Abn logo
Jan 20 2021 @ 01:13AM

గాబా కోట బద్దలు

 • ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయం
 • బ్రిస్బేన్‌లో పంత్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌
 • నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు పంచ్‌
 • 2-1తో టెస్ట్‌ సిరీస్‌ కైవసం 


 • 19 డిసెంబరు 2020: భారత్‌ 36 ఆలౌట్‌
 • 19 జనవరి 2021:  గాబా కోటను బద్దలు కొట్టిన భారత్‌


మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియా కంచుకోట గాబా.. యువ భారత్‌ అసమాన పోరాటానికి బద్దలైంది. గాయాలతో సీనియర్‌ ప్లేయర్లు దూరమైనా.. అడుగడుగునా ప్రతికూలతలు ఎదురైనా.. టీమిండియా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అదరగొట్టింది. బ్రిస్బేన్‌లో ఆశలు లేని స్థితి నుంచి.. రిషభ్‌ పంత్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. నాలుగు టెస్ట్‌ల సిరీ్‌సలో 2-1తో ఆసీ్‌సను వారి సొంతగడ్డపైనే చిత్తు చేసింది. బీటలు వారుతున్న పిచ్‌.. కష్టసాధ్యమైన 328 పరుగుల లక్ష్యం.. మరోవైపు ఆసీస్‌ వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఐదో, ఆఖరి రోజు బరిలోకి దిగిన భారత్‌.. కనీసం డ్రాతో గట్టెక్కగలిగితే గొప్పేనన్న విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ.. కుర్రాళ్లు ఊహకందని అద్భుతమే చేశారు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మంచి పునాది వేయగా.. పుజారా ఎంతో ఓర్పుగా జట్టును నడిపించాడు. ఇక పంత్‌ రావడంతోనే మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. వడివడిగా పరుగులు సాధిస్తూ విజయంపై ఆశలు రేపాడు. గతంలో నిర్లక్ష్యమైన షాట్లతో వికెట్‌ పారేసుకొనే పంత్‌.. బాధ్యతగా ఆడుతూ ఆసీస్‌కు ‘పంచ్‌’ ఇచ్చాడు. భారత్‌కు చారిత్రక విజయాన్నందించాడు. క్రికెట్‌ ప్రపంచాన్నే వావ్‌ అనిపించాడు.


ఇది కదా గెలుపంటే... అద్భుతం.. అపూర్వం అనే పదాలు కూడా సరిపోవేమో.. ప్రపంచకప్‌ విజయానికి ఏ మాత్రం తక్కువ కాదిది.. అసలు ఓ టెస్టు మ్యాచ్‌ను బంతి, బంతినీ మిస్‌ కాకుండా ఎప్పుడు చూశామని? చూపు తిప్పుకొంటే ఏం జరుగుతుందోననే ఉత్కంఠతో టీవీలకు అతుక్కుపోయి.. చివరి బంతి వరకు చూస్తామని ఎప్పుడైనా కలగన్నామా? ఎస్‌.. ఇలాంటి అత్యంత అరుదైన అనుభవాన్ని మన యువ ఆటగాళ్లు యావత్‌ ప్రపంచం కళ్లముందుంచారు. సిడ్నీలో అసాధ్యమనుకున్న డ్రాను సుసాధ్యం చేసిన తరహాలోనే బ్రిస్బేన్‌లోనూ ఉక్కు సంకల్పంతో పోరాడారు. 32 ఏళ్లుగా ఆస్ట్రేలియాకు పెట్టని కోటలా ఉన్న గాబా మైదానంలో సర్జికల్‌ స్ట్రయిక్‌కు దిగారు. ఏం గెలుస్తారులే.. అనే అంచనాలను తలకిందులు చేస్తూ 328 పరుగులను మరో 18 బంతులుండగానే ఉఫ్‌.. అంటూ ఊది పారేశారు. భారత్‌ను ఆనంద డోలికల్లో ముంచారు.


