Abn logo
Jan 6 2021 @ 00:49AM

ఎవరా మూడో పేసర్‌?

  • శార్దూల్‌, సైనీ మధ్య పోటీ
  • రేసులో నటరాజన్‌ కూడా..
  • రేపటి నుంచే  సిడ్నీ టెస్టు
  • ఉదయం  5 గం. నుంచి సోనీ సిక్స్‌లో 

సిడ్నీ టెస్టు సమీపిస్తుండడంతో ఇప్పుడందరికీ తుది జట్టుపై అంచనాలు పెరుగుతున్నాయి. పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ గాయంతో దూరం కాగా మూడో పేసర్‌ స్థానం ఖాళీ అయ్యింది. ఈ బెర్త్‌ కోసం అటు  పోటీ కూడా ఎక్కువే ఉంది. ఇప్పటికే షమి స్థానంలో సిరాజ్‌ సత్తా చూపడంతో అతడి స్థానానికి డోకా లేదు. ఇక మిగిలిన పేసర్‌ స్థానం కోసం శార్దూల్‌ ఠాకూర్‌, నవ్‌దీప్‌ సైనీ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అటు యార్కర్ల స్పెషలిస్ట్‌ నటరాజన్‌ను టెస్టు జట్టులో చేర్చడంతో అతడు కూడా అరంగేట్రం కోసం సై అంటున్నాడు.


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

రెండో టెస్టులో అంచనాలకు మించి రాణించిన భారత జట్టు ఇప్పుడు సిరీ్‌సలో ఆధిక్యంపై కన్నేసింది. మెల్‌బోర్న్‌ టెస్టులో జట్టు నాలుగు మార్పులతో బరిలోకి దిగి ఫలితం సాధించింది. ఇక గురువారం నుంచి జరిగే మూడో టెస్టులోనూ కొత్త చేరికలు తథ్యమే. ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమంగా ఉన్న స్థితిలో మరో విజయం ద్వారా ఆసీ్‌సపై ఒత్తిడి పెంచాలనే ఆలోచనలో భారత జట్టు ఉంది. ఈనేపథ్యంలో తుది జట్టు విషయంలో జాగ్రత్తగా ఉండాలనుకుంటోంది. దీన్ని బట్టి వరుసగా విఫలమవుతున్న ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ స్థానం గల్లంతైనట్టే. 2019లో బంగ్లాదేశ్‌పై డబుల్‌ సెంచరీ చేసిన తను ఆ తర్వాత రాణించలేకపోతున్నాడు. ఈ సిరీ్‌సలోనైతే 17, 9, 0, 5 స్కోర్లతో పూర్తిగా నిరాశపరిచాడు. అందుకే శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ ఆరంభించడం లాంఛనమే కానుంది. పుజార స్థానంలో వైస్‌ కెప్టెన్‌గా కూడా తను బాధ్యతలు తీసుకున్నాడు. మంగళవారం జరిగిన నెట్‌ సెషన్‌లో రోహిత్‌ పేస్‌, స్పిన్‌ బంతులను చక్కగా ఎదుర్కొని ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు.పిచ్‌ను బట్టే మూడో పేసర్‌..

ఓపెనర్‌ విషయంలో ఎలాంటి ఆందోళన లేకపోయినా.. ఉమేశ్‌ స్థానంలో ఎవరిని ఆడించాలనేది టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు సమస్యగా మారింది. బుమ్రా, సిరాజ్‌లకు జతగా మూడో పేసర్‌గా ఎవరు న్యాయం చేయగలరని అంచనా వేస్తున్నారు. సూపర్‌ స్వింగ్‌తో పాటు లోయరార్డర్‌లో బ్యాటింగ్‌ కూడా చేయగల నైపుణ్యం శార్దూల్‌కు ఉంది. కానీ కొందరు మాజీ ఆటగాళ్లు మాత్రం ఆసీస్‌ బ్యాటింగ్‌ లైన్‌పను ఛేదించగల సత్తా సైనీ వేగవంతమైన బంతులకు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే మంగళవారం మబ్బులు పట్టిన వాతావరణం ఉండడంతో సిడ్నీ పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. బుధవారం పిచ్‌ పరిస్థితిని అంచనా వేసి మూడో పేసర్‌ విషయంలో టీమ్‌ ఓ అంచనాకు రానుంది. ఒకవేళ వాతావరణం ఇలాగే మబ్బులు పట్టి ఉండి పిచ్‌పై తేమ అధికంగా ఉంటే మాత్రం శార్దూల్‌కు అవకాశం దక్కవచ్చు. అలాకాకుండా పిచ్‌ ఫ్లాట్‌గా ఉంటే మాత్రం సైనీ అరంగేట్రం ఖాయమవుతుంది. ఎందుకంటే.. సైనీ పదునైన పేస్‌తో పాటు పాత బంతితో రివర్స్‌ స్వింగ్‌ రాబట్టగలడు. దీంతో ఆసీ్‌సను ఇబ్బంది పెట్టవచ్చు. శార్దూల్‌ 62 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 54.1 సగటుతో 206 వికెట్లు తీయగా.. సైనీ 46 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 59.9 సగటుతో 128 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు సిడ్నీ టెస్టులో తొలి రెండు రోజులు ఆకాశం మేఽఘావృతంగా ఉండే అవకాశం ఉంది.  
నట్టూపైనా దృష్టి..: మూడో పేసర్‌ చర్చలో శార్దూల్‌, సైనీ కాకుండా నటరాజన్‌ పేరు కూడా వినిపిస్తోంది. గత నాలుగు నెలలుగా అద్వితీయ ప్రదర్శన కనబరుస్తూ అతడు ఇప్పటికే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అలాగే టెస్టు జెర్సీ ధరించిన ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ కొత్త సవాల్‌కు సిద్ధమని ప్రకటించాడు. అతడి ఖాతాలో 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లుండగా 64 వికెట్లు తీశాడు. గతేడాది జనవరిలో రైల్వే్‌సతో చివరి రంజీ మ్యాచ్‌ ఆడిన నటరాజన్‌ 11 ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు.

Advertisement
Advertisement
Advertisement