Advertisement
Advertisement
Abn logo
Advertisement

లక్షిత లాక్‌డౌన్‌లే శ్రేయస్కరం

కొవిడ్ ఒక మహా విపత్తు; దాని నివారణకు లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక సంక్షోభం, విధించకపోతే మృత్యుతాండవం! ఈ రెండు సంభావ్య ఆపదల మధ్య మన విధాన నిర్ణేతలూ, మనమూ ఎటూ పాలుపోక కొట్టు మిట్డాడుతున్నాం. లాక్‌డౌన్ విధించకపోవడం వల్ల ప్రజల మరణాల సంఖ్య పెరిగిపోతుందని, పర్యవసానంగా ఆర్థికాభివృద్ధి మందగతిలో పడుతుందని ‘ఫ్రాంక్ ఫర్ట్ స్కూల్ ఆఫ్ పైనాన్స్’ అధ్యయనపత్రం ఒకటి వివరించింది. లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోతాయి; కొంతకాలం తరువాత ఆర్థికం మెరుగుపడినప్పటికీ ఆర్థికాభివృద్ధి అడుగంటిపోతుంది. అమెరికాలో మూడు రాష్ట్రాల- అరిజోనా, టెక్సాస్, ఉటాష్-లో లాక్‌డౌన్ విధించలేదు. కొవిడ్ మహమ్మారి ఒక ‘మహోద్యమంలా పాకింది’; అమెరికాలోని ఇతర రాష్ట్రాలలో కంటే ప్రస్తావిత మూడు రాష్ట్రాలలోనే ఆర్థికవ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే లాక్‌డౌన్ విధించకపోయినా ఆర్థిక జీవనం సరిగా లేదు. స్కాండినేవియన్ దేశాలు స్వీడన్, డెన్మార్క్‌ల అనుభవాలను కూడా చూద్దాం. స్వీడన్‌లో లాక్‌డౌన్ విధించలేదు ప్రతి ఒక్కరూ ఐచ్ఛికంగా మాస్క్ ధరించడాన్ని, సామాజిక దూరాన్ని పాటించడాన్ని ప్రోత్సహించారు. డెన్మార్క్‌లో లాక్‌డౌన్ విధించారు. స్వీడన్‌లో మరణాల సంఖ్య డెన్మార్క్‌లో కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి లాక్‌డౌన్ విధించడం తప్పనిసరి అనే వాస్తవాన్ని స్కాండినేవియన్ దేశాల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.


బ్రిటన్‌లో లాక్‌డౌన్ విధించడంలో సంభవించిన జాప్యం మరణాల సంఖ్య అధికంగా ఉండడానికి దారితీయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను ప్రతి కూలంగా ప్రభావితం చేసిందని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, వైలే క్లినికల్ ప్రాక్టీస్ పరిశోధనా పత్రాలు వెల్లడించాయి. కొవిడ్ నియంత్రణకు లాక్‌డౌన్‌ను విధిగా విధించి తీరాలని ఈ అధ్యయనాలు అన్నీ సూచిస్తున్నాయి. లాక్‌డౌన్ విధించకపోవడం వల్ల ఆర్థిక కార్యకలాపాలను తక్షణమే నిలిచిపోవు. తద్వారా ఆర్థికవ్యవస్థ పురోగతికి దోహదం జరుగుతుంది. అయితే లాక్‌డౌన్ విధించకపోవడం వల్ల పెచ్చరిల్లే పోయే మరణాల రేటు ఆర్థిక వ్యవస్థను శీఘ్రగతిన ప్రభావితం చేస్తుంది. లాక్‌డౌన్‌ను ఏ కార్యకలాపాలపై విధించాలో, ఏ కార్యకలాపాలపై విధించకూడదో నిర్ణయించుకోవడం కూడా చాలా ముఖ్యం, తప్పనిసరి కూడా. వివిధ ప్రాజెక్టుల వ్యయాలు, ప్రయోజనాలను ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తారు. రకరకాల కార్యకలాపాలను లాక్‌డౌన్ చేయడంలో వ్యయాలు, ప్రయోజనాలను కూడా వేర్వేరుగా అంచనా వేయవచ్చు. ఉదాహరణకు ఒక పాఠశాల; బస్సు, రైలు, విమాన ప్రయాణాలు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, వీథి చివరి సంతలు, వస్తు తయారీ కార్యకలాపాలలోనూ లాక్‌డౌన్ అమలు వ్యయాలు, ప్రయోజనాలను వేర్వేరుగా లెక్కకట్టవచ్చు. వ్యయాలు అధికంగా ఉండి లాభాలు తక్కువగా ఉండే కార్యకలాపాలపై లాక్‌డౌన్ విధించాలి. ఇతర కార్యకలాపాలను అనుమతించవచ్చు. ఉదాహరణకు సినిమా హాళ్ల నిర్వహణ వ్యయాలు అధికంగా ఉంటాయి. పరిమిత ప్రదేశంలో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఒక మూసిన ప్రదేశానికి పరిమితం చేయబడతారు. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలకు జరిగే చేర్పు ఏమీ ఉండదు గనుక ప్రయోజనాలు నామ మాత్రమే. ఇటువంటి కార్యకలాపాలపై లాక్‌డౌన్ విధించవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను సమకూర్చే పాఠశాలలు పని చేసేందుకు అనుమతించాలి. 


