‘స్వామి’ భక్తి జగన్‌పైనే!

ABN , First Publish Date - 2021-10-01T07:46:39+05:30 IST

ఇది 2019నాటి మాట! ‘టీటీడీ పంచాంగం’ కోసం వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేస్తే... అన్యమత పదం ప్రత్యక్షమైంది.‘తప్పు జరిగింది! అది కూడా ఎవరో చేశారు.

‘స్వామి’ భక్తి జగన్‌పైనే!

  • సీఎం కోరినందుకే ‘ఆంధ్రజ్యోతి’పై కేసు.. 
  • స్వయంగా వెల్లడించిన సుబ్రమణ్యస్వామి
  • ‘కాపాడండి’ అని సీఎం జగన్‌ కోరారు
  • ‘ఆంధ్రజ్యోతి’ని కంట్రోల్‌ చేయగలమా అని అడిగారు
  • యూట్యూబ్‌ చానల్‌ల్లో వెల్లడించిన స్వామి


బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి వెంకన్న భక్తుడా? లేక... జగనన్న భక్తుడా? ఆయన వెంకన్న కోసం కోర్టు మెట్లు ఎక్కారా? లేక... జగన్‌ కోరిక మేరకు ‘ఎంటర్‌’ అయ్యారా? ఆయన రంగంలోకి దిగింది  టీటీడీ ప్రతిష్ఠను కాపాడేందుకా... లేక జగన్‌ను ‘సేవ్‌’ చేసేందుకా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు! వీటన్నింటికీ సింపుల్‌గా సుబ్రమణ్య స్వామే సమాధానం ఇచ్చారు. జగన్‌ అడిగినందుకే... ‘ఆంధ్రజ్యోతి’పై కేసు వేశానని ఆయనే చెప్పారు. అసలు విషయంలోకి వెళితే...


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఇది 2019నాటి మాట! ‘టీటీడీ పంచాంగం’ కోసం వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేస్తే... అన్యమత పదం ప్రత్యక్షమైంది.‘తప్పు జరిగింది! అది కూడా ఎవరో చేశారు. సరిదిద్ది... తగిన చర్యలు తీసుకోండి’ అని ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది!అందుకు కారణం ఎవరు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే సంగతి పక్కనపెట్టి... తప్పును వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’పైనే టీటీడీ కేసు పెట్టింది! రూ.వంద కోట్లకు పరువు నష్టం దావా కూడా వేసింది. 


కానీ... ఈ విషయంతో ఏమాత్రం సంబంధం లేని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఉన్నట్టుండి రంగంలోకి దిగారు. ‘‘నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నా తల్లి స్వామి వారిని ప్రార్థించడంవల్లే నేను పుట్టాను. ఆ భక్తిభావంతోనే టీటీడీకి మద్దతుగా ‘ఆంధ్రజ్యోతి’పై కేసు వేస్తున్నాను’’ అంటూ తిరుపతిలో మీడియాతో చెప్పారు. స్పెషల్‌ ఫ్లైటు వేసుకొచ్చి మరీ  తిరుపతికొచ్చిన ఈ వెంకన్న వీర భక్తుడు... కొండెక్కి ఆ శ్రీవారిని దర్శించుకోకపోవడం వేరే సంగతి! ఆ తర్వాత... టీటీడీ పెట్టిన కేసులో పోలీసులు వేగంగా విచారణ జరపడంలేదంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ‘మేం మా పని పూర్తి చేశాం. చార్జిషీటు కూడా దాఖలు చేసేశాం’ అని పోలీసులు చెప్పడంతో, బుధవారమే ఆ పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. దీనికి కూడా స్వామి వక్రభాష్యం చెబుతూ... సంబంధంలేని అంశాన్ని ప్రస్తావించి ‘ఇది నా విజయం’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఆయన ‘పి.గూరూస్‌’ అనే యూట్యూబ్‌ చానల్‌కు ఇదే అంశంపై ఇంటర్వ్యూ ఇచ్చారు. 36 నిమిషాల నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూలో 18 నిమిషాలకుపైగా ‘ఆంధ్రజ్యోతి’ గురించే మాట్లాడారు. ఇదే క్రమంలో ‘అసలు విషయం’ బయటపెట్టేశారు. 


