టెకీలకు వర్క్‌-ఫ్రం-హోం ఇక వద్దు

ABN , First Publish Date - 2021-08-02T07:55:43+05:30 IST

కొవిడ్‌ కల్లోలం నేపథ్యంలో గత ఏడాది లాక్‌డౌన్‌ మొదలు.. గడిచిన 15 నెలలుగా ఇళ్ల నుంచే విధులు నిర్వర్తిస్తున్న ఐటీ ఉద్యోగులను తిరిగి కార్యాలయాల నుంచి పనిచేసేలా ప్రోత్సహించాలని ఐటీ కంపెనీలను రాష్ట్ర..

టెకీలకు వర్క్‌-ఫ్రం-హోం ఇక వద్దు

సెప్టెంబరు 1 నుంచి విధులకు పిలిపించండి..

వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ పరీక్షలకు మేం సిద్ధం

ఐటీ పరిశ్రమలకు ప్రభుత్వం హామీ

ససేమిరా అంటున్న టెక్‌ కంపెనీలు

సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు

ఈ వారంలో తుది నిర్ణయం


హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కల్లోలం నేపథ్యంలో గత ఏడాది లాక్‌డౌన్‌ మొదలు.. గడిచిన 15 నెలలుగా ఇళ్ల నుంచే విధులు నిర్వర్తిస్తున్న ఐటీ ఉద్యోగులను తిరిగి కార్యాలయాల నుంచి పనిచేసేలా ప్రోత్సహించాలని ఐటీ కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వర్క్‌-ఫ్రం-హోం విధానానికి స్వస్తిపలికి.. ప్రత్యక్ష విధులను ప్రారంభించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఇటీవల ఆయా కంపెనీల ప్రతినిధులు, ఐటీ ఉద్యోగ సంఘాలతో ఇటీవల సమావేశం నిర్వహించారు. గత ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించాక.. ఐటీ కంపెనీలు వర్క్‌-ఫ్రం-హోం బాటపట్టాయి. తొలుత దీన్ని మూడు నెలలు(జూన్‌ వరకు) కొనసాగించగా.. ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యం, వర్క్‌-ఫ్రం-హోం వల్ల ఔట్‌పుట్‌ ఎక్కువగా వస్తుండడంతో.. విడతల వారీగా కొనసాగిస్తూ వచ్చాయి. రెండు నెలలుగా రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల్లో తగ్గుముఖం పడుతుండడంతో ఇప్పటికే వేర్వేరు పరిశ్రమలు అన్‌లాక్‌ను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా తమ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు 100ు ఉండేలా చర్యలు తీసుకుంది.


ఈ నేపథ్యంలోనే ఐటీ పరిశ్రమల్లో కూడా ‘అన్‌లాక్‌’ను ప్రకటించాలంటూ ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిం ది. సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష విధులకు సిద్ధమవ్వాలని కంపెనీలు, ఐటీ ఉద్యోగుల సంఘాలను కోరింది. అయితే.. కొన్ని కంపెనీలు ఇందుకు అంగీకరించలేదని తెలిసింది. ‘‘ప్రత్యక్ష విధులైనా.. వర్క్‌-ఫ్రం-హోం అయి నా.. ఉద్యోగుల ఔట్‌పుట్‌లో పెద్దగా తేడా లేదు. ఇంకా చెప్పాలంటే ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్న వారి పనితీరు చాలా బాగుంది. ఇంకొంతకాలం దీన్ని కొనసాగిస్తాం. గూగుల్‌ కూడా అక్టోబరు 18 వరకు వర్క్‌-ఫ్రం-హోంను పొడిగిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌, విప్రో, కాగ్నిజెంట్‌, డెలాయిట్‌ వంటి బహుళ జాతి కంపెనీలు కూడా అక్టోబరు వరకు ఇంటినుంచే పనిచేసే వెసులుబాటునిచ్చాయి’’ అని వివరించినట్లు సమాచారం. థర్డ్‌వేవ్‌పై.. దాని తీవ్రతపై అధ్యయనాల నివేదికలనూ ప్రస్తావించినట్లు తెలిసింది. దీనికి జయేశ్‌ రంజన్‌ స్పందిస్తూ.. ఐటీ ఉద్యోగులందరికోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. అన్ని ప్రముఖ కార్యాలయాల వెలుపల కొవిడ్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అయి నా.. కంపెనీల నుంచి సానుకూల స్పం దన రాకపోవడంతో.. ఐటీ శాఖ ఉన్నతాధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష విధులను ఖరారు చేయడం, విధివిధానాలను రూపొందించే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ ఆగస్టు మొదటి వారంలో సమావేశంకానుంది.


ఆ భేటీలో వర్క్‌-ఫ్రం-హోం రద్దుచేసి, సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష విధుల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కాగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 1,500 ఐటీ కంపెనీలు ఉండగా.. వాటిల్లో 6 లక్షల మంది ప్రత్యక్షంగా, మరో 15 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వర్క్‌-ఫ్రం-హోం కారణంగా పరోక్ష ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులపై ఆధారపడ్డ రియల్‌ఎస్టేట్‌, రవాణా, ఆతిథ్య రంగాల్లోని లక్షల మందికి ఉపాధి మృగ్యమైందనేది ప్రభుత్వ ఆందోళనగా తెలుస్తోంది. ఇప్పటికే చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీల్లో సిబ్బందికి వర్క్‌-ఫ్రం-హోంను రద్దు చేసినా.. మొత్తమ్మీద ప్రత్యక్ష విధులకు హాజరవుతున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 5ు కూడా లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-08-02T07:55:43+05:30 IST