బీజేపీలో చేరిన స్వామిగౌడ్.. ఇంటికి చేరినట్లుందని వ్యాఖ్య

ABN , First Publish Date - 2020-11-26T00:33:02+05:30 IST

టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌ కమలం గూటికి

బీజేపీలో చేరిన స్వామిగౌడ్.. ఇంటికి చేరినట్లుందని వ్యాఖ్య

ఢిల్లీ: టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌ కమలం గూటికి చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో స్వామిగౌడ్ బీజేపీలో చేరారు. స్వామిగౌడ్‌కు జేపీ నడ్డా కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పాల్గొన్నారు.


మాతృసంస్థకు వచ్చినట్లుంది: స్వామిగౌడ్

‘బీజేపీలో చేరడం తిరిగి నా మాతృసంస్థకు వచ్చినట్లు ఉంది. నా ఇంటికి తిరిగి చేరానని భావిస్తున్నాను. ఎలాంటి పదవులు ఆశించి బీజేపీలో చేరలేదు. తెలంగాణ కోసం ఒక్క నాడు కూడా పోరాడని వారికి టీఆర్ఎస్‌లో పదవులు ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టారు. తండ్రిలాంటి కేసీఆర్ ఈ విషయంలో ఎందుకు అలసత్వం వహించారో అర్థం కాలేదు. ఉద్యమకారులు కనీస మర్యాదలకు నోచుకోలేరా? ఉద్యమకారులను ఎండన నిలబెట్టి.. పోరాడని వారికి మాత్రం గొడుగు పట్టారు’ అని ఆరోపించారు.


రెండేళ్ల నుంచి కేసీఆర్ అపాయింట్‌మెంటే దొరకలేదు..

‘కేసీఆర్ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నా. రెండేళ్ల నుంచి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించా. నాకు ఇంతవరకు అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఆత్మగౌరవం కోసమే టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరాను. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం పార్టీ మార్పు. చాలా మంది ఉద్యమకారులకు టీఆర్ఎస్‌లో ఆత్మగౌరవం లభించడం లేదు. జీహెచ్ఎంసీ పీఠాన్ని బీజేపీ సొంతం చేసుకుంటుంది. ఐదేళ్లలో ఉన్న పరిపాలన వేరు. ఇప్పుడున్న పాలన వేరు’ అని స్వామిగౌడ్ చెప్పుకొచ్చారు.



Updated Date - 2020-11-26T00:33:02+05:30 IST