కమల దళంలో కలకలం

ABN , First Publish Date - 2020-08-09T08:51:15+05:30 IST

క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకొనే బీజేపీలో కొత్త కమిటీ కూర్పు కలకలం సృష్టిస్తోంది. కొంత మంది సీనియర్‌ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ నాయకత్వం ఈ కమిటీని ఆమోదించిందో అంతుబట్టడం లేదని వాపోతున్నారు...

కమల దళంలో కలకలం

  • కమిటీ కూర్పుపై సీనియర్‌ నేతల పెదవివిరుపు.. 
  • రాజాసింగ్‌ వ్యాఖ్యలపై అంతర్గతంగా చర్చ
  • అసంతృప్తిపై జాతీయ నాయకత్వం సీరియస్‌!
  • క్రమశిక్షణ ఉల్లంఘిస్తే  చర్యలేనని సంకేతాలు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకొనే బీజేపీలో కొత్త కమిటీ కూర్పు కలకలం సృష్టిస్తోంది. కొంత మంది సీనియర్‌ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏయే అంశాలను  పరిగణనలోకి తీసుకుని జాతీయ నాయకత్వం ఈ కమిటీని ఆమోదించిందో అంతుబట్టడం లేదని వాపోతున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోవడం కంటే అవమానకరంగా తిరస్కరించడం ఎక్కువ బాధ కలిగిస్తోందని పేర్కొంటున్నారు. అయితే, సీనియర్లుగా చెలామణి అవుతున్న నేతల్లో కొంతమందికి అంతగా ప్రజాదరణ లేదన్న వాదన కూడా  పార్టీ వర్గాల్లో ఉంది. ఈ సారి 9 మంది అధికార ప్రతినిధులు, ఇద్దరు కార్యదర్శులు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి.. మొత్తంగా 14 పదవులను జాతీయ నాయకత్వం తగ్గించింది. ఇది కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కు కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ కారణంగానే కొంత మంది సీనియర్‌ నేతలకు పదవులు దక్కలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, తాజా పరిణామాల దృష్ట్యా కొంతమంది సీనియర్‌ నేతలకు జాతీయ స్థాయిలో పదవులు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొంత మందికి పార్టీ పదవులు, మరి కొంత మందికి నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టే ప్రతిపాదన ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, అసంతృప్త నేతలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర పార్టీని జాతీయ నాయకత్వం ఆదేశించినట్లు తెలిసింది. పార్టీని విమర్శించినా, క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు తేలినా... చర్యలు తప్పవని జాతీయ అధ్యక్షుడు నడ్డా సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఎవరెవరు.. ఏం మాట్లాడారో పేర్కొంటూ జాబితా పంపించాలని ఆదేశించినట్లు తెలిసింది. స్థాయితో సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు బాధ్యతతో పని చేయాల్సిందేనని తేల్చి చెప్పినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.  


రాజాసింగ్‌ వ్యాఖ్యల కలకలం

రాష్ట్ర కమిటీలో తన నియోజకవర్గం నుంచి ఒక్కరికీ అవకాశం ఇవ్వలేదని, తన అభిప్రాయం తీసుకోకుండా మరో సారి పక్కన బెట్టారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ‘‘నా నియోజకవర్గంలో ఒక్క డివిజన్‌ అధ్యక్షుడిని కూడా నియమించుకునే అవకాశం లేదు. ఎమ్మెల్యేగా నన్ను రెండుసార్లు గెలిపించిన నియోజకవర్గం నుంచి రాష్ట్ర కమిటీకి సమర్థులే లేరా? మీ నాయకత్వంలోనైనా పార్టీ వైఖరిలో మార్పు వస్తుందని భావించాను.. కానీ అది కనిపించడం లేదు.. గ్రూపిజం మాని.. పార్టీ బలోపేతం కోసం కష్టపడదాం’’ అంటూ  సంజయ్‌కు రాజాసింగ్‌ వాట్సా్‌పలో మెసేజ్‌ పెట్టడం అంతర్గతంగా చర్చకు దారి తీసింది. అయితే, రాజాసింగ్‌ అభిప్రాయం కోరినా నాయకుల పేర్లు ఇవ్వలేదని.. పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలన్నింటినీ ఇప్పటికే కొంత మంది నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందోనన్న చర్చ జరుగుతోంది. మరోవైపు, పలు సమీకరణాలతో కొత్త కమిటీని జాతీయ నాయకత్వం ఆమోదించినా, అంకితభావంతో పని చేసిన వారికి అవకాశం కల్పించకపోవడం పార్టీకే ఇబ్బందికరమన్న వాదన వినిపిస్తోంది. సమర్థులను కాదని, ప్రజల్లో అంతగా ముఖ పరిచయం కూడా లేని వారికి అవకాశం ఇవ్వడం వల్ల పార్టీ ఎలా బలోపేతమవుతుందో వేచి చూడాల్సిందేనని  సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కష్టపడి పని చేసి ఫలితం చూపిస్తే.. విమర్శలకు సమాధానం చెప్పినట్లు అవుతుందని కమిటీ కార్యదర్శి ఒకరు అన్నారు.


Updated Date - 2020-08-09T08:51:15+05:30 IST