‘టాటా’దే విజయం

ABN , First Publish Date - 2021-03-27T06:24:32+05:30 IST

దేశంలో అతిపెద్ద, సుదీర్ఘ కార్పొరేట్‌ వివాదానికి దాదాపుగా తెరపడినట్లే. ‘మిస్త్రీ’తో పోరులో ‘టాటా’నే విజయం వరించింది. టాటా గ్రూప్‌ చైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ జాతీయ కంపెనీల చట్టం అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) గతంలో జారీ

‘టాటా’దే విజయం

  • సుప్రీంకోర్టులో సైరస్‌ మిస్త్రీకి ఎదురుదెబ్బ
  • ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును పక్కన బెట్టిన కోర్టు


ఇది విజయం లేదా ఓటమికి సంబంధించిన అంశం కాదు. టాటా గ్రూప్‌ విలువలు, నైతికతకు సుప్రీంకోర్టు తాజా తీర్పే ధ్రువీకరణ. 

- రతన్‌ టాటా


సర్వోన్నత న్యాయస్థానం తీర్పు టాటా సన్స్‌ తప్పులేదని నిరూపించడంతోపాటు గడిచిన కొన్నేళ్లుగా టాటా గ్రూప్‌ పాటిస్తున్న పాల నా ప్రమాణాలను సమర్థించింది. న్యాయస్థానానికి  కృతజ్ఞులం. దేశాభివృద్ధికి పాటుపడటంతోపాటు వాటాదారులు, సమాజ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసే విషయంలో టాటా గ్రూప్‌ కట్టుబడి ఉంటుంది.       

- టాటా సన్స్‌ 


న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద, సుదీర్ఘ కార్పొరేట్‌ వివాదానికి దాదాపుగా తెరపడినట్లే. ‘మిస్త్రీ’తో పోరులో ‘టాటా’నే విజయం వరించింది. టాటా గ్రూప్‌ చైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ జాతీయ కంపెనీల చట్టం అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) గతంలో జారీ చేసిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. టాటా గ్రూప్‌ దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను అనుమతిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే, న్యాయమూర్తులు ఏఎస్‌ బోపన్న, వీ రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. సైరస్‌ మిస్త్రీ తరఫు అప్పీళ్లను బెంచ్‌ తిరస్కరించింది. గత ఏడాది జనవరి 10వ తేదీనే ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. తాజాగా ఈ కేసులో తుది తీర్పు వెల్లడించింది. 


గత ఏడాది డిసెంబరు 17న సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా మిస్త్రీకి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌.. టాటాలపై భారీ ఆరోపణలు చేసింది. మిస్త్రీని టాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి తొలిగించడాన్ని రక్త క్రీడ, ఆకస్మిక దాడిగా అభివర్ణించింది. తద్వారా టాటా గ్రూప్‌ కార్పొరేట్‌ పాలనా ప్రమాణాలు, ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ (ఏఓఏ) ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. టాటా గ్రూప్‌ ఈ ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించింది. మిస్త్రీ తొలగింపులో ఎలాంటి తప్పు చేయలేదని, టాటా సన్స్‌ తన హక్కుల మేరకే వ్యవహరించిందని సమర్థించుకుంది. 2012లో రతన్‌ టాటా నుంచి సైరస్‌ మిస్త్రీ టాటా గ్రూప్‌ పగ్గాలు అందుకున్నారు. గ్రూప్‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించాడన్న కారణంగా 2016 అక్టోబరులో టాటా సన్స్‌ బోర్డు మిస్త్రీని ఆకస్మికంగా చైర్మన్‌ పదవి నుంచి  తప్పించింది. 


తెగదెంపులకు వేరే మార్గం వెతుక్కోండి..  

తెగదెంపులకు సంబంధించి ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదంపైనా సుప్రీంకోర్టు స్పందించింది. ‘‘టాటా లిస్టెడ్‌ కంపెనీలు, స్థిరాస్తులు, ఇతరత్రా వాటిల్లో టాటా సన్స్‌ వాటాల విలువపైనే టాటా గ్రూప్‌ షేర్ల విలువ ఆధారపడింది. కాబట్టి సరైన పరిహారంపై ప్రస్తుత దశలో, కోర్టులో తీర్పు ఇవ్వలేం. ఇందుకోసం ఆర్టికల్‌ 75 లేదా మరేదైనా చట్టబద్ధమైన మార్గాన్ని ఆశ్రయిస్తారా అనేది ఇరువర్గాలకే వదిలేస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. టాటా గ్రూప్‌లో తమకున్న వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు ఉంటుందని ఎస్‌పీ గ్రూప్‌ వాదిస్తోంది. కానీ, టాటా సన్స్‌లోని ఎస్‌పీ గ్రూప్‌కున్న 18.37 శాతం వాటా విలువ రూ.70,000-80,000 కోట్ల స్థాయిలో ఉండవచ్చని టాటా గ్రూప్‌ అంటోంది. 


టాటా షేర్లు జూమ్‌ 

సుప్రీంకోర్టు తీర్పుతో టాటా గ్రూప్‌ షేర్లు 6 శాతం వరకు పెరిగాయి. బీఎ్‌సఈలో టాటా స్టీల్‌ 6.05 శాతం, టాటా పవర్‌ 4.92 శాతం, టాటా కమ్యూనికేషన్స్‌ 4.11 శాతం, టాటా మోటార్స్‌ 3.78 శాతం ఎగబాకాయి. టాటా మోటాలిక్స్‌ 3.08ు, టాటా ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన్‌ 2.59ు, టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రొడక్ట్స్‌ 2.57ు, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ 2.04ు, వోల్టాస్‌ 2.01ు, టాటా కెమికల్స్‌ 1.77 శాతం పెరిగాయి. 


కీలక ఘట్టాలు


2016

అక్టోబరు 24: టాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్‌గా రతన్‌ టాటా బాధ్యతల స్వీకరణ 

డిసెంబరు 20: టాటా సన్స్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్‌ను ఆశ్రయించిన మిస్త్రీ కుటుంబ పెట్టుబడి కంపెనీలు.


2017

జనవరి 12: టాటా సన్స్‌ చైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ నియమాకం. 

ఫిబ్రవరి 6: టాటా సన్స్‌ బోర్డు నుంచీ మిస్త్రీ తొలగింపు. 

ఏప్రిల్‌ 17:  ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌లో సైరస్‌ మిస్త్రీ కుటుంబ కంపెనీల అప్పీళ్లను తిరస్కరణ 

ఏప్రిల్‌ 27: ఎన్‌సీఎల్‌టీ తిరస్కరణను సవాలు చేస్తూ, కంపెనీల చట్టం అపిల్లేట్‌ ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆశ్రయించిన మిస్త్రీ కంపెనీలు. 

సెప్టెంబరు 21: మిస్త్రీ కంపెనీల పిటిషన్లను అనుమతించిన ఎన్‌సీఎల్‌ఏటీ.. కేసును విచారించాలని ఎన్‌సీఎల్‌టీకి ఆదే శాలు జారీ.  


2018

జూలై 9: మిస్త్రీ అర్జీని తిరస్కరించిన ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌. రతన్‌ టాటాతోపాటు టాటా గ్రూప్‌పై ఆరోపణలనూ తోసిపుచ్చిన ట్రిబ్యునల్‌. 

ఆగస్టు 3: ఎన్‌సీఎల్‌టీ తీర్పును సవాలు చేస్తూ ఎన్‌సీ ఎల్‌ఏటీని ఆశ్రయించిన మిస్త్రీ కంపెనీలు

ఆగస్టు 29: మిస్త్రీ, ఆయన కంపెనీల పిటిషన్లను స్వీకరించిన ఎన్‌సీఎల్‌ఏటీ.  


2019

మే 23: మిస్త్రీ, ఆయన కంపెనీల పిటిషన్లపై విచారణ పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్‌ చేసిన ఎన్‌సీఎల్‌ఏటీ 

డిసెంబరు 18: టాటా సన్స్‌ చైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియ మించాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు. టాటాలు అప్పీలు చేసు కునేందుకు వీలుగా నాలుగు వారాల గడువు ఇచ్చిన అపిల్లేట్‌ ట్రిబ్యునల్‌. 


2020

జనవరి2: ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన టాటా గ్రూప్‌

జనవరి 10: ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం. 

సెప్టెంబరు 22: టాటా సన్స్‌లోని తన వాటా షేర్లను తనఖా పెట్టకుండా షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ను నిలు వరించిన సుప్రీంకోర్టు 

డిసెంబరు 8: తుది విచారణ ప్రారంభం 

డిసెంబరు 17: తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం 


2021

మార్చి 26: టాటాలకు అనుకూలంగా తుది తీర్పు ప్రకటిం చిన సుప్రీంకోర్టు 

Updated Date - 2021-03-27T06:24:32+05:30 IST