మైనింగ్‌తో వేలాది కోట్ల దోపిడీ: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-08-07T02:03:25+05:30 IST

విశాఖలో బాక్సైట్ మైనింగ్‌తో వేలాది కోట్లు దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు

మైనింగ్‌తో వేలాది కోట్ల దోపిడీ: చంద్రబాబు

అమరావతి: విశాఖలో బాక్సైట్ మైనింగ్‌తో వేలాది కోట్లు దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. టీడీఎల్పీ, పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుల కార్పోరేషన్ ద్వారా విచ్చలవిడిగా అప్పలు చేసి, ఆ డబ్బును స్కామ్‌లు చేసే స్కీమ్‌లకు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేదన్నారు. పెన్షనర్లు కూడా రోడ్డెక్కే పరిస్థితి ఉందన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారన్నారు. దేవినేని ఉమా బెయిల్ పై విడుదలై బయటకు వస్తే, చట్టవిరుద్ధంగా జాతీయ రహదారిని బ్లాక్ చేశారన్నారు. 


 వైఎస్ హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్లే పులిచింతల గేటు కొట్టుకుపోయిందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో విఫలమయ్యారన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు భయపడి పరిశ్రమలు పొరుగు రాష్ట్రానికి తరలిపోయాయన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేరుతో ప్రభుత్వానికి వేలకోట్ల ఆదాయం ఇచ్చే ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలను తామే పొమ్మంటున్నామని సలహాదారులు మాట్లాడే పరిస్థితి వచ్చిందని ఆయన దుయ్యబట్టారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేశారని ఆయన ఆరోపించారు. రూ.2 లక్షల కోట్ల సంపదను నిరుపయోగ ఆస్తిగా మార్చారన్నారు. అమరావతి పోరాటానికి 600 రోజులు పూర్తవుతోందని, వారి పోరాటానికి తాము మద్దతును తెలియజేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. గురజాలలో ఓ ముస్లిం వ్యక్తిని పోలీసులు కొట్టడంతో ఆత్మహత్య చేసుకున్నారన్నారు. గతంలో నంద్యాలలో కూడా అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్యకు కూడా వీరు కారకులయ్యారని,  దీనిని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఎవరు బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి ఉందన్నారు. సెంటు పట్టాలో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. గృహ నిర్మాణానికి కేంద్ర నిధులు రూ.లక్షా 80 వేలతోనే చేతులు దులుపుకుంటున్నారన్నారు. నేడు సహజ వనరులను వైసీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 


జగన్ రెడ్డి తప్పులు చేసి ఉద్యోగులను బలిచేస్తున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలపైన బచావత్ కమిషన్ ఏపీకి కల్పించిన హక్కుల్ని రక్షించడంలో జగన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. వివాదం లేని ప్రాజెక్టులు గెజిట్ నోటిఫికేషన్‌లోకి పోవడానికి జగన్ రెడ్డి బలహీనతలే కారణమన్నారు. నిబంధనల పేరుతో పెద్ద ఎత్తున రేషన్ కార్డులను, పెన్షన్లు తీసేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆర్టీసీ ఆస్తులను ఆర్ అండ్ బీకి అప్పగించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. 

 


Updated Date - 2021-08-07T02:03:25+05:30 IST