తాడిపత్రిలో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-03-15T21:23:43+05:30 IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేతల బెదిరింపుల పర్వం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థులను

తాడిపత్రిలో వైసీపీ నేతల దౌర్జన్యం

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేతల బెదిరింపుల పర్వం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థులను వారి కుటుంబసభ్యులను ఫ్యాన్ పార్టీ నేతలు బెదిరించారు. 21,23,25 వార్డుల్లో గెలిచిన టాటా మోటర్స్ షోరూం నిర్వాహకులు కౌన్సిలర్లుగా గెలిచారు. గెలిచిన కౌన్సిలర్లు తమ పార్టీకు మద్దతు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. అంతేకాదు అధికార బలంతో టాటా మోటర్స్ షోరూం మూయించారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి టీడీపీ ఇన్‌ఛార్జ్ జేసీ అస్మిత్‌రెడ్డి బాధితులను పరామర్శించారు. షోరూం నిర్వాహకులకు అండగా అక్కడే బైఠాయించారు.  షోరూంను తెరువకుండా అడ్డుకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మోజార్టీ రావడంతో వైసీపీ నేతలు దౌర్జాన్యానికి దిగుతున్నారని అస్మిత్‌రెడ్డి మండిపడ్డారు. 


తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పీఠంపై వైసీపీ కన్నుపడింది. మున్సిపల్ చైర్మన్‌ పదవి కోసం అధికార పార్టీ నేతలు ఎత్తులు వేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి 19 ఓట్లు అవసరం ఉంది. ఇండిపెండెంట్‌తో కలిపి టీడీపీ క్యాంపులో 20 మంది కౌన్సిలర్లున్నారు. అయితే వైసీపీ క్యాంపులో 16 మంది కౌన్సిలర్లున్నారు. దీంతో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. వైసీపీకి ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నారు. ఇక టీడీపీ ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఉన్నారు. దీపక్ రెడ్డి ఎక్స్అఫీషియో ఓటుపై మున్సిపల్ కమిషనర్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో తాడిపత్రి రాజకీయం రసవత్తరంగా మారింది.


తాడిపత్రిలో 36 వార్డులుండగా రెండు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా 18 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ మిత్రపక్షం సీపీఐ ఒక వార్డును గెలుచుకుంది. స్వతంత్రులు ఒక వార్డులో విజయం సాధించారు. మిగిలిన 14 వార్డులు వైసీపీకి దక్కాయి. దీంతో మెజార్టీ వార్డులు టీడీపీ, ఆ పార్టీ మిత్రపక్షానికి దక్కడంతో తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి పోటీ చేసిన 24వ వార్డులో ఆయన గెలుపొందారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్న ఏకైక మున్సి పాలిటీ తాడిపత్రి కావడం గమనార్హం.

Updated Date - 2021-03-15T21:23:43+05:30 IST