Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయానికి 9 వికెట్లు

బౌలర్లదే భారమంతా..

అయ్యర్‌, సాహా అర్ధ శతకాలు

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 234/7 డిక్లేర్డ్‌ 

కివీస్‌ లక్ష్యం 284.. ప్రస్తుతం 4/1


అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకం, అర్ధ శతకం బాదిన తొలి భారత ఆటగాడిగా శ్రేయాస్‌ అయ్యర్‌. తొలి ఇన్నింగ్స్‌లో అయ్యర్‌ 105 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 65 పరుగులతో రాణించాడు. 

లోయరార్డర్‌లో ఆరు, ఏడు, ఎనిమిది వికెట్లకు 50+ భాగస్వామ్యాలు నమోదు కావడం ఇది రెండోసారి. 2007లో ఓవల్‌ టెస్ట్‌లో ధోనీ, సచిన్‌, అనిల్‌ కుంబ్లే, జహీర్‌ ఖాన్‌ ఈ ఫీట్‌ సాధించారు. ఈ మ్యాచ్‌లో అయ్యర్‌, అశ్విన్‌, సాహా, అక్షర్‌ రిపీట్‌ చేశారు. 

భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అశ్విన్‌. యంగ్‌ను అవుట్‌ చేసిన అశ్విన్‌.. 417 వికెట్లతో మూడోస్థానంలో ఉన్న హర్భజన్‌ రికార్డును సమం చేశాడు. కుంబ్లే(619), కపిల్‌దేవ్‌ (434) టాప్‌-2లో ఉన్నారు. 

ఒక దశలో టీమిండియా 51/5తో కష్టాల్లో కూరుకుపోవడంతో.. న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై పట్టుబిగిస్తోందా? అని అనిపించింది. భారత్‌ను 150 లేదా 160 పరుగుల ఆధిక్యానికే పరిమితం చేస్తే.. ఇక మ్యాచ్‌ విలియమ్సన్‌ సేనదే అని భావిస్తున్న తరుణంలో.. లోయరార్డర్‌ అనూహ్య పోరాటంతో ఆతిథ్య జట్టు మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. శ్రేయాస్‌ మరోసారి కూల్‌ ఇన్నింగ్స్‌తో కివీస్‌ బౌలర్లను ఎదుర్కోగా.. మెడనొప్పితో బాధపడుతున్న సాహా కీలక అర్ధ శతకంతో ఆదుకొన్నాడు. అశ్విన్‌, అక్షర్‌ కూడా విలువైన పరుగులు జోడించడంతో.. భారత్‌ 284 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ముందుంచింది. పిచ్‌ మరింత నెమ్మదించి.. బంతి తక్కువ ఎత్తులో వస్తున్న నేపథ్యంలో ఓపెనర్‌ యంగ్‌ వికెట్‌ను చేజార్చుకున్న కివీస్‌.. చివరి రోజు మ్యాచ్‌ను నెగ్గాలంటే మాత్రం అద్భుతం చేయాల్సిందే! 


కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో ఆతిథ్య టీమిండియా పట్టు బిగించింది. శ్రేయాస్‌ అయ్యర్‌ (65), సాహా (61 నాటౌట్‌) అర్ధ శతకాలతో భారత్‌ను పటిష్ఠస్థితిలో నిలిపారు. నాలుగో రోజు 14/1తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా 234/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 49 రన్స్‌తో కలిపి 284 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ముందుంచింది. అశ్విన్‌ (32), అక్షర్‌ (28 నాటౌట్‌) రాణించారు. జేమిసన్‌, సౌథీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ ఆదివారం ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 4 పరుగులు చేసింది. ఓపెనర్‌ యంగ్‌ (2)ను అశ్విన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లాథమ్‌ (2)తోపాటు సోమర్‌విల్లే (0) క్రీజులో ఉన్నారు. నెమ్మదించిన వికెట్‌పై చివరి రోజు బ్యాటింగ్‌ చేయడం కష్టంగా భావిస్తున్న నేపథ్యంలో భారత స్పిన్‌ త్రయాన్ని కివీస్‌ ఎదుర్కొనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడివున్నాయి. ఇక.. టీమిండియూ గెలవాలంటే రోజు మొత్తంలో 9 వికెట్లు తీస్తే చాలు.


ఆరంభంలో విలవిల..

