పరిష్కార మార్గం... మనం ఇంటిలో ఉండడమే

ABN , First Publish Date - 2020-03-29T05:48:40+05:30 IST

నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే తారలు కరోనా ఎఫెక్ట్‌తో ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ తీరిక సమయాన్ని తమకు నచ్చిన పనులు చేసేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాదు కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవలసిన...

పరిష్కార మార్గం... మనం ఇంటిలో ఉండడమే

నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే తారలు కరోనా ఎఫెక్ట్‌తో ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ తీరిక సమయాన్ని తమకు  నచ్చిన పనులు చేసేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాదు కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సోషల్‌ మీడియా వేదికగా చైతన్యం తీసుకువస్తున్నారు. టాలీవుడ్‌ సెలబ్రిటీ తమన్నా ‘నవ్య’ తో చెప్పిన కబుర్లు 


హాయ్‌ తమన్నా! ఇంటిలో ఏం చేస్తున్నారు? 

ఎక్కువ విశ్రాంతి తీసుకుంటున్నాను కదా! అందుకని, ఇప్పుడు నా ముఖం కాంతిమంతమైంది. విశ్రాంతికి మించిన మరో ప్రత్యామ్నాయం లేదు. మనకు మనం సమయం కేటాయించుకోవడానికి అత్యుత్తమ సమయమిది. దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదు.


సామాజిక దూరం పాటిస్తున్న ఈ సమయంలో ఏం చేస్తే బావుంటుంది?

 ఎవరో ఏదో చేస్తున్నారని మీరూ అటువంటిది చేయడానికి ప్రయత్నించవద్దు. మీకు ఏది సంతోషం కలిగిస్తుందని అనుకుంటున్నారో అదే చేయండి. మీరు ఎంజాయ్‌ చేసే పనులు చేయండి. ఇటువంటి సమయం మళ్లీ మనకు రాదేమో!? మనమంతా ఇళ్లలో ఉన్నాం. ‘తర్వాత చేద్దాం’ అని చాలా పనులను వాయిదా వేస్తాం. తర్వాత అనేది మళ్లీ రాదు. అందుకని, మీకోసం మీరే సమయాన్ని కేటాయించుకోండి. చాలామందిపై ఆర్థికపరమైన ఒత్తిడి ఉంది. సమాజంలోని అన్ని వర్గాలపై ప్రభావం చూపుతోంది. నేను వార్తలు చూస్తున్నా. చదువుతున్నా. రోజువారీ జీతానికి పని చేసే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్లను ఆదుకోవడానికి ప్రభుత్వాలు, మంచి మనుషులు ముందుకు రావడం సంతోషం. కరెంట్‌, ఆహారం, ఆరోగ్యంతో మా ఇంటిలో నేను ఉండగలిగే సౌకర్యం ఉన్నందుకు కృతజ్ఞురాల్ని. నాతో నేను ఎక్కువ సమయం గడుపుతున్నా. ఈ అనుభవాన్ని డబ్బుతో వెల కట్టలేం!


‘తర్వాత చేద్దాం’ అని మీరు వాయిదా వేసిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తున్నారా?

(నవ్వుతూ...) నిజమే. వాయిదా వేసిన పనులన్నీ చేస్తున్నా. చెబితే వింతగా ఉంటుందేమో... ‘హ్యారీ పోటర్‌’ ఫస్ట్‌ ఫిల్మ్‌ నుండి లాస్ట్‌ ఫిల్మ్‌ వరకూ సీక్వెన్స్‌లో చూడాలని నాకు ఎప్పట్నుంచో ఓ కోరిక. అయితే... జీవితంలో అదొక ప్రయారిటీ కాదు. పనుల వల్ల దాన్ని వాయిదా వేశా. ఇప్పుడు టైమ్‌ దొరకడంతో ‘హ్యారీ పోటర్‌’ సిరీస్‌లో సినిమాలు అన్నిటినీ వరుసపెట్టి చూడాలనుకుంటున్నా. ఇటీవల కప్‌బోర్డు క్లీన్‌ చేశా. చాలారోజులుగా నేను వెతుకుతున్న రెండు లిప్‌ స్టిక్స్‌ కనిపించాయి. ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా? చిన్న చిన్న విషయాలు మనకెంతో సంతోషం కలిగిస్తాయి.


ఈ టైమ్‌లో మీతో లేదా మీరు ఎక్కువగా టచ్‌లో ఉన్న హీరోయిన్లు...