నిశ్చిత కార్యకలాపాల విషయంలో బహుళ సంభావ్య పరిస్థితులు నెలకొంటాయి. పాఠశాలలకు సంబంధించి ఈ క్రింద పేర్కొన్న వేర్వేరు సందర్భాలలో వ్యయాల, ప్రయోజనాలను అంచనా వేయవచ్చు. అవి: (1) సంపూర్ణ లాక్‌డౌన్; (2) ఈ-లెర్నింగ్‌తో సంపూర్ణ లాక్‌డౌన్; (3) లాక్‌డౌన్ విధించకుండా టెస్టింగ్, ట్రేసింగ్ ముమ్మరంగా జరపడం; (4) టెస్టింగ్, ట్రేసింగ్ లేకుండా లాక్‌డౌన్ విధించడం. ఈ వేర్వేరు సందర్భాలలో ప్రాథమిక, మాధ్యమిక, విద్యకు, ఉన్నత విద్యకు సంబంధించిన వ్యయాల, ప్రయోజనాలను విడివిడిగా విశ్లేషించవచ్చు. అంతేకాకుండా రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ పాఠశాలల విషయంలో కూడా వ్యయలాభాలను మదుపు చేయవచ్చు. ఈ బహుళ ప్రత్యామ్నాయాలను కచ్చితంగా అంచనావేసి, వాటిలో ఉత్తమమైన వాటిని అమలుపరచాలి. 


లాక్‌డౌన్‌ల ఆర్థిక ప్రభావం తీవ్రంగా ఉంటుందని; కాయకష్టంతో బతికే పేదలు, స్థిర ఆదాయం గల మధ్యతరగతి ప్రజలు, ధనికులపై ఒకే రీతిలో ఉండబోదని, నిరుపేదలు నికృష్ట పరిస్థితులలోకి నెట్టివేయబడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డేవిడ్ నవార్రో నొక్కి చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల పేదలకు ఆహారం అందుబాటులో ఉండదని ఆయన అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించడం ఖాయమని నవార్రో స్పష్టం చేశారు. బతకాలంటే చట్ట విరుద్ధంగా వ్యవహరించడాన్ని తప్పనిసరి చేసే పరిస్థితులను పేదలకు లాక్‌డౌన్‌లు కల్పిస్తాయి. ఫలితంగా ఆకలి దప్పులతో మాడిపోయే జనులు ఎటువంటి పనులకైనా సిద్ధమవుతారు. ఇది వాంఛనీయం కాదు. కనుక లాక్‌డౌన్‌లను కచ్చితంగా అమలుపరుస్తూ అదే సమయంలో పేదలకు నేరుగా నగదు బదిలీ చేసి తీరాలని హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. మహమ్మారి కష్ట నష్టాలను అధిగమించేందుకు చిన్న పరిశ్రమలకు, బాధిత ప్రజలకు రుణాలు సమకూర్చడం వల్ల ప్రయోజనమేమీ లేదని ప్రతిష్ఠాత్మక ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ పరిశోధనా పత్రం ఒకటి స్పష్టం చేసింది. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ సత్వరమే జరిగే అవకాశం ఎంత మాత్రం లేనందున రుణ సహాయం పొందిన వారు ఆ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేరు. ఈ పరిస్థితుల్లో ఆ రుణాలను మాఫీ చేయడం ప్రభుత్వాలకు తప్పనిసరి అవుతుందని, ఈ చర్య ఆర్థిక వ్యవస్థపై మరింత భారాన్ని మోపుతుందని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పరిశోధకులు వాదించారు. మరి మార్గాంతరమేమిటి? కొత్త పరిస్థితులకు అనుగుణంగా కొవిడ్ ప్రతి ఘటనా వ్యూహాలలో మనం మార్పులు చేర్పులు చేసుకోవాలి. వివిధ కార్యకలాపాలకు సంబంధించి భిన్న భిన్న లాక్‌డౌన్‌ లను అమలుపరచాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో పేదలకు నేరుగా నగదు బదిలీ చేయాలి. ఇలా జరిగినప్పుడు మాత్రమే మనం మహమ్మారిని సంపూర్ణంగా అధిగమించగలుగుతాం.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...