ఆన్‌లైన్‌ క్లాసులూ పెట్టండి

ABN , First Publish Date - 2022-02-04T08:07:20+05:30 IST

ఆన్‌లైన్‌ క్లాసులూ పెట్టండి

ఆన్‌లైన్‌ క్లాసులూ పెట్టండి

మేడారం సహా అన్ని మతసంబంధ వేడుకల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడండి

రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

 రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయి: డీహెచ్‌


హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నేపథ్యంలో.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులతోపాటు, అవసరమైన విద్యార్థులకు ఈ నెలాఖరు దాకా ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యం కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. మేడారం సమ్మక్క-సారక్క జాతర సహా అన్ని మతసంబంధమైన కార్యక్రమాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించాలని ఆదేశాల్లో పేర్కొన్నది. నిబంధనలు పాటించని వారిపై ఏమి చర్యలు తీసుకున్నారనే వివరాలు నివేదికలో సమర్పించాలని స్పష్టంచేసింది. కొవిడ్‌ కారణంగా చనిపోయిన వారికి రూ.50 వేల పరిహారం వేగంగా అందజేయాలని ఉత్తర్వులు జారీచేసింది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వైద్యసదుపాయాలు, చికిత్స, వ్యాక్సినేషన్‌, పడకల వంటి అంశాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎల్‌.రవిచందర్‌, కౌటూరు పవన్‌ కుమార్‌, మయూర్‌ రెడ్డి, చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. జ్వర సర్వే.. కిట్ల పంపిణీ.. ఓపీ సేవలు వంటి లెక్కలను బట్టి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తున్నదని..  ఈ నేపథ్యంలో ఈ నెల 1 నుంచి పాఠశాలలు తెరవడం ప్రమాదకరమని సీనియర్‌ న్యాయవాది ఎల్‌ రవిచందర్‌ పేర్కొన్నారు. పాఠశాలకు ప్రత్యక్షంగా వెళ్లలేని విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఉండాలని.. గతంలో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసిందని గుర్తుచేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. హైదరాబాద్‌ వంటి నగరాల్లో అయితే ఆన్‌లైన్‌ క్లాస్‌లు పెట్టవచ్చని.. ఎటువంటి సదుపాయాలు, కూర్చోవడానికి కుర్చీలు కూడాలేని మారుమూల గ్రామాల్లోని విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. భౌతిక తరగతులు కొనసాగిస్తూనే అవసరమైన విద్యార్థులకు ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌ తరగతులు సైతం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. వారపు సంతలపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవట్లేదని మరో న్యాయవాది మయూర్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  దీనికి ధర్మాసనం.. మార్కెట్ల కంటే వైన్స్‌ వద్దే జనం ఎక్కువ ఉంటున్నారని.. పేద వారిని టార్గెట్‌ చేయొద్దని వ్యాఖ్యానించింది. మార్కెట్లలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) గడల శ్రీనివాసరావు హైకోర్టు ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. కొవిడ్‌ కట్టడికి సర్కారు అన్ని చర్యలూ తీసుకుంటోందని.. రాష్ట్రంలోని 99 లక్షల ఇళ్లలో జ్వర సర్వే పూర్తి చేశామని డీహెచ్‌ తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని.. పాజిటివిటీ రేటు కేవలం 3.4గానే ఉందని పేర్కొన్నారు. జ్వర సర్వే సందర్భంగా 4.32 లక్షల కిట్లు అందజేశామని వెల్లడించారు. అయితే, వాటన్నిటినీ కొవిడ్‌ జ్వరాలుగా భావించరాదని.. సాధారణంగా సీజన్‌లో ఉండేవే ఎక్కువని పేర్కొన్నారు. అన్ని వర్గాల వాదనలూ నమోదు చేసుకున్న ధర్మాసనం..  మేడారం సహా అన్ని మత సంబంధ కార్యక్రమాల్లో కొవిడ్‌ రూల్స్‌ పాటించాలని స్పష్టంచేసింది. అన్ని వివరాలతో నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను 28కి వాయిదా వేసింది. 

Updated Date - 2022-02-04T08:07:20+05:30 IST