్ష్యాలను పునాదులతో సహా పెకలించి వేసే ప్రతిపాదన. ప్రజాప్రయోజనాలు అంటే సామాజిక ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు అంటే కుల, మత ప్రయోజనాలు (కులం, మతాల గురించి జరిగే చర్చ తరచూ కమ్యూనిటీ పదం ముసుగులో జరగటం గత మూడు దశాబ్దాల సామాజిక చర్చల్లో వచ్చిన ముఖ్యమైన మార్పు) ప్రయోజనాలని నిర్వచించటం గమనిస్తే భారతీయ జనతాపార్టీ ఈ దేశాన్ని ఏ దశ నుంచి ఏ దశకు, ఏ దిశ నుంచి ఏ దిశకు తీసుకెళ్లేందుకు కంకణం కట్టుకుందో అర్థమవుతుంది. 


భారత రాజ్యాంగం భారతీయులకు కుల, మత, ప్రాంత, ఆస్తిపరమైన వ్యత్యాసాలతో నిమిత్తం లేకుండా కొన్ని హక్కులు అందంచటంతో పాటు బాధ్యతలు కూడా కల్పించింది. ఆర్టికల్‌ 51–ఎ ప్రకారం భారతీయులు ‘‘కుల, మత ప్రాంత అంతరాలతో నిమిత్తం లేకుండా భారతీయులందరి మధ్య సమానత్వం, సహృద్భావం, సౌభ్రాతృత్వం పెంపొందించే విధంగా వ్యవహరించాలి.’’ భారతీయులందరూ నా సహోదరులు అని మనం పాఠశాలలో రోజూ చేసే ప్రతిజ్ఞ ఈ అధికరణ సారాంశమే. మరో అధికరణం శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే లక్షణాన్ని కలిగి ఉండాలని ఆదేశిస్తోంది. కానీ గత ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, రూపొందిస్తున్న చట్టాలు ఈ మౌలిక రాజ్యాంగ ఆదేశాలకు భిన్నంగా ఉంటున్నాయి. భారతదేశాన్ని ఆధునిక భారతదేశంగా, భారతీయులను ఆధునిక పౌరులుగా తీర్చిదిద్దే దిశగా గత ఏడున్నర దశాబ్దాల్లో సాధించిన విజయాలను వమ్ము చేసేవిగా ఉన్నాయి. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా నిజమైన దేశభక్తులందరూ భారతీయ ఆధునికతకు పునాదులు వేసిన రాజ్యాంగపు మౌలిక లక్షణాలను, లక్ష్యాలను కాపాడేందుకు సాగే యజ్ఞంలో భాగస్వాములమవుతామని ప్రతిజ్ఞ చేయటమే.

కొండూరి వీరయ్య

Updated Date - 2022-01-26T06:43:35+05:30 IST