శ్రుతీ హాసన్‌ నాకు చాలా క్లోజ్‌. మేం ఫోనులో మాట్లాడుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామనేది డిస్కస్‌ చేసుకున్నాం. కొన్నిసార్లు ఇటువంటి సందర్భాలు మనమూ మనుషులమే అనే సంగతి గుర్తుచేస్తాయి. వృత్తితో సంబంధం లేదు. సాధించిన ఘనతతో పని లేదు. పెద్ద-చిన్న తేడాల్లేవ్‌. మనుషుల్లో ఎటువంటి వ్యత్యాసాలు లేవు. అందరూ ఒక్కటే. అందరూ ఒకే పరిస్థితిలో ఉన్నారు.


లాక్‌డౌన్‌లోనూ కొన్ని ప్రాంతాలలో ప్రజలు గుంపులుగా ఉంటున్నారు. వాళ్లలో అవగాహన తీసుకురావడం కోసం ఏం చేస్తే బావుంటుంది?

దేశంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను... మా బిల్డింగులో వాచ్‌మ్యాన్‌ ఉంటారు. కరోనా వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందనేది అతనికి తెలియదు. చికెన్‌, మాంసం వల్ల వస్తుందని అవి తినడం మానేశానని చెప్పారు. కరోనా ఎలా వస్తుందో అతనికి వివరించి చెప్పాను. సామాజిక దూరం పాటించాలని స్పష్టంగా చెప్పా. ప్రజలు గుంపుగా మూగితే వచ్చే అనర్థాలను వివరించా. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ముఖానికి మాస్క్‌ ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని... ఎవరైనా తెలియనివారు ఉంటే, వాళ్లకు అవగాహన కల్పించడం ముఖ్యం. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేయడం ముఖ్యం.


ప్రజల్లో చాలామంది ఆందోళన నిండిన వాతావరణంలో ఉన్నారు. పాజిటివ్‌గా ఉండడానికి మీరిచ్చే సలహా?

ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో మృత్యుభయం కలగడం సహజమే. నాకు దగ్గరైన వ్యక్తుల్లో చాలామంది ఆందోళన చెందుతున్నారు. దీనికి పరిష్కార మార్గం వెతకడం చాలా సులువు. అదేంటంటే... మనం ఇంటిలో ఉండడమే! స్టే ఎట్‌ హోమ్‌! చాలామందికి ఇంటిలో ఉండటం అంత సులువు కాదేమో! ఎందుకంటే... బయట ఎక్కువ సమయం గడపడానికి అలవాటు పడ్డారు. నాతో సహా! నేనూ ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉంటాను. అయితే... నేను ఇంటి పక్షినే. ఇంటిలో ఉండటానికి నాకు ఎలాంటి బాధా లేదు. కానీ, కొందరు ఎంత బాధ పడతారో నాకు తెలుసు. ‘అరే... రేపటి నుండి బయటకు వెళ్లకూడదట. బుర్ర పాడైపోతుంది’ అనేవాళ్లూ ఉన్నారు. అయితే... ఈ టైమ్‌లో ఇంట్లోనే మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు. సినిమాలు చూసుకోవచ్చు.


ఈమధ్య ఇంట్లో వంట చేసినట్టున్నారు!

(నవ్వుతూ...) నిజంగా నేను వంట చేస్తా. కానీ, రెగ్యులర్‌గా వండడం కుదరదు. అప్పుడప్పుడూ కిచెన్‌లో వెళ్లి గరిటె తిప్పుతా. స్నేహితులను ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చేటప్పుడు నేనే వంట చేస్తా. ఎందుకంటే... నేను ఫుడ్డీ. ఐ లవ్‌ ఫుడ్‌. వీలైనంతవరకూ హెల్దీ ఫుడ్‌ వండుతా. నిజాయతీగా చెప్పాలంటే... చెత్త ఫుడ్‌ చాలా తిన్నాను. పిజ్జాలు, బజ్జీలు వంటివన్నీ తిన్నా. ఇప్పుడు బ్యాలెన్స్‌ చేయాలి కదా! కొన్నిసార్లు బయటకు వెళ్లినప్పుడు నచ్చిన ఫుడ్‌ తినేస్తాం. అయితే... తర్వాత కొన్ని రోజులు డైట్‌ బ్యాలెన్స్‌ చేయాలి. అదే ఆరోగ్యానికి మంచిది.


ప్రేక్షకులకు ఏవైనా సినిమాలు రికమండ్‌ చేస్తారా? ఈ ఖాళీ సమయాల్లో చూడటానికి...