ఈ విజయంలో ఎవరి పాత్రనూ తక్కువ చేయలేం.. రోహిత్‌ 7 పరుగులకే అవుటైనా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ పట్టుదల చూపాడు. ‘నయా వాల్‌’ పుజారా అయితే ఆసీస్‌ బౌన్సర్లకు  చేతులు, భుజాలు, ఛాతీ హూనమవుతున్నా నొప్పిని భరిస్తూనే వందలాది బంతులు ఆడాడు. ఇక ‘సూపర్‌ స్టార్‌’ రిషభ్‌ పంత్‌ స్ట్రోక్‌ప్లేతో సీన్‌ మొత్తం మారిపోయింది. సహనంతో పాటు దూకుడును కనబరుస్తూ సరికొత్త పంత్‌ను చూపించాడు. సుందర్‌ సహకారంతో డ్రా అనుకున్న దశ నుంచి ఏకంగా మ్యాచ్‌ను విజయం వైపు తీసుకెళ్లి ఆసీస్‌ గాబా కోటను బద్దలుకొట్టాడు.


బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా విజయఢంకా మోగించింది. మూడు దశాబ్దాల తర్వాత గాబా మైదానంలో ఆసీస్‌కు ఓటమి రుచి చూపించింది. యువ ఆటగాళ్ల అద్వితీయ షోతో నాలుగో టెస్టులో 3 వికెట్లతో గెలిచిన భారత జట్టు 2-1తో సిరీస్‌ను.. అలాగే వరుసగా రెండోసారి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీనీ కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఆసీస్‌.. రెండో టెస్టులో భారత్‌ గెలవగా మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 2018-19 ఆసీస్‌ టూర్‌లోనూ భారత జట్టు 2-1తో సిరీస్‌ గెలిచింది. రిషభ్‌ పంత్‌ (138 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 89 నాటౌట్‌) సాహసోపేతమైన బ్యాటింగ్‌కు తోడు శుభ్‌మన్‌ గిల్‌ (146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91) విజయానికి చక్కటి వేదికను నిర్మించాడు. చటేశ్వర్‌ పుజార (211 బంతుల్లో 7 ఫోర్లతో 56) తనదైన శైలిలో వికెట్లను అడ్డుకున్నాడు. ఫలితంగా ఆఖరి రోజు మంగళవారం భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 97 ఓవర్లలో 7 వికెట్లకు 329 పరుగులు చేసింది. కమిన్స్‌ నాలుగు, లియాన్‌ రెండు వికెట్లు తీశారు. పంత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, కమిన్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు లభించాయి.


తొలి సెషన్‌లో ఆచితూచి..: 4/0తో ఛేదనను ఆరంభించిన భారత జట్టు తొలి సెషన్‌లో జాగ్రత్తగా ఆడింది. దీనికి తోడు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (7) ఆదిలోనే వెనుదిరిగాడు. ఈ దశలో పుజార ఓవైపు డిఫెన్స్‌తో వికెట్‌ను కాపాడుకోగా యువ ఓపెనర్‌ గిల్‌ సొగసైన షాట్లతో ఆకట్టుకున్నాడు. అడపాదడపా చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలో మరో వికెట్‌ కోల్పోకుండా జట్టు 83/1 స్కోరుతో లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత భారత్‌ ఆటలో వేగం పెరిగింది. స్టార్క్‌ బౌలింగ్‌లో గిల్‌ రెండు సిక్సర్లు సాధించి వడివడిగా సెంచరీ వైపు కదిలాడు. కానీ 9 పరుగుల దూరంలో అతడిని దురదృష్టం వెంటా డింది. శతకాన్ని మిస్‌ చేసుకుంటూ లియాన్‌ ఓవర్‌లో వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కెప్టెన్‌ రహానె (24) ఉన్న కాసేపు ఓ ఫోర్‌, సిక్సర్‌తో జోరు చూపించాడు. కానీ కమిన్స్‌ అతడిని పెవిలియన్‌కు చేర్చాడు.  రెండో సెషన్‌లో మాత్రం భారత్‌ 100 పరుగులు జత చేసింది. 


