ఈ చర్యతో అయినా టీడీపీ బలోపేతం అవుతుందా?

ABN , First Publish Date - 2020-10-24T17:53:59+05:30 IST

ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త అధ్యక్షుల నియామకంతో తెలుగుదేశం పార్టీ బలోపేతం కానుందా? ఆ జిల్లాల్లో పార్లమెంటరీ కమిటీల్లో పాటించిన సామాజిక న్యాయం పార్టీకి కలిసొస్తుందా? కొత్తగా నియామకమైన అధ్యక్షుల ముందు ఏయే సవాళ్లు ఉన్నాయి? టీడీపీ ఇన్‌ఛార్జిలు లేని శాసనసభ...

ఈ చర్యతో అయినా టీడీపీ బలోపేతం అవుతుందా?

ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త అధ్యక్షుల నియామకంతో తెలుగుదేశం పార్టీ బలోపేతం కానుందా? ఆ జిల్లాల్లో పార్లమెంటరీ కమిటీల్లో పాటించిన సామాజిక న్యాయం పార్టీకి కలిసొస్తుందా?  కొత్తగా నియామకమైన అధ్యక్షుల ముందు ఏయే సవాళ్లు ఉన్నాయి? టీడీపీ ఇన్‌ఛార్జిలు లేని శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు  ఏవి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతికీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల నియామకం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు జిల్లాల్లోని  పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిపిన టీడీపీ అధ్యక్షుల నియామకంలో సామాజిక సమతూకం పాటిస్తూ పదవులు కట్టబెట్టారు. అలాగే యువత, మహిళా అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ముందుగా సెంటిమెంట్‌గానే కాకుండా రాజకీయంగా కీలకమైన తూర్పుగోదావరి విషయానికొస్తే.. ఈ జిల్లాలో కాకినాడ పార్లమెంట్‌కు కాపుల కోటాలో జ్యోతుల నవీన్‌కుమార్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అలాగే రాజమండ్రి పార్లమెంట్‌కు ఎస్సీ వర్గానికి చెందిన మాజీ మంత్రి కె.ఎస్. జవహార్, అమలాపురం పార్లమెంట్‌కు బీసీ మహిళా నేత అయిన రెడ్డి అనంత కుమారిలను పార్టీ అధ్యక్షులుగా నియమించారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. ఇక్కడ మూడు సామాజికవర్గాలకు చెందినవారిని కొత్త అధ్యక్షులుగా నియమించారని పార్టీ నాయకులు అంటున్నారు.


ఏ విధంగా సమన్వయం చేస్తారో...

రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి జవహార్ ఇప్పటికే నియోజకవర్గంలో సీనియర్ నేతలను కలిశారు. అయితే ఈ పార్లమెంట్‌ పరిధిలోని రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ శాసనసభ నియోజకవర్గాలు మాత్రమే పార్టీ పరంగా బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి ఆదిరెఢ్డి భవానీ, రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయచౌదరిలు విజయం సాధించారు. ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటగా ఉన్నాయి. అయితే రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతంపై కొత్త అధ్యక్షుడు జవహర్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయి. రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ పెందుర్తి వెంకటేష్ ఏకఛత్రాధిపత్యంతో వ్యవహరిస్తూ ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి పార్టీ క్యాడర్‌లో నెలకొంది. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాగంటి రూప కూడా నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో నూతన అధ్యక్షుడు జవహార్‌.. ఇక్కడ పార్టీని ఏ విధంగా సమన్వయం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


ఈ ఇద్దరికీ కాస్త పర్వాలేదు...

కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు కాపు సామాజికవర్గానికి చెందిన నేత జ్యోతుల నవీన్‌ యువకుడు కావడంతోపాటు జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. తండ్రి జ్యోతుల నెహ్రుకు కూడా అందరితో సత్సంబంధాలు ఉండటం నవీన్‌కుమార్‌కు కలిసొచ్చే అంశం. అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణ, నిమ్మకాయల చినరాజప్పల సహకారంతో పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంది. అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష పదవిని బీసీల కోటాలో శాసనమండలి వైస్‌ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం సతీమణి రెడ్డి అనంతకుమారికి అప్పగించారు. గతంలో ఎంపీపీగా పనిచేసిన అనుభవం అనంత కుమారికి ఉంది. భర్త రెడ్డి సుబ్రహ్మణ్యంకు కూడా నియోజకవర్గంలో సత్సంబంధాలు ఉండటం.. అనంత కుమారికి కలిసొచ్చే అంశం. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మండపేట, కొత్తపేట, రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. పి.గన్నవరం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌ఛార్జిలను నియమించాల్సిన అవసరం ఉంది. అలాగే అమలాపురం నియోజకవర్గం టీడీపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటపై పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకోవాలని పార్టీ కార్యకర్తలు సూచిస్తున్నారు.


ఆయన ఎలా ఎదుర్కొంటారనేదే ప్రశ్న...

పశ్చిమగోదావరి విషయానికొస్తే.. ఈ జిల్లాలోని ఏలూరు లోక్‌సభ స్థానానికి ఎప్పుడూ ప్రత్యేకత ఉంటూనే ఉంది. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు, ఆ తర్వాత.. ఈ స్ధానం ఎప్పుడూ టీడీపీకి కంచుకోటే. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఇక్కడ నుంచి ఆ పార్టీ ఓడిపోయిన సందర్భాలు అతి స్వల్పమే. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఏలూరు, దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు, చింతలపూడి, నూజివీడు స్థానాలు ఏలూరు లోక్‌సభ స్ధానం పరిధిలో ఉండగా.. పునర్విభజన తర్వాత ఏలూరు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు స్థానాలతోపాటు కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైకలూరు స్థానాలను ఏలూరు లోక్ సభ స్థానం పరిధిలో చేర్చారు. పునర్విభజనకు ముందుతో పోలిస్తే.. ఆ తర్వాత ఏలూరు లోక్‌సభ స్థానం పరిధి చాలావరకు పెరిగింది. అటువంటి లోక్‌సభ స్థానం కమిటీ అధ్యక్షునిగా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును పార్టీ హైకమాండ్ నియమించింది. మంచి పరిపాలనాధ్యక్షుడిగా, అందరిని కలుపుపోయే తత్వం ఉన్న గన్ని వీరాంజనేయులు.. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీలోని తాజా విభేదాలను, సమస్యలను ఎలా చక్కబెడతారనేదే ప్రశ్న.


ప్రస్తుతం ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో నాయకత్వ లేమి లేకపోయినా, గ్రూపు విభేదాలు, పరస్పర సహకార లేమి మాత్రం నాయకుల మధ్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక కృష్ణాజిల్లాలో ఉన్న కైకలూరు, నూజివీడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇదే పరిస్థితి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ముఖ్యంగా కొంతమంది నాయకులు పార్టీకి దూరం కావడం, ఒక సామాజిక వర్గం దూరంగా ఉండటం వంటి చర్యల వల్ల పార్టీ కొంత బలహీనంగా మారిందన్న టాక్ ఉంది. మరి కొత్తగా వచ్చిన పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు.. ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతారో చూడాలి.

Updated Date - 2020-10-24T17:53:59+05:30 IST