బడుగు, బలహీన వర్గాల నడ్డి విరచడమేనా ఇండస్ట్రియల్ పాలసీ అంటే?: పంచుమర్తి

ABN , First Publish Date - 2020-08-11T16:37:29+05:30 IST

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక పాలసీపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో

బడుగు, బలహీన వర్గాల నడ్డి విరచడమేనా ఇండస్ట్రియల్ పాలసీ అంటే?: పంచుమర్తి

అమరావతి: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక పాలసీపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. బడుగు, బలహీన వర్గాల నడ్డి విరచడమేనా ఇండస్ట్రియల్ పాలసీ అంటే? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ పారిశ్రామిక వేత్తలను సంతృప్తి పరిచేలా లేదన్నారు. ఇండస్ట్రియల్ పాలసీ వల్ల ఉద్యోగాలు రావాలని... తలసరి ఆదాయం పెరగాలని తెలిపారు. 


టీడీపీ హయాంలో అమలు చేసిన ఇండస్ట్రియల్ పాలసీని ఈప్రభుత్వం ఓసారి చూడాలని అనురాధ హితవు పలికారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అనేకసార్లు నెంబర్ వన్‌గా నిలిచిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో 13 జిల్లాల్లోనూ తలసరి ఆదాయం పెరిగిందన్నారు. టీడీపీ తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ పారిశ్రామిక ఎదుగుదలకు తోడ్పడిందని పేర్కొన్నారు. తాము తెచ్చిన పాలసీ వల్ల 5 లక్షల 70 వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు. 


ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో మొబైల్, ఐటీ , ఫార్మా రంగాల్లో అనేక పరిశ్రమలు వచ్చాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో సాధించిన ఘనతను వైసీపీ తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీలో చెప్పారని మండిపడ్డారు. 2018-19 పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల్లో రూ.98,993 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని బుక్‌లో రాశారని... 2019-20లో పారిశ్రామికంగా ఏం సాధించారో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


పారిశ్రామికాభివృద్ధికి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని దాన్ని బట్టే తెలుస్తోందన్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ, బడుగు, బలహీన వర్గాలను దెబ్బతీసేలా వైసీపీ ఇండస్ట్రియల్ పాలసీ ఉందని విమర్శించారు. టీడీపీ హయాంలో 75 లక్షల సబ్సీడీలు ఇస్తే దాన్ని వైసీపీ 50 లక్షలకు కుదించేసిందన్నారు. టీడీపీ హయాంలో తెచ్చిన పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ చట్టం వల్ల 74 సేవలు పారిశ్రామిక వేత్తలకు అందాయని చెప్పుకొచ్చారు.టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలకు ఆకర్షితులై అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయని పంచుమర్తి గుర్తుచేశారు. 


వైసీపీ ప్రభుత్వ వ్యవహారశైలి కారణంగా 2 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కు పోయాయని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో రాజకీయ జోక్యం ఎక్కువైందన్నారు. పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు బెదిరిపోతున్నారని దుయ్యబట్టారు. కియా మోటార్స్‌ను స్థానిక వైసీపీ ఎంపీ ఎలా బెదిరించారో అందరూ చూశారన్నారు. సంపద సృష్టించే పాలసీ ఒక్కటైనా వైసీపీ చేసిందా? అని ప్రశ్నించారు. సంపద వచ్చే అమరావతి, విశాఖ, తిరుపతిని నిర్వీర్యం చేశారన్నారు. అనుకూల వాతావరణం లేకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని నిలదీశారు. టీడీపీ హయాంలో అమరావతిలో నిర్మించిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ను నిరూపయోగం చేశారని  ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు కష్టమంతా తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటామని వైసీపీ మేనిఫెస్టోలో చెప్పలేదా? అని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు.

Updated Date - 2020-08-11T16:37:29+05:30 IST