తెలంగాణ వ్యాక్సినేషన్‌ @ 3 కోట్లు

ABN , First Publish Date - 2021-10-23T08:12:33+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మరో మైలురాయికి చేరుకుంది. శుక్రవారంతో తెలంగాణలో మూడు కోట్ల డోసులు పంపిణీ పూర్తయింది. వీరిలో 51 శాతం పురుషులు కాగా, 49 శాతం మంది మహిళలు. అర్హుల్లో మొత్తమ్మీద 76 శాతం మందికి తొలి డోసు ఇచ్చారు.

తెలంగాణ వ్యాక్సినేషన్‌ @ 3 కోట్లు

  • 87% ప్రభుత్వ కేంద్రాల్లోనే.. ప్రైవేటులో 13% 
  • కోటికి ఐదున్నర నెలలు.. 2 కోట్లకు 78 రోజులు
  • గత 37 రోజుల్లోనే మరో కోటిమందికి టీకాలు
  • అందరూ 2 డోసులు తీసుకోవాలి: సీఎస్‌ సోమేశ్‌


హైదరాబాద్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మరో మైలురాయికి చేరుకుంది. శుక్రవారంతో తెలంగాణలో మూడు కోట్ల డోసులు పంపిణీ పూర్తయింది. వీరిలో 51 శాతం పురుషులు కాగా, 49 శాతం మంది మహిళలు. అర్హుల్లో మొత్తమ్మీద 76 శాతం మందికి తొలి డోసు ఇచ్చారు. 30 శాతం మంది రెండో డోసు పొందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 87 శాతం టీకాలను ప్రభుత్వ పంపిణీ కేంద్రాల్లోనే వేశారు. 13 శాతం డోసులను ప్రైవేటులో ఇచ్చినట్లు తెలిపాయి. మరోవైపు తెలంగాణలో తొలి కోటి డోసుల పంపిణీకి ఐదున్నర నెలల సమయం పట్టింది. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తొలినాళ్లలో అపోహల కారణంగా చాలామంది ముందుకురాలేదు. అయితే, సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యాక ప్రజలు టీకా కోసం బారులు తీరారు. వ్యాక్సిన్‌ తీసుకునేవారు ఎక్కువగా ఉన్నా.. లభ్యత తగ్గింది. తర్వాత మెల్లమెల్లగా టీకాల ఉత్పత్తి పెరిగి వ్యాక్సినేషన్‌ ఊపందుకుంది. రెండు కోట్ల డోసులకు చేరేందుకు 78 రోజులు పట్టింది. మరోవైపు సెకండ్‌ వేవ్‌ సమయంలో.. వైరస్‌ వ్యాప్తికి కారకులుగా నిలిచేవారికి టీకాలిచ్చారు.


ముందుగా జీహెచ్‌ఎంసీలో దీనిని ప్రారంభించారు. అలాగే, ప్రత్యేక కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 7,970 సంచార బృందాలను ఏర్పాటు చేశారు.  ఇక నిల్వలు సమృద్ధిగా చేరాక ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి రోజుకు 4-5 లక్షల మందికి పంపిణీ చేయాలని లక్ష్యం విధించుకుంది. ఈ నేపథ్యంలో 37 రోజుల్లోనే మరో కోటి డోసులు వేయగలిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56 లక్షల డోసులు అందుబాటులో ఉన్నట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు చెప్పారు. హైదరాబాద్‌లో మరో 24 గంటల టీకా పంపిణీ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.


టీకా తీసుకున్నవారికి ప్రమాదం లేదు: సీఎస్‌

కరోనా పూర్తిగా పోలేదని, ప్రతి ఒక్కరూ టీకా రెండు డోసులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సూచించారు. 3 కోట్ల డోసులు పంపిణీ పూర్తి సందర్భంగా కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల (డీహెచ్‌) కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్య ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. కొవిడ్‌ ప్రభావం ఉన్నప్పటికీ టీకా పొందిన వారికి ప్రమాదం లేదన్నారు.  సర్కారీ దవాఖానాల్లో ఇకపై ఆక్సిజన్‌ సమస్య తలెత్తదని స్పష్టం చేశారు. నెలలోపే మరో మైలురాయిని చేరుకుంటామని డీహెచ్‌ గడల ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-23T08:12:33+05:30 IST