వికెట్‌నుంచి పెద్దగా సహకారం లేకున్నా కివీస్‌ పేసర్లు సౌథీ, జేమిసన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో తొలి సెషన్‌లో టీమిండియా విలవిల్లాడింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు మయాంక్‌ (17), పుజార (22) జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించే ప్రయత్నం చేశారు. అయితే, పుజారను క్యాచ్‌ అవుట్‌ చేసిన జేమిసన్‌.. రెండో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. కెప్టెన్‌ రహానె (4)ను ఎజాజ్‌ ఎల్బీ చేయగా.. మయాంక్‌, జడేజా (0)ను సౌథీ వెంటవెంటనే అవుట్‌ చేయడంతో టీమిండియా 51/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో అయ్యర్‌కు అశ్విన్‌ అండగా నిలవడంతో.. భారత్‌ 84/5తో లంచ్‌కు వెళ్లింది. 

నిలబెట్టిన భాగస్వామ్యాలు..

కివీస్‌ జోరు చూస్తే.. భారత బ్యాటింగ్‌ తొందరగానే ముగిసేలా కనిపించింది. కానీ, లోయరార్డర్‌లో వరుసగా మూడు అర్ధ శతక భాగస్వామ్యాలు నమోదు కావడంతో.. టీమిండియా మళ్లీ పోటీలోకొచ్చింది. అయ్యర్‌, అశ్విన్‌ సమర్థంగా కివీస్‌ బౌలర్లను ఎదుర్కొంటూ జట్టు స్కోరును సెంచరీ మార్క్‌ దాటించారు. అయితే, జేమిసన్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ వికెట్ల మీదకు ఆడుకోవడంతో.. ఆరో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సాహా సమయోచితంగా రాణించడంతో భారత్‌ కోలుకొంది. సింగిల్‌తో అయ్యర్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా, శ్రేయా్‌సను అవుట్‌ చేసిన సౌథీ.. ఏడో వికెట్‌కు 64 పరుగులతో ప్రమాదకంగా మారిన పార్ట్‌నర్‌షి్‌పను విడదీశాడు. కానీ, రెండో సెషన్‌లో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. ఆ తర్వాత సాహా, అక్షర్‌ ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 67 పరుగులు జోడించి జట్టును పటిష్ఠస్థితిలో నిలిపారు. అయితే, నాలుగో రోజు ఆటకు మరో 15 నిమిషాలు మిగిలుండగా భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 


యంగ్‌ అవుట్‌..

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌.. ఎదుర్కొన్నది 4 ఓవర్లే అయినా బంతి బంతికీ గండం అన్నట్టుగా ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో పోరాడిన ఓపెనర్‌ యంగ్‌ను అశ్విన్‌ ఎల్బీ చేసి దెబ్బకొట్టాడు. స్పిన్నర్లకు సహకరిస్తున్న పిచ్‌పై అక్షర్‌ కూడా కట్టుదిట్టంగా బంతులేశాడు. పరిస్థితులు ప్రతికూలంగా మారిన నేపథ్యంలో.. విజయానికి కివీస్‌ ఇంకా 280 పరుగుల దూరంలో ఉంది.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 345 ఆలౌట్‌

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 296 ఆలౌట్‌


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌:

మయాంక్‌ (సి) లాథమ్‌ (బి) సౌథీ 17, గిల్‌ (బి) జేమిసన్‌ 1, పుజార (సి) బ్లండెల్‌ (బి) జేమిసన్‌ 22, రహానె (ఎల్బీ) ఎజాజ్‌ 4, శ్రేయాస్‌ (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 65,  అశ్విన్‌ (బి) జేమిసన్‌ 32, సాహా (నాటౌట్‌) 61, అక్షర్‌ (నాటౌట్‌) 28; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 81 ఓవర్లలో 234/7 డిక్లేర్డ్‌; వికెట్ల పతనం: 1-2, 2-32, 3-41, 4-51, 5-51, 6-103, 7-167; బౌలింగ్‌: సౌథీ 22-2-75-3, జేమిసన్‌ 17-6-40-3, ఎజాజ్‌ పటేల్‌ 17-3-60-1, రచిన్‌ 9-3-17-0, సోమర్‌విల్లే 16-2-38-0.


న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌:

లాథమ్‌ (బ్యాటింగ్‌) 2, విల్‌ యంగ్‌ (ఎల్బీ) అశ్విన్‌ 2, సోమర్‌విల్లే (బ్యాటింగ్‌) 0; మొత్తం: 4 ఓవర్లలో 4/1; వికెట్ల పతనం: 1-3; బౌలింగ్‌: అశ్విన్‌ 2-0-3-1, అక్షర్‌ పటేల్‌ 2-1-1-0. 

Advertisement
Advertisement