పంత్‌, సుందర్‌ వహ్వా: ఆఖరి సెషన్‌లో భారత్‌ గెలిచేందుకు మరో 37 ఓవర్లలో 145 పరుగులు కావాలి. ఓవర్‌కు నాలుగు పరుగులు అవసరపడగా అంత రిస్క్‌ తీసుకుంటుందా అనిపించింది. డ్రా ఖాయమే అని అంతా భావించారు. ఇక పుజార 196 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తిచేశాడు. కానీ 80 ఓవర్ల తర్వాత రెండో కొత్త బంతి తీసుకున్న వెంటనే పుజార, కొద్ది సేపటికే మయాంక్‌ (9)లను కమిన్స్‌ అవుట్‌ చేశాడు. పంత్‌కు జతగా వాషింగ్టన్‌ సుందర్‌ (22) కలవడంతో స్టేడియం హోరెత్తింది. అప్పటికి 13 ఓవర్లలో 63 పరుగులు అవసరపడగా.. దీనికి తగినట్టుగానే పరుగుల మోత మోగింది. 93వ ఓవర్‌లో నటరాజ భంగిమలో సుందర్‌ సాధించిన సిక్సర్‌తో పాటు మరో ఫోర్‌తో 11 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత పంత్‌ కూడా రెండు ఫోర్లు బాదాడు. ఈ దశలో వరుస ఓవర్లలో సుందర్‌, శార్దూల్‌ (2) అవుట్‌ కావడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నా పంత్‌ ఫోర్‌తో గాబాలో భారత్‌ చరిత్ర సృష్టించింది.


టెస్టుల్లో భారత్‌ విజయవంతమైన ఛేదనలు

స్కోరు ప్రత్యర్ధి వేదిక ఎప్పుడు

406/4 వెస్టిండీస్‌  పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌    1976

387/4 ఇంగ్లండ్‌ చెన్నై 2008

329/7 ఆసీస్‌ బ్రిస్బేన్‌ 2021

276/5 వెస్టిండీస్‌ ఢిల్లీ 2011

264/3 శ్రీలంక క్యాండీ 2001


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 369; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 336; ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 294

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) పెయిన్‌ (బి) కమిన్స్‌ 7; గిల్‌ (సి) స్మిత్‌ (బి) లియాన్‌ 91; పుజార (ఎల్బీ) కమిన్స్‌ 56; రహానె (సి) పెయిన్‌ (బి) కమిన్స్‌ 24; పంత్‌ (నాటౌట్‌) 89; మయాంక్‌ (సి) వేడ్‌ (బి) కమిన్స్‌ 9; సుందర్‌ (బి) లియాన్‌ 22; శార్దూల్‌ (సి) లియాన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 2; సైనీ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 29; మొత్తం: 97 ఓవర్లలో 329/7. వికెట్ల పతనం: 1-18, 2-132, 3-167, 4-228, 5-265, 6-318, 7-325.బౌలింగ్‌: స్టార్క్‌ 16-0-75-0; హాజెల్‌వుడ్‌ 22-5-74-1; కమిన్స్‌ 24-10-55-4; గ్రీన్‌ 3-1-10-0; లియాన్‌ 31-7-85-2; లబుషేన్‌ 1-0-4-0.

ధోనీని వెనక్కినెట్టి..

గాబా హీరో రిషభ్‌ పంత్‌.. టెస్ట్‌ క్రికెట్‌లో వేగంగా వెయ్యి పరుగుల మార్క్‌ చేరిన భారత వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీని వెనక్కి నెట్టాడు. పంత్‌ 27 ఇన్నింగ్స్‌ల్లో 40.04 సగ టుతో వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు. ఈ ఫీట్‌ సాధించ డానికి ధోనీ 32 ఇన్నింగ్స్‌లు తీసుకొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో రహానె అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన రిషభ్‌.. కమిన్స్‌ వేసిన 58వ ఓవర్‌ 3వ బంతికి తీసిన రెండు పరుగులతో ఈ ఘనతను అందుకొన్నాడు. ఫరూక్‌ ఇంజనీర్‌ (36 ఇన్నింగ్స్‌లు), వృద్ధిమాన్‌ సాహా (37 ఇన్నింగ్స్‌లు), మోంగియా (39 ఇన్నింగ్స్‌లు), సయ్యద్‌ కిర్మాణీ (45 ఇన్నింగ్స్‌లు), కిరణ్‌ మోరే (50 ఇన్నింగ్స్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 


