సీఎం..మీకంత భయమెందుకు?

ABN , First Publish Date - 2020-10-14T08:48:08+05:30 IST

రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న వారంతా నిజంగానే మేకప్‌ ఆర్టిస్టులైతే అసెంబ్లీకి వెళ్లడానికి సీఎం జగన్‌కు భయమెందుకని...

సీఎం..మీకంత భయమెందుకు?

  • ఉద్యమించేవారంతా మేకప్‌ ఆర్టిస్టులయితే.. 
  • అసెంబ్లీకి సెక్యూరిటీ లేకుండా వెళ్లగలరా?
  • కనీసం ఆ రైతుల గోడు వినిపించడంలేదా?
  • సీఎం జగన్‌పై రఘురామరాజు ధ్వజం

న్యూఢిల్లీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న వారంతా నిజంగానే మేకప్‌ ఆర్టిస్టులైతే అసెంబ్లీకి వెళ్లడానికి సీఎం జగన్‌కు భయమెందుకని వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణంరాజు నిలదీశారు. ‘‘సెక్యూరిటీ లేకుండా అసెంబ్లీకి వెళ్లగలరా? ఉండేది తాడేపల్లిలోనే కదా! అక్కడకు దగ్గరలోనే రైతులు 300 రోజులుగా గాంధేయ మార్గంలో ఉద్యమాలు చేస్తుంటే మీకు కనిపించడం లేదా? వారిని పెయిడ్‌ ఆర్టిస్టులంటూ వేధిస్తారా, అవమానిస్తా రా? రాజధానికోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల త్యాగాలను అవహేళన  చేస్తారా?’’ అని ప్రశ్నలవర్షం కురిపించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నా, సీఎంకు రైతుల గోడు కనిపించకపోవడం బాధాకరమన్నారు. 


కేవలం 30మంది రైతులే పోరాడుతున్నట్లు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాజధాని రైతులను సజ్జల రామకృష్ణారెడ్డి కించపరచడం సరికాదన్నారు. ‘‘రైతులు డ్రామా ఆర్టిస్టులని సజ్జల అవహేళన చేయడాన్నిబట్టి రైతులపట్ల జగన్‌కు ఉన్న ప్రేమేంటో అర్థమవుతోంది. రైతు ఉద్యమకారుల ను చులకనగా మాట్లాడటంలోని ఆయన ఆంతర్యమేమిటి? రైతులకు, దళితులకు మధ్య అగాధం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలతో సీఎంను ప్రజలు, రైతుల నుంచి సజ్జల దూరం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చేతగాని సీబీ-సీఐడీ ఉందని రఘురామ విమర్శించారు. 


నాటి కౌరవసభలో ద్రౌపది వస్ర్తాపహరణం జరగగా, నేటి కౌరవసభలో న్యాయదేవతకు ఆ అవమానం జరిగిందని తూర్పారబట్టారు. ఇలాంటి సభలో తాను కూడా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానన్నారు. ఆనాడు ద్రౌపదిని ‘గోవిందుడు’ కాపాడితే, నేడు న్యాయవ్యవస్థను ‘కోవిందుడు’(రాష్ట్రపతి) కాపాడతారన్న నమ్మకం తనకున్నదన్నారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనీ, కోర్టులను కించపరుస్తూ మాట్లాడినవారిలో, సోషల్‌ మీడియా వేదికగా దూషించినవారిలో ఇంత వరకు ఒక్కరినీ ఆరెస్టు చేయకపోవడం బాధాకరమని రఘురామ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-14T08:48:08+05:30 IST