రోడ్లపై నాట్లు..గోతుల్లో చేపలు

ABN , First Publish Date - 2021-07-25T07:21:27+05:30 IST

రోడ్లపై గుంతల్లో వరి నాట్లు వేయడం, చేప పిల్లలు వదలడం, పడవలు అడ్డుపెట్టడం.. మట్టి, సిమెంటు పోసి గుంతలను పూడ్చడం..

రోడ్లపై నాట్లు..గోతుల్లో చేపలు

రోడ్ల దుస్థితిపై టీడీపీ నిరసన 

రోడ్‌ సెస్సు ద్వారా 1200 కోట్లు వసూలు

చిన్న మరమ్మతులు కూడా చేయించలేదు


అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రోడ్లపై గుంతల్లో వరి నాట్లు వేయడం, చేప పిల్లలు వదలడం, పడవలు అడ్డుపెట్టడం.. మట్టి, సిమెంటు పోసి గుంతలను పూడ్చడం.. ఇలా టీడీపీ నేతలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. అధిష్టానం పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, విజయవాడ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం తదితరులు నిరసనలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తుండగా వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని టీడీపీ నేతలపై పేడ చల్లారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేయకుండా టీడీపీ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కైకలూరు మండలం వరాహపట్నం నుంచి ఉప్పుటేరు ప్రధాన రహదారిలో పడిన గుంతల్లో నీరు నిలవడంతో చెరువులా తయారైంది. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నాయకత్వంలో వాటిలో చేప పిల్లలు వదిలిపెట్టి నిరసన తెలిపారు. విజయనగరంలోని గతుకుల రహదారిపై టీడీపీ నేతలు కిమిడి నాగార్జున, కర్రోతు బంగార్రాజు తదితరులు పాదయాత్ర నిర్వహించారు. 


పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండల కేంద్రంలో గుంతలు పడిన రహదారిపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తదితరులు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. పెదవేగి మండలం రామచంద్రాపురం వద్ద రోడ్డుపై గుంతలు పూడుస్తున్న చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు వివాదం నెలకొంది. ఇదే జిల్లా ఆకివీడు మండలం గుమ్ములూరులో ఎమ్మెల్యేలు రామరాజు, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మందపల్లి సెంటర్‌లోని రోడ్లపై గోతుల్లో వరి నాట్లు వేయడంతో పాటు ఏకంగా పడవను తీసుకువచ్చి పెట్టి వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరులోని పలకలూరు రోడ్డుపై వరి నాట్లు వేసే నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుతదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద ఎమ్మెల్సీ దొరబాబు ఆధ్వర్యంలో రోడ్లపై వరి నాట్లు వేశారు. శ్రీకాకుళంలో రోడ్లపై మట్టి, సిమెంటు పోసి గుంతలను పూడ్చి నిరసన తెలిపారు. 


బాక్సైట్‌ కోసం అయితే వేస్తారా? 

‘బాక్సైట్‌ అక్రమ తవ్వకాల కోసం అడవుల్లో కూడా ప్రభుత్వ పెద్దలు  రోడ్లు వేయించారు. ఇతర ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నా రోడ్లపై కనీసం మట్టి కూడా చల్లించడం లేదు. మీ లాభాల కోసం తప్ప ప్రజల కోసం పనిచేయరా’ అని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా రోడ్లు తీవ్రంగా దెబ్బ తిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-07-25T07:21:27+05:30 IST