పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

ABN , First Publish Date - 2021-07-29T08:43:11+05:30 IST

తెలంగాణలో పర్యటిస్తున్న తైవాన్‌ ఎకనమిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ (టీఈసీసీ), తైవాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (టీఈటీడీసీ), ‘ఇన్వెస్ట్‌ ఇండియా’

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్రిక్‌ వాహన రంగాలకు రాష్ట్రం అనువైన స్థానం

తైవాన్‌ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ 

ప్రభుత్వ భాగస్వామ్యంలో పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటుకు సిద్ధమని వెల్లడి


హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో పర్యటిస్తున్న తైవాన్‌ ఎకనమిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ (టీఈసీసీ),  తైవాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (టీఈటీడీసీ), ‘ఇన్వెస్ట్‌ ఇండియా’ ప్రతినిధుల బృందం బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును ప్రగతిభవన్‌లో కలిసింది. ఈసందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, టీఎస్‌ ఐపాస్‌ విధానం గురించి మంత్రి వారికి వివరించారు. తైవాన్‌కు చెందిన ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర ప్రముఖ రంగాలకు రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను కేటీఆర్‌ తెలిపారు.


గతంలో తానే స్వయంగా తైవాన్‌లో పర్యటించి తెలంగాణలోని వ్యాపార అనుకూలతల గురించి వివరించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. తైవాన్‌ పారిశ్రామిక వర్గాల పెట్టుబడులకు ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌ని సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటు చేేసందుకు గతంలో రాష్ట్ర సర్కారు చేసిన ప్రతిపాదనను ఆయన ప్రస్తావించారు. తైవాన్‌- తెలంగాణ మధ్య పెట్టుబడుల విషయంలో సహకరించాల్సిందిగా టీఈసీసీ డైరెక్టర్‌ జనరల్‌ బెన్‌ వాంగ్‌ను కోరారు. ఇక్కడ ఉన్న పెట్టుబడి అవకాశాలను, తైవాన్‌ పారిశ్రామిక రంగానికి పరిచయం చేసేందుకు తప్పకుండా సహకారాన్ని అందిస్తామని కేటీఆర్‌కు బెన్‌ వాంగ్‌ హామీ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్న రంగాల్లోని ప్రముఖ తైవాన్‌ కంపెనీలతో ఒక వర్చువల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ సెషన్‌ ఏర్పాటు చేయిస్తామన్నారు. సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఎలకా్ట్రనిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌ పాల్గొన్నారు. 

 

మహిళా యూనికార్న్‌ ‘వీ-హబ్‌’ నుంచే

మహిళా పారిశ్రామికవేత్తల నేతృత్వంలోని మొట్టమొదటి యూనికార్న్‌ (1 బిలియన్‌ డాలర్ల) స్టార్టప్‌ ఆవిర్భావానికి హైదరాబాద్‌లోని విమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ హబ్‌ (వీ-హబ్‌) వేదికగా నిలుస్తుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపే స్టార్ట్‌పలను తప్పకుండా ప్రోత్సహిస్తామన్నారు. ఇలాంటి సంస్థలకు ప్రభుత్వమే తొలి కస్టమర్‌గా ఉంటూ ఆర్థిక సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. వీ-హబ్‌లో 47 మంది  శిక్షణను పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. టెక్నాలజీ రంగంలో మహిళా స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు విడ్స్‌,  ఫిక్కీ ఫ్లో- గ్రేటర్‌ 50,  ‘వీ-ఆల్ఫా’ అనే మూడు కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లు వీ-హబ్‌ సీఈవో దీప్తి రావుల వెల్లడించారు.


‘విడ్స్‌’ కార్యక్రమం పాఠశాల విద్యార్థినులకు ప్రత్యేకమని, ఇందుకోసం రెండు పాఠశాలలతో జట్టు కట్టినట్లు తెలిపారు. ‘ఫిక్కీ ఫ్లో - గ్రేటర్‌ 50’.. కళాశాల విద్యార్థినులను స్టార్ట్‌పల ఏర్పాటు దిశగా ప్రోత్సహించేందుకు సంబంధించినదన్నారు. ‘వీ-ఆల్ఫా’.. ఉపాధ్యాయులకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ గురించి అవగాహన కల్పించి విద్యార్థులను ఆ దిశగా చైతన్యపరిచేందుకు ఉద్దేశించినదని చెప్పారు. 

Updated Date - 2021-07-29T08:43:11+05:30 IST