అందుకే పంత్‌కు అండగా..
కీపర్‌గా పంత్‌ ప్రదర్శనపై ఎప్పుడూ విమర్శలే. కానీ, అతడిలో మ్యాచ్‌ విన్నర్‌ను గుర్తించిన టీమిండియా.. రిషభ్‌కు అండగా నిలిచిందని కోచ్‌ రవిశాస్త్రి చెప్పాడు. ‘అతడో మ్యాచ్‌ విన్నర్‌. అందుకే విదేశాల్లో ఆడేటప్పుడు తుది జట్టులో పంత్‌ ఉండాలనుకుంటాం. కీపింగ్‌ సరిగా చేయక పోతే విమర్శల వాన కురిసేది. కానీ, అతడు మ్యాచ్‌లను గెలి పించగలడు. సిడ్నీలో ధాటిగా ఆడిన పంత్‌.. జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. అతడో అద్భుత ఆటగాడు. అందుకే పంత్‌కు అండగా నిలుస్తున్నామ’ని శాస్త్రి చెప్పాడు. యువ భారత్‌ ప్రదర్శనను వర్ణించడానికి తన వద్ద మాటలు సరిపోవడం లేదన్నాడు. 

ధాంక్యూ.. ద్రవిడ్‌

అండర్‌-19 కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఎంతో మంది యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్నాడు. గిల్‌, పంత్‌, సుందర్‌లాంటి వాళ్లను సానబెట్టి.. టీమిండియాకు అందించింది అతడే. గాబా చారిత్రక విజయంలో వీరు కీలక పాత్ర పోషించడంతో అభిమానులు.. ద్రవిడ్‌కు కృతజ్ఞతలు చెబుతూ నెట్‌లో పోస్టులు పెడుతున్నారు. 


అగ్రపీఠాన భారత్‌
ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారత్‌ 430 పాయింట్లతో ఆస్ట్రేలియాను (332)ను వెనక్కినెట్టి నెంబర్‌వన్‌గా నిలిచింది. కోహ్లీ సేన మొత్తం 71.7 శాతం పాయింట్లు సాధించింది. కంగారూలు టాప్‌ నుంచి మూడో స్థానానికి పడిపోయారు. న్యూజిలాండ్‌ (420) రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ రెండో ర్యాంక్‌కు చేరింది. ఆసీస్‌ (113)ను వెనక్కినెట్టి  మూడు నుంచి రెండో ర్యాంక్‌కు ఎగబాకింది. న్యూజిలాండ్‌ (118.44) టాప్‌లో ఉంది. 


 • తన టెస్టు కెరీర్‌లో అత్యంత నెమ్మది (196 బంతుల్లో)గా హాఫ్‌ సెంచరీ సాధించిన పుజార.
 • ఆసీస్‌ గడ్డపై ఓవరాల్‌గా ఇది మూడో అత్యుత్తమ ఛేదన (329)
 • ఓ టెస్టును గెలిచేందుకు చివరి రోజు అత్యధిక పరుగులు (325) రావడం ఇది మూడోసారి. ఆసీస్‌ (404), విండీస్‌ (344) ముందున్నాయి.
 • తొలి టెస్టు ఓడాక సిరీస్‌ను గెలవడం భారత్‌కిది ఐదోసారి.
 • 1989-2019 మధ్యకాలంలో గాబా స్టేడియంలో ఆసీస్‌ వరుసగా 31 టెస్టుల్లో గెలిచి ఇప్పుడు భారత్‌ చేతిలో ఓడింది.
 • ఈ సిరీ్‌సలో భారత బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌ లేదా శరీరానికి బంతి దెబ్బలు తగిలిన సంఖ్య. 2014లో ఓ టెస్ట్‌ సిరీ్‌సలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఎక్కువగా బంతి దెబ్బలు తిన్నారు. ఆ తర్వాత భారత్‌దే రికార్డు. 
 • రహానె కెప్టెన్సీలో ఐదు టెస్ట్‌లు ఆడిన భారత్‌.. నాలుగింటిలో గెలిచింది. మరొకటి డ్రా చేసుకుంది.


బీసీసీఐ 5 కోట్ల నజరానా

ఆస్ట్రేలియాతో సిరీ్‌సను 2-1తో నెగ్గిన టీమిండియాపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) కాసుల వర్షం కురిపించింది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ నిలబెట్టుకొన్న భారత్‌కు బీసీసీఐ టీమ్‌ బోన్‌సగా 5 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. 


ప్రశంసల జల్లు

కఠిన సవాళ్లను అధిగమించి ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ నెగ్గిన యువ భారత జట్టుకు శుభాకాంక్షలు. మీ విజయాన్ని చూసి జాతి గర్విస్తోంది.

- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌


భారత జట్టుకు అభినందనలు. ఆస్ట్రేలియా గడ్డపై మీరు సాధించిన విజయం యావత్‌ భారతావనిని ఆనందోత్సాహాల్లో నింపింది. మీ అంకితభావం, పోరాటస్ఫూర్తి అమోఘం. 

- ప్రధాని నరేంద్ర మోదీ


మీరు సాధించిన అద్వితీయమైన గెలుపు భారతీయులందరినీ గర్వించేలా చేసింది.       

- కేంద్ర హోంమంత్రి అమిత్‌షా


దెబ్బ తగిలిన ప్రతిసారీ తొణకకుండా ధైర్యంగా నిలబడి దీటుగా బదులిచ్చారు. గాయాలు, ఇతరత్రా అంశాలు సవాళ్లు విసిరినా ఆత్మవిశ్వాసంతో ఆడారు. ఇదొక అపూర్వ విజయం.                 

-సచిన్‌ 


అడిలైడ్‌ పరాజయం తర్వాత మా శక్తిసామర్థ్యాలను శంకించిన వారికి ఈ విజయమే సమాధానం. సహచరులు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు అభినందనలు    

- కోహ్లీ

అంతా షాక్‌లా ఉంది. ఇండియా-ఎ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది.          

-రికీ పాంటింగ్‌


రహానె జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈ ప్రదర్శనను ఎప్పటికీ మరిచిపోలేం. 

 - వీవీఎస్‌ లక్ష్మణ్‌


మాటలు రావడం లేదు. గాబా కోటకు బీటలు వారాయి. ఇది భారత్‌ జట్టు సాధించిన సమష్టి విజయం.         

- మిథాలీ రాజ్‌


ఇదో అద్భుత విజయం. టీమిండియాకు అభినందనలు. ఆస్ట్రేలియా కూడా బాగా ఆడింది.    

     - గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌


జట్టులోని ప్రధాన ఆటగాళ్లు గాయాల బారినపడినా పరిమిత వనరులతో భారత్‌ అద్భుతం చేసింది. ఈ విజయం చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.                   

 - సీఎం కేసీఆర్‌


భారత క్రికెట్‌ చరిత్రలో ఈ విజయం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అపూర్వ విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు.

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి


టెస్టు సిరీస్‌ విజయాల్లో ఇదొక అద్భుతంగా నిలిచిపోతుంది. యంగ్‌ ఇండియా తెగువ, శక్తి సామర్థ్యాలకు సలామ్‌.

- ఐటీ మంత్రి కేటీఆర్‌


భారత జట్టు చరిత్ర సృష్టించింది. యువ ఆటగాళ్లు అద్భుత పోరాట పటిమ కనబర్చారు.     

 - ఆర్థిక మంత్రి హరీ్‌షరావు


చారిత్రక విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు. 

 - క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Advertisement
Advertisement
Advertisement