ఏకగ్రీవాలపై పత్రికల్లో ప్రకటనలివ్వడం తప్పే: అశోక్‌బాబు

ABN , First Publish Date - 2021-01-27T22:06:53+05:30 IST

ఏకగ్రీవాలను టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తప్పుపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు

ఏకగ్రీవాలపై పత్రికల్లో ప్రకటనలివ్వడం తప్పే: అశోక్‌బాబు

అమరావతి: ఏకగ్రీవాలను టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తప్పుపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘పంచాయతీల ఏకగ్రీవాలపై ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలివ్వడం ముమ్మాటికీ తప్పే. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకగ్రీవాల పేరుతో ప్రకటనలిచ్చి తప్పుచేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేయనుంది. ఎస్ఈసీ చర్యలు తీసుకున్న అధికారులను కాపాడాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున, అటువంటి అధికారుల తీరుపై డీవోపీటీకి ఫిర్యాదు చేయబోతున్నాం. మంత్రి పెద్దిరెడ్డి తాను చేసిన తప్పు తెలుసుకొని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పాలకులు ఇష్టమొచ్చినట్లు చేస్తామేంటే రాజ్యాంగం ఒప్పుకోదు. ఏకగ్రీవాల పేరుతో పంచాయతీల్లో వైసీపీ ఆగడాలు, దౌర్జన్యాలు చేయాలని చూస్తే, టీడీపీ చూస్తూ ఊరుకోదు. రాజ్యాంగంతో, హైకోర్టుతో, సుప్రీంకోర్టుతో పని లేకుండా అక్రమాలు, అరాచకాలు, అవినీతి, అధికార దుర్వినియోగమనే అంశాలతోనే పాలనసాగిస్తామనే ఆలోచనలో వైసీపీ పాలకులు ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎస్ఈసీనే సర్వాధికారి అనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకుంటే మంచిది’ అని హితవు పలికారు.

Updated Date - 2021-01-27T22:06:53+05:30 IST