నెట్‌ఫ్లిక్స్‌లో ‘జమ్‌తారా’, ‘షీ’ వెబ్‌ సిరీస్‌లు, ‘గిల్టీ’ ఫిల్మ్‌ చూశా. ఈమధ్య నేను ఎక్కువ వెబ్‌ సిరీస్‌లు చూస్తున్నా. ‘ఎక్స్‌ప్లెయిన్డ్‌’ టీవీ సిరీస్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అందులో చాలా విషయాలు చర్చించారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారి సమస్యతో సహా! అమెజాన్‌లో ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ కూడా నచ్చింది.


యాక్టింగ్‌ విషయానికి వస్తే... మీ ‘నవంబర్‌ స్టోరీ’ ఎంతవరకూ వచ్చింది?

అదొక తమిళ వెబ్‌ సిరీస్‌. నేను నటిస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ కూడా అదే! మనకు ఈ పరిస్థితి (కరోనా, లాక్‌డౌన్‌) రావడానికి ముందు ఆ సిరీస్‌ షూటింగ్‌ చేశా.


లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌... చిత్రసీమలో పదిహేనేళ్లు పూర్తి చేసుకున్నారు. కంగ్రాట్స్‌! ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది?

థ్యాంక్యూ! ఈ పదిహేనేళ్లూ చాలా త్వరగా పూర్తయ్యాయని అనిపిస్తోంది.  చిన్న వయసులో యాక్టింగ్‌ స్టార్ట్‌ చేశా. నటిగా మళ్లీ మళ్లీ నన్ను నేను కొత్త ఆవిష్కరించుకోవాలి. ఎన్ని చిత్రాలు చేసినా... ప్రతిసారీ కొత్త చిత్రం ఎంచుకునేప్పుడు జాగ్రత్త వహించాలి. సినిమాల్లో నటించేటప్పుడు కొత్త స్ర్కిప్ట్స్‌ చదివే టైం ఉండదు. రోజులన్నీ బిజీ బిజీగా గడుస్తాయి. ఇప్పుడు ఫ్రీ టైమ్‌ దొరకడంతో స్ర్కిప్ట్స్‌ చదువుతున్నా.


కుటుంబమే ఫస్ట్‌... మిగతావన్నీ నెక్ట్స్‌! 

నాకు ఎప్పుడూ కుటుంబమే ఫస్ట్‌. ఆ తర్వాతే మిగతావన్నీ. ఈ రోజు నేను ఎంతో ప్రేమతో నా పని (నటన) చేయగలుగుతున్నానంటే... అందుకు కారణం నా కుటుంబమే. ఓ రకంగా ఇప్పుడీ సమయం రియాలిటీ చెక్‌ లాంటిది! మనమంతా ఇంటి పట్టున ఉంటున్నాం. కుటుంబంతో కలిసి కూర్చుంటున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. నాలాంటి వాళ్లకు కుటుంబంతో సమయం గడపటానికి కుదరదు కదా! నాకు బాగా గుర్తు... చిన్నప్పుడు అమ్మనాన్నల మధ్యన నిద్రించేదాన్ని. మళ్లీ ఇప్పుడు అలా చేస్తున్నా. మొన్న ఒక రోజు ‘బెడ్‌ బహుత్‌ ఛోటా హై’ అన్నాను (నవ్వులు).


నా మాతృభాష కంటే... తెలుగు బాగా మాట్లాడతా!

నా మాతృభాష సింధీ. నాకు అంత స్పష్టంగా రాదు. సింధీ కంటే తెలుగు బాగా మాట్లాడతాను. తమిళం కూడా వచ్చు. ఇప్పుడు సింధీ బాగా నేర్చుకోవాలనుకుంటున్నా. నాకు రాకపోతే నా తర్వాత తరాలకు నేర్పలేను కదా! మా ఇంటిలో మేం సింధీలో మాట్లాడుకోం. ఇప్పుడు మాత్రం సింధీలోనే మాట్లాడాలని అమ్మను ఒత్తిడి చేస్తున్నా. ‘అమ్మా! నాతో నువ్వు సింధీలోనే మాట్లాడాలి. నేను సింధీ నేర్చుకోవడానికి ఇంకో మార్గం లేదు’ అని గట్టిగా చెప్పా. ప్రతిదీ చెప్పడం సులభమే. చేయడమే కష్టం.

Updated Date - 2020-03-29T05:48:40+05:30 IST