రియాల్టీ రంగంలో వర్చ్యువల్‌ మేజిక్‌!

ABN , First Publish Date - 2020-02-15T06:04:31+05:30 IST

టెక్నాలజీ వినియోగంతో అన్ని రంగాలూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ టెక్‌ వినియోగం బాగా పెరిగింది.

రియాల్టీ రంగంలో వర్చ్యువల్‌ మేజిక్‌!

టెక్నాలజీ వినియోగంతో అన్ని రంగాలూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ టెక్‌ వినియోగం బాగా పెరిగింది. ఎంతలా అంటే  ఏడాది తరువాత పూర్తయ్యే ఫ్లాట్‌ ఎలా ఉంటుందో అడ్వాన్స్‌ చెల్లించే సమయంలోనే చూడొచ్చు. ఇంట్లో గ్యాస్‌ లీకైనా, కిటికీ అద్దం పగిలినా ఆ సమాచారం మీ మొబైల్‌లో సంక్షిప్త సందేశం రూపంలో తెలిసిపోతుంది. ఇదంతా టెక్నాలజీ గొప్పతనమే! 

పెద్దపెద్ద భవన నిర్మాణ సంస్థలు తాము నిర్మించే ఆకాశహర్మ్యాలకు ఏ ప్రమాదం వాటిల్లకుండా ఉండటం కోసం ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ’ వినియోగిస్తున్నాయి. నిర్మాణ సమయంలోనే భారీ సంఖ్యలో సెక్యూరిటీ కెమెరాలను వినియోగించడం ద్వారా ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను పర్యవేక్షించడంతో పాటు అనుమానితులు ఎవరైనా ఆ ప్రదేశంలోకి ప్రవేశిస్తున్నట్లయితే ఆ విషయాన్ని వెంటనే సెంట్రల్‌ సర్వర్‌లో గుర్తిస్తున్నారు. 

అలాగే వాహనాలను ప్రత్యేకమైన స్కానర్ల ద్వారా పరీక్షించడం కూడా జరుగుతోంది. ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబయ్‌ వంటి నగరాల్లో పలువురు నేరస్థులకు సంబంధించి పోలీస్‌ల దగ్గర ఉన్న డేటాబేస్‌ని తమ దగ్గర ఉన్న ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో అనుసంధానం చేయడం ద్వారా భవనంలోకి ప్రవేశించే వ్యక్తుల్లో ఎవరైనా నేరస్థులు ఉంటే క్షణాల్లో గుర్తించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేసే వీడియో మానిటరింగ్‌ నెట్‌వర్క్‌ని కూడా కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వినియోగించుకుంటున్నాయి. ఉదాహరణకు ఎక్కడైనా అనుమానితులు ఒక బ్యాగ్‌ను 30 నిమిషాలపాటు ఒక చోట వదిలేస్తే దానికి సంబంధించిన అలర్ట్‌ సంబంధిత సెక్యూరిటీ విభాగానికి వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.


వివిధ దశల్లో...

భవన నిర్మాణ పనిని వేగవంతం చేయడం కోసం ఒక భవనానికి సంబంధించిన ప్లాన్‌ మొదలుకొని, బడ్జెట్‌ కేటాయింపు, నిర్మాణ సామగ్రిని సమకూర్చుకోవటం, నిర్మాణ పనులను పర్యవేక్షించడం వంటి అన్ని రకాల దశల్లో ఇప్పుడు టెక్నాలజీని బాగా వినియోగిస్తున్నారు. అంతేకాదు భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్యం, భద్రత విషయంలో కూడా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా భవన నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్‌ ద్వారా సేకరించిన విజువల్‌ డేటాని ఆసరాగా చేసుకుని దాన్ని ఎనలటిక్స్‌తో విశ్లేషించడం ద్వారా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రక్రియను ‘ఫొటోగ్రామెట్రీ’ అనే పేరుతో పిలుస్తారు. ఆ డేటా ఆధారంగా నిర్మాణ స్థలానికి సంబంధించి 2డి, 3డి మోడల్స్‌ సిద్ధపరుస్తారు. ఆ సమాచారం ఆధారంగా తదుపరి నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బడ్జెట్‌ కేటాయింపుల కోసం ‘‘బిల్డ్‌ సప్లై’’ వంటి సాఫ్ట్‌వేర్‌ను కూడా ఉపయోగిస్తున్నారు.


రెడీ మిక్స్‌ విషయంలో...

రెడీ మిక్స్‌ కాంక్రీట్‌ తయారీలో ఎంత మొత్తంలో సిమెంట్‌, ఇసుక కలపాలి అన్నది స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ నిర్ణయిస్తుంటారు. ఈ దశలో ఎక్కువగా మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే రెడీ మిక్స్‌ ప్లాంట్‌లో ప్రత్యేకమైన సెన్సార్‌ని అమర్చడం ద్వారా దీన్ని అడ్డుకుంటున్నారు. ఈ సెన్సార్‌ తేమ శాతం మొదలుకుని కీలకమైన విషయాలను ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తూ ఉంటుంది. అలాగే కాంక్రీట్‌  గరిష్టంగా 30 నుంచి 40 నిమిషాలలోపు నిర్మాణ స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. అందుకోసం కాంక్రీట్‌ని రవాణా చేసే వాహనంలో ప్రత్యేకంగా జీపీఎస్‌ ట్రాకింగ్‌ అమర్చుతున్నారు. దాని ద్వారా రియల్‌ టైమ్‌ సమాచారాన్ని కాంక్రీట్‌ని కొనుగోలు చేసే వ్యక్తికి చేరవేయడం ద్వారా మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉండే విధంగా చేస్తున్నారు. వాహనం బయలుదేరిన ప్రదేశం, గమ్యస్థానం, లోడ్‌, ట్రక్‌ మోడల్‌, వాహనంలో డ్రైవర్ల సంఖ్య  వంటి అనేక అంశాలను ఆసరాగా చేసుకుని భవన నిర్మాణ సామగ్రిని చేరవేసే వాహనం సరిగ్గా ఏ సమయానికి చేరుకుంటుందో అంచనా వేసే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేశారు.


అనేక రకాల సెన్సార్లు

మహీంద్రా లాంటి ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు సెక్యూరిటీ కెమెరాలు, స్కానర్లని అమర్చి చేతులు దులుపుకోకుండా తాము నిర్మించే గృహ సముదాయాల్లో అనేక రకాల అధునాతన సెన్సార్లు బిగిస్తున్నాయి. గ్యాస్‌ లీక్‌ సెన్సార్‌ ఇంట్లో గ్యాస్‌ లీక్‌ అయితే ఇంటి యజమానికి ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ ఆటోమేటిగ్గా పంపించడంతో పాటు, దగ్గర్లో ఉన్న కాల్‌ సెంటర్‌కి దానంతట అదే కాల్‌ వెళ్ళిపోతుంది. అద్దాలు పగిలిపోతే గుర్తించే సెన్సార్లు, ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలను నియంత్రించే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ డివైజ్‌లను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు.


ప్రీ-కాస్టింగ్‌ కూడా

భవన నిర్మాణం విషయంలో డిజిటల్‌ టెక్నాలజీతో పాటు ప్రీ-కాస్ట్‌ టెక్నాలజీ కూడా ప్రాచుర్యం చెందుతోంది. ఒక భవనానికి సంబంధించిన అధిక శాతం నిర్మాణం ఫ్యాక్టరీలో తయారయి, అది వివిధ భాగాలుగా గమ్యస్థానానికి చేర్చి, అక్కడ అసెంబుల్‌ చేయడం జరుగుతుంది. వాస్తవానికి ఇది దశాబ్దకాలంగా సింగపూర్‌లో వినియోగంలో ఉన్న టెక్నాలజీ అయినప్పటికీ, మనదేశంలో దీన్ని వాడటానికి డెవలపర్లు కొద్దిగా వెనకంజ వేస్తూ వచ్చారు. ఇటీవలి కాలంలో ఈ టెక్నాలజీ ఊపందుకుంటోంది.


అన్ని చోట్లా...

భవన నిర్మాణం విషయంలో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ల్యాండ్‌ రికార్డ్‌లను పరిశీలించడం, ఒక ప్రదేశంలో ఉండే జనసాంద్రత వంటి విషయాలను డ్రోన్‌ మ్యాపింగ్‌ ద్వారా విశ్లేషించటం, ఆటో క్యాడ్‌ వంటి వాటితో ఫ్లోర్‌ప్లాన్లని రూపొందించడం, క్లౌడ్‌ ఆధారంగా ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, వినియోగదారులకు టెక్నాలజీ ఆధారంగా మరిన్ని సదుపాయాలు కల్పించడం, భవన నిర్మాణంలో కొత్త విధానాలను అనుసరించడం ద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించి, నాణ్యత పెంచడం వంటి పద్ధతులను రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇటీవల అనుసరిస్తున్నారు.


ముందే అనుభూతి చెందేలా!

ఒక భవనం నిర్మాణం పూర్తయ్యాక ఎలా ఉంటుందో వర్చ్యువల్‌ రియాలిటీ ఆధారంగా చూడవచ్చు. ఫ్లిప్‌ స్పేసెస్‌ అధికారిక వెబ్‌సైట్లో ఒక వర్క్‌స్పే్‌సని పూర్తి కావటానికి ఎనిమిది వారాల ముందే పూర్తయ్యాక ఎలా ఉంటుందో చూసి అనుభూతి చెందవచ్చు. ‘విజ్‌ వాక్‌’ అనే వర్చ్యువల్‌ రియాలిటీ అప్లికేషన్‌ అన్‌రియల్‌ ఇంజిన్‌ ఆధారంగా ఇంటీరియర్‌ డిజైనింగ్‌, విజువలైజేషన్‌ సదుపాయాలను కస్టమర్లకు అందిస్తోంది. క్యాడ్‌ డ్రాయింగులు, ఇతర ఫైళ్లను ఆ సాఫ్ట్‌వేర్‌కి అందిస్తే వాటి ఆధారంగా దానంతట అదే ఒక వర్చ్యువల్‌ ఇమేజ్‌ సృష్టిస్తుంది. 


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothusridhar

Updated Date - 2020-02-15T06:04:31+05:30 IST