కోహ్లీ సేనకు ఊరట.. ప్రయాణ ఆంక్షలు రద్దు

ABN , First Publish Date - 2021-05-19T08:34:43+05:30 IST

భారత క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకున్న అడ్డంకులు తొలిగిపోయాయి. భారత్‌లో కరోనా ఆందోళనకర స్థాయిలో ఉండడంతో ఇక్కడి నుంచి తమ దేశంలో అడుగుపెట్టకుండా...

కోహ్లీ సేనకు ఊరట.. ప్రయాణ ఆంక్షలు రద్దు

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకున్న అడ్డంకులు తొలిగిపోయాయి. భారత్‌లో కరోనా ఆందోళనకర స్థాయిలో ఉండడంతో ఇక్కడి నుంచి తమ దేశంలో అడుగుపెట్టకుండా గతంలోనే ఇంగ్లండ్‌ ప్రయాణ ఆంక్షలు విధించింది. స్వదేశీయులు, ఐర్లాండ్‌ వాసులు మినహా మరెవరికీ అక్కడికి అనుమతి లేదు. అయితే బీసీసీఐ చర్చల ఫలితంగా టీమిండియా అక్కడికి వెళ్లేందుకు మినహాయింపు లభించింది. కోహ్లీ సేన అక్కడ దాదాపు మూడు నెలలు ఉండబోతోంది. మహిళల జట్టుతో కలిసి వీరంతా జూన్‌ 3న ఇంగ్లండ్‌లో అడుగుపెట్టనున్నారు. వెంటనే సౌతాంప్టన్‌ స్టేడియంలోనే ఉండే హోటల్‌లో పది రోజుల క్వారంటైన్‌లో ఉంటారు. అయితే అంతకన్నా ముందే ఆటగాళ్లంతా బుధవారం ముంబై చేరుకొని మొత్తం 14రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ముంబైలో ఉన్న ఆటగాళ్లు మాత్రం ఈనెల 24 నుంచి  ఏర్పాటయ్యే బయో బబుల్‌లో నేరుగా అడుగుపెడతారు. ఆ తర్వాత జూన్‌ 2న వీరంతా ఇంగ్లండ్‌కు ప్రత్యేక విమానంలో వెళతారు.


మూడు నగరాల నుంచే ప్రత్యేక విమానాలు

టీమిండియా ఆటగాళ్లు ముంబై చేరుకునేందుకు చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌ నుంచి మాత్రమే బీసీసీఐ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయనున్నట్ట్టు సమాచారం. దీంతో జట్టులోని 24మంది ఆటగాళ్లలో పలువురు కమర్షియల్‌ విమానాల ద్వారా ముంబైకి చేరనున్నారు. అపెండిసైటిస్‌ సర్జరీ నుంచి కోలుకున్న కేఎల్‌ రాహుల్‌తో పాటు మయాంక్‌ అగర్వాల్‌ బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా చెన్నై చేరి అక్కడి నుంచి అశ్విన్‌, సుందర్‌తో కలిసి ముంబైకి ప్రత్యేక విమానంలో వెళతారు.  హైదరాబాద్‌ నుంచి జట్టులో ఇద్దరు ఆటగాళ్లున్నప్పటికీ విహారి ఇప్పటికే ఇంగ్లండ్‌లో ఉన్నాడు. దీంతో సిరాజ్‌ ఒక్కడే ముంబై వెళతాడు. ఢిల్లీ నుంచి కూడా ఐదుగురు క్రికెటర్లు చార్టర్డ్‌ విమానంలో ప్రయాణిస్తారు.


ఇంగ్లండ్‌ టూర్‌కు సాహా సిద్ధం: కరోనా నుంచి కోలుకొన్న భారత వెటరన్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా ఇంగ్లండ్‌ పర్యటనకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌ సందర్భంగా పాజిటివ్‌గా తేలిన సాహా.. ఢిల్లీలోని ఓ హోటల్‌లో రెండు వారాల క్వారంటైన్‌ ముగియడంతో  తన స్వస్థలం కోల్‌కతాకు సోమవారం చేరుకొన్నాడు. 



రెండో డోసు ఇంగ్లండ్‌లోనే

ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత క్రికెటర్లు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ తొలి డోసును వేసుకున్నారు. రెండో డోసును మాత్రం యూకే ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తీసుకోనున్నారు. ఎందుకంటే ఆ సమయానికి వీరంతా ఇంగ్లండ్‌లోనే ఉంటారు. రూట్‌సేనతో టీమిండియా అక్కడ 5 టెస్టులు ఆడనుంది. ‘మన క్రికెటర్లంతా ఇక్కడే తొలి డోసు తీసుకున్నారు. ఇక రెండో డోసుకు అర్హులైన వారికి నిబంధనల ప్రకారం యూకే ఆరోగ్య శాఖ ఇవ్వనుంది. వీరు తీసుకుంది కొవిషీల్డ్‌ కాబట్టి సమస్య లేదు’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2021-05-19T08:34:43+05:30 IST