 ‘‘జగన్‌ రెడ్డికి నేను తెలుసు. ఆయన తండ్రికి కూడా బాగా తెలుసు. దయచేసి మమ్మల్ని కాపాడండి... అని జగన్‌ ఒక మెసేజ్‌ పంపించారు. కచ్చితంగా ఇవే పదాలు కాదు కానీ, మనం కంట్రోల్‌ చేయగలమా? మీరేమైనా చేయగలరా? అని అడిగారు’’ అని స్వయంగా సుబ్రమణ్య స్వామే ఆ యూట్యూబ్‌ చానల్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే... ఆయన అంతకుముందు తిరుపతిలో చెప్పినట్లుగా, వెంకన్న భక్తుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదన్న మాట! ‘సేవ్‌ చేయగలరా! ఆంధ్రజ్యోతిని కంట్రోల్‌ చేయగలమా!’ అని జగన్‌ అడిగిన మీదటే రంగంలోకి దిగారన్న మాట! మరోవైపు... టీటీడీ వేసిన కేసులోనే తాను ఇంప్లీడ్‌ అవుతున్నానని, దేవస్థానం నుంచి ఒక్కపైసా కూడా తీసుకోబోనని స్వామి అంతకుముందు చెప్పారు. కానీ... బుధవారంనాటి ఇంటర్వ్యూలో మాత్రం ‘లాభాల’ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘ఈ కేసు నేను గెలిచినట్లే’ అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు. ‘‘టీటీడీ కేసులో ఆంధ్రజ్యోతి వందకోట్ల రూపాయలను చెల్లించగలదో లేదో నేను చెప్పలేను. ఒకవేళ ఆంధ్రజ్యోతిని టీటీడీకి ఇచ్చేస్తారేమో!’’ అని కూడా వ్యాఖ్యానించారు. కాసేపటి తర్వాత... ‘ఆంధ్రజ్యోతి’పై కేసు గెలిస్తే వచ్చే 100 కోట్లలో సదరు యూట్యూబ్‌ చానల్‌ నిర్వహణకు కొంత మొత్తం ఇస్తానని నవ్వుతూ చెప్పారు. తిరుపతి కోర్టులో విచారణ ఇంకా మొదలుకాకముందే, సుబ్రమణ్యస్వామి సొంతంగా తీర్పు చెప్పేసి, వాటాలు కూడా పంచేయడం విశేషం. ఒకవేళ టీటీడీ కేసు గెలిస్తే... సుబ్రమణ్యస్వామికి వంద కోట్లు ఎలా వస్తాయి? ఏ రూపంలో వస్తాయి? ఆ సంగతి మాత్రం చెప్పలేదు. అయితే... ‘పైసా కూడా తీసుకోను’ అని అంతకుముందు తిరుపతిలో చెప్పిన మాటలకు ఇది పూర్తి భిన్నం కావడం విశేషం.


ప్రయాణ ఖర్చులు ఎవరివో?

ఈ కేసులో తాను ప్రయాణ ఖర్చులను కూడా తీసుకోబోనని సుబ్రమణ్య స్వామి మీడియాతో చెప్పారు. ఇక్కడే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అందరికీ తెలిసి... స్వామికి పెద్ద పెద్ద వ్యాపారాలేవీ లేవు. ఒక సాధారణ ఎంపీ. కానీ... ‘ఆంధ్రజ్యోతి’పై కేసు వేసేందుకు నేరుగా ఢిల్లీ నుంచి తిరుపతికి స్పెషల్‌ ఫ్లైటులో వచ్చారు. ఆ ఖర్చు ఆయనే భరించారా? టీటీడీ భరించిందా? ఇంకెవరైనా భరించారా? తెలియదు. ఇది ఒకటో సారి! ఇక రెండోసారి... సుబ్రమణ్యస్వామి ఢిల్లీ నుంచి తాడేపల్లికి వచ్చారు. తొలుత టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో, ఆ తర్వాత సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఈ స్పెషల్‌ ఫ్లైట్‌కు ఖర్చులు  ఎవరు భరించారో, ఎందుకు భరించారో కూడా తెలియదు! 


స్వామికి చురకలు

ఈ యూట్యూబ్‌ చానల్‌ ఇంటర్వ్యూ కామెంట్స్‌ సెక్షన్‌లో చాలామంది వీక్షకులు సుబ్రమణ్య స్వామికి చురకలు అంటించారు. ‘‘ఆంధ్రజ్యోతిని దెబ్బకొట్టాలని చాలా మంది ప్రయత్నించారు. ఇప్పుడు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి’’ అని వీక్షకుడు కామెంట్‌ చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల కూల్చివేత, హిందూమతాన్ని నాశనం చేయడం, క్రిస్టియానిటీని పెంచేయడం వంటి విషయాలు హిందూ భక్తుడైన స్వామికి తెలియవా? దాన్నెందుకు ప్రశ్నించడం లేదు’’ అని చాలామంది నిలదీశారు. ‘‘మరోసారి స్వామి రాజ్యసభకు వెళ్లడం ఖాయం! అయితే, ఈసారి బీజేపీ నుంచి కాదు. వైసీపీ తరఫు నుంచి’’ అని ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో గుట్టు ఉందని ఒక మహిళ వ్యాఖ్యానించారు!

Updated Date - 2021-10-01T07:46:39+05:30 IST