Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా సమయంలో పన్నుల పెంపా?

పట్టణ ప్రజలపై భారం సరికాదు

చెత్తపై పన్ను విధించడానికి సిగ్గుపడాలి

ప్రభుత్వంపై ఏపీ పౌరసమాఖ్య ధ్వజం


అమరావతి/విజయవాడ, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): కరోనా కల్లోల సమయంలో పురపాలక, నగర పాలక సంస్థల్లో చెత్తపన్ను విధింపు, ఆస్తిపన్నులు పెంచడంతోపాటు వాటిని వెంటనే వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దారుణమని ఏపీ పట్టణ పౌర సమాఖ్య విమర్శించింది. ఉద్యోగాలు లేక, జీవనోపాధిని కోల్పోయి ఆదాయం గణనీయంగా తగ్గిపోయి అల్లాడుతున్న పట్టణ ప్రజలపై ఈ భారాలు మోపడం సహేతుకం కాదని సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని గమనించి, కొత్త పన్నుల విధింపు, ఇప్పటికే ఉన్న పన్నుల పెంపు నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది.


ఈమేరకు విజయవాడలో బుధవారం ‘పౌర సమాఖ్య’ రాష్ట్ర కన్వీనర్‌ సీహెచ్‌.బాబూరావు మీడియాతో మాట్లాడారు. పట్టణాల్లో ఉచితంగా అందజేయాల్సిన పారిశుద్ధ్య సేవలపై ‘చెత్త పన్ను’ పేరిట భారం మోపడం, అద్దె విలువల ఆధారిత ఆస్తి పన్ను స్థానంలో మార్కెట్‌ విలువల ఆధారంగా ఆస్తిపన్నును విధించాలనుకోవడం, దానిని ప్రతి ఏటా 5ు పెంచాలనుకోవడం దారుణమని బాబూరావు అన్నారు. చెత్తపై పన్ను విధించడానికి సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఎక్కువ పన్నులు వసూలు చేయడం ద్వారా కేంద్రం ఇచ్చే అవార్డుల కోసం రాష్ట్ర సర్కారు ఏం చేసేందుకైనా వెనుకాడడం లేదని బాబూరావు దుయ్యబట్టారు. ఈ పన్నుల ప్రతిపాదనలపై గతేడాది సీఎం జగన్‌ నిర్వహించిన సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారని, అయితే..ఈ నిర్ణయాలను అమలు పరచబోమని చెప్పి, కొవిడ్‌-19తో పట్టణ ప్రజలు అల్లాడుతున్న సమయంలో చడీచప్పుడు లేకుండా అమలు చేస్తున్నారని బాబూరావు పేర్కొన్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఆస్తిపన్ను పెంపుపై నోటిఫికేషన్‌ జారీ చేశారని, విజయనగరం జిల్లా సాలూరులో తీర్మానాన్ని ఆమోదించారని, గుంటూరులో ‘ప్రయోగాత్మకం’గా పెంచుతున్నట్లు కమిషనర్‌ ప్రకటించారని తెలిపారు.

Advertisement